కర్ణాటకలో బీజేపీ ఘోరపరాజయం ఆంధ్ర ప్రదేశ్ లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ముచ్చెమటలు పుట్టిస్తున్నాయి. అందుకు ప్రధానంగా రెండు కారణాలు కనిపిస్తున్నాయి. అక్కడ బీజేపీ సర్కారును ప్రజలు ఓడించడానికి ప్రధాన కారణం అవినీతి, కాంట్రాక్టు పనుల్లో బాహటంగా 40 శాతం వరకూ పర్సంటేజీలు తీసుకోవడమే కారణం.
మరోవంక, బెంగుళూరులో జగన్ కు చెప్పుకోదగిన ఆస్తులు ఉండటం. తండ్రి మరణం వరకు, ఆ తర్వాత అధికారంలోకి వచ్చే వరకు కూడా బెంగుళూరు కేంద్రంగానే జగన్ వ్యాపార కార్యకలాపాలు అన్ని జరుగుతూ ఉండెడివి. అక్కడ ఉన్న రాజప్రసాదం వంటి ఇంట్లోనే ఉండేవారు.
ప్రభుత్వంలో విచ్చలవిడి అవినీతితో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడడంతో దక్షిణాదిన ఉన్న ఏకైక బీజేపీ ప్రభుత్వ పతనానికి కారణమైంది. ఏపీలో కూడా ఇదే తరహా పరిస్థితి నెలకొంది. సీఎం జగన్ కు ప్రతి నెలా రూ 20,000 కోట్ల ఆదాయం అంటూ ఓ మంత్రి తనతో చెప్పారని ఈ మధ్య బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు పేర్కొనడం గమనార్హం.
ఏపీలో ఏడాదిలోపే సార్వత్రిక ఎన్నికలు జరుగనున్నాయి. ఈ తరుణంలో జగన్ సర్కారుపై జనంలో వ్యతిరేకత ప్రబలిపోయింది. ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంతో తమ వద్దకు వస్తున్న వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులను, ఐ-ప్యాక్ బృందాలను ప్రజలు ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు.
ముఖ్యంగా మహిళల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. వైసీపీ నేతలు భయపెట్టి, బెదిరించి పోలీసుల సహకారంతో ‘జగనన్నే మా భవిష్యత్తు’ అంటూ స్టిక్కర్లు ఇంటిని అతికించడంతో కూడా ప్రజల్లో ఆగ్రహం వెల్లువెత్తుతోంది.
మరోవంక, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో జగన్ మైత్రీబంధం సామాన్యులకూ అర్థమైపోయింది. ప్రత్యేక హోదా, విభజన హామీలపై ఈ నాలుగేళ్లలో ఒక్కనాడైనా గట్టిగా అడిగిన పాపాన పోలేదు. విశాఖ స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్ చేయలేదు.
ప్రతిపక్షంలో ఉండగా ప్రత్యేక హోదా కోసం ప్రధాని మోదీ చొక్కా పట్టుకుని చంద్రబాబు నిలదీయాలని డిమాండ్ చేసిన జగన్ తాను గద్దెనెక్కాక కేసుల కోసం సాగిలపడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. పోలవరం ప్రాజెక్టుకు నిధులు ఇవ్వకపోయినా, సవరించిన అంచనా వ్యయాన్ని కేంద్రం ఆమోదించకపోయినా సీఎం నిలదీయలేక పోతున్నారు.
కర్ణాటకలో తెలుగు ప్రజలు ఎక్కువగా ఉండే జిల్లాల్లో ఓటర్లు బిజెపికి వ్యతిరేకంగా ఓటువేయడం గమనిస్తే జగన్ ప్రభుత్వం పట్ల తెలుగు ప్రజలలో నెలకొన్న ఆగ్రవేశాలు అక్కడ బిజెపిని కూడా కాటేసిన్నట్లు స్పష్టం అవుతుంది.
కర్ణాటకలో మొత్తం 10 జిల్లాల్లో 63 నియోజకవర్గాలకు గాను బీజేపీ గెలిచింది కేవలం 9 స్థానాల్లో మాత్రమే. బెంగళూరులో నగరంలో ఉత్తర భారతదేశానికి చెందినవారు అధికంగా ఉండే ప్రాంతంలో బీజేపీ అధిక స్థానాలు సాధించగా, తెలుగువారు నివసించే ప్రాంతాల్లో కాంగ్రెస్ స్వీప్ చేసింది. ఇవ్వన్నీ బిజెపి – జగన్ మైత్రి కారణంగా ఇద్దరూ రాజకీయంగా భారీ మూల్యం చెల్లించవలసిన పరిస్థితి నెలకొందని స్పష్టం చేస్తున్నాయి.
ఇలా ఉండగా, జగన్‌కు సన్నిహితుడైన కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దనరెడ్డి ‘కల్యాణ రాజ్య ప్రగతి పక్ష ’ అనే కొత్త పార్టీ పెట్టుకొని బిజెపి ఓటమిలో తనవంతు పాత్ర వహించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన భార్య, ఇతరులు ఓడినా తాను మాత్రం గంగావతిలో విజయం సాధించారు.
బీజేపీ ఓట్లను కేఆర్‌పీపీ చీల్చడం వల్లే బళ్లారి ప్రాంతంలో కాంగ్రెస్ గెలిచిందని అంటున్నారు. జగన్ మంత్రివర్గంలో సీనియర్ మంత్రి ఒకరు కర్ణాటకలో తెలుగువారు నివసించే ప్రాంతంలో మకాం వేసి బీజేపీకి ప్రచారం చేసినా ఫలితం లేకపోయిందని తెలుస్తున్నది. ఆయన పర్యటించిన ప్రాంతంలో 18 మంది బీజేపీ అభ్యర్థులు ఓడినట్లు చెబుతున్నారు.