ఎగ్జిక్యూటివ్ రాజధానిని విశాఖకు తీసుకు రావడం ద్వారా యావత్ ఉత్తరాంధ్రను కళ్లు చెదిరేలా అభివృద్ధి చేసేస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు చెబుతున్న మాయమాటలను వారు నమ్మలేదు. కాస్త చదువుకున్న వారు, ఆలోచన ఉన్న వారు ఎవ్వరూ జగన్ సర్కారు చెబుతున్న అభివృద్ధి మంత్రాన్ని విశ్వసించడం లేదు అని నిరూపణ అయింది. ఉత్తరాంధ్ర పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దారుణంగా ఓడిపోయింది.
విశాఖలో రాజధాని, మనం అద్భుతాలు సృష్టించేయబోతున్నాం.. రాజధాని కావాలంటే మనం వైఎస్సార్ కాంగ్రెస్ ను నెత్తిన పెట్టుకోవాలి.. జగనన్నకు రుణపడి ఉండాలి.. జగనన్న లేకపోతే మన ఉత్తరాంధ్ర నాశనం అయిపోతుంది.. ఉత్తరాంధ్ర మీద కక్ష కట్టినవాళ్లు మాత్రమే అమరావతి రాజధానికి మద్దతిస్తున్నారు… ఇలాంటి రకరకాల వాక్యాలతో వైకాపా నాయకులు విస్తృతంగా ప్రచారం చేశారు. అయితే వారి పప్పులేమీ ఉడకలేదు. విశాఖ రాజధాని ముసుగులో వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులందరూ విశాఖలో దందా సాగిస్తున్నారనే వాదనకే ప్రజల మన్నన దక్కింది. చదువుకున్న వాళ్లు ఆలోచన పరులు, పట్టభద్రులు వైసీపీని తిప్పికొట్టారు. ఉత్తరాంధ్రలో పరాజయం మూటగట్టుకున్నారు. ఇదేమీ ఆషామాషీ విజయం కాదు. తొలినుంచి తెదేపా ఆధిక్యమే కొనసాగుతూ వచ్చింది.
ఉత్తరాంధ్ర వైసీపీని తిప్పికొట్టిందంటే.. అదే సమయంలో రాయలసీమ కూడా ఏం పెద్దగా ఆదరించలేదు. తూర్పు రాయలసీమ పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా తెలుగుదేశం సుమారు పదివేల ఆదిక్యంతో నడుస్తోంది. అదే సమయంలో పశ్చిమ రాయలసీమ ఎమ్మెల్సీ విషయంలో వైసీపీ దే ఆధిక్యం అయినా.. మెజారిటీ కేవలం రెండువేల ఓట్లు మాత్రమే.
ఈ పట్టభద్ర ఎన్నికలు.. జగన్ పాలన పట్ల ప్రజల్లో వెల్లువెత్తుతున్న వ్యతిరేకతను చాలా స్పష్టంగా చాటిచెబుతున్నాయి. పట్టభద్రుల ఎన్నికల ఫలితాలు సార్వత్రిక ఎన్నికల్లో కూడా ప్రతిఫలించే అవకాశం చాలా ఉంటుంది. దీన్ని బట్టిచూస్తే ప్రభుత్వ పాలన పట్ల ఎవ్వరూ పెద్ద సంతృప్తిగా లేరనే సంగతి అర్థమవుతోంది. మరి ఈ పరిణామాలను జగన్మోహన్ రెడ్డి ఎలా అర్థం చేసుకుంటారో.. ఎలా స్పందిస్తారో.. ముందస్తు ఆలోచనలేమైనా ఉంటే వాయిదా వేసుకుంటారో .. లేదా, మిగిలిఉన్న ఒక్క ఏడాదిలో పార్టీకి నష్ట నివారణ చర్యలు చేపడతారో.. గమనించాలి.
జగన్ కు బుద్ధి చెప్పిన ఉత్తరాంధ్ర!
Wednesday, December 18, 2024