ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఒక విధంగా వైసిపిని నిర్వీర్యం చేశారు. పార్టీ వ్యవస్థను పట్టించుకోకుండా కొత్తగా సృష్టించిన వాలంటీర్ వ్యవస్థపైననే ఆశలు పెట్టుకున్నారు. ప్రభుత్వ పధకాల అమలు నుండి వచ్చే ఎన్నికలలో ఓట్లు వేయించేవరకు వాలంటీర్లనే నమ్ముకొంటున్నారు.
అయితే టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుకు అధికారమలో ఉన్నప్పుడు సృష్టించిన జన్మభూమి కమిటీలు ఏ విధంగా జనాన్ని దూరం చేసి, ఎన్నికలలో ఓటమికి కారణమయ్యాయి, ఇప్పుడు వాలంటీర్లు కూడా ఆ విధంగానే తయారవుతున్నారని క్షేత్రస్థాయిలో వైసిపి నేతలందరూ స్పష్టం చేస్తున్నారు.
వాలంటీర్లకు తోడుగా పార్టీ తరపున గృహ సారధులను నియమిస్తున్నారు. అయితే వీరంతా రాజ్యాంగతీత శక్తులుగా మారుతూ ప్రజలను, చివరకు పార్టీ కార్యకర్తలను సహితం జగన్ కు దూరం చేయడానికే ఉపయోగపడే సూచనలు కనిపిస్తున్నాయి. గ్రామాలలో వాలంటీర్లు చెప్పిందే వేదంగా నడుస్తున్నది.
తమకు ముఖ్యమంత్రి మద్దతు ఉందన్న అహంకారంతో వారు పార్టీ ఎమ్యెల్యేలు, మండల నాయకులు, చివరకు సర్పంచులు చెప్పిన మాట కూడా వినడం లేదు. బర్త్ సర్టిఫికెట్, రైతుల పాస్ బుక్ ల నుండి ప్రభుత్వం నుండి ఎటువంటి పత్రం కావాలన్నా ముడుపులు చెల్లించనిదే పనులు చేయడం లేదు.
వీరి ధోరణి చూసి పార్టీ ఎమ్యెల్యేలు, మండల పార్టీ అధ్యక్షులు, సర్పంచులు ఏవగించుకొంటున్నారు. “వారిని నమ్ముకొంటే వారు పోలింగ్ రోజున ఓటర్లను తీసుకొచ్చి, ఓట్లు వేయిస్తారా?” అంటూ వైసిపి శ్రేణులే ప్రశ్నిస్తున్నారు. స్థానిక సామాజిక పరిస్థితులపై అదుపు గల పార్టీ నేతలు లేకుండా ఓట్లను ఏ విధంగా వేపిస్తారంటూ విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
మరోవంక, వైఎస్సార్‌సీపీ నాలుగేళ్ల పాలనతో పాటు ఎంతో ఆర్భాటంగా ప్రకటించిన సంక్షేమ పథకాలతో విద్యావంతులైన యువత సంతోషంగా లేరని ఎమ్యెల్సీ ఎన్నికలు స్పష్టం చేశాయి. అనేక షరతులలో సంక్షేమ కార్యక్రమాల నుంచి చాలా మందిని తొలగించడంపై విమర్శలు వస్తున్నాయి.
అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించకపోవడంతో ఆర్థిక వ్యవస్థ కుదేలైందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాల వల్ల అమరావతి రాజధాని, పోలవరం సాగునీటి ప్రాజెక్టు పనులకు ఆటంకం ఏర్పడింది. మూడు ఎమ్మెల్సీ స్ధానాల ఫలితాలతో పులివెందుల కోటకు బీటలు పడుతున్నాయని, పులివెందుల కోటకు మొదలైన బీటలు త్వరలో తాడేపల్లి ప్యాలెస్ వరకు చేరతాయని బహిరంగంగానే సొంత పార్టీ వారే ఎద్దేవా చేసే పరిస్థితులు చాలా చోట్ల కనిపిస్తున్నాయి. వైనాట్ 175 అని జగన్ ఇప్పుడు అంటే వినాలని ఉందని అంటూ `వై నాట్ పులివెందుల టూ’ అంటూ ఎదురు సవాళ్లు చేస్తున్నారు.