`సోము వీర్రాజును రాష్ట్ర అధ్యక్షుడిగా తొలగించండి.. ఏపీలో బీజేపీని కాపాడండి’ నినాదంతో ఢిల్లీకి వెళ్లిన ఏపీ అసమ్మతి నేతలకు చుక్కెదురైంది. రాష్ట్రంలో బీజేపేని కాకుండా సీఎం వైఎస్ జగన్ అధికారాన్ని కాపాడటం కోసమే వీర్రాజు, పార్టీ ఎంపీ జివిఎల్ నరసింహారావు పనిచేస్తున్నారని ఎంతగా చెప్పినా ఢిల్లీలో సానుకూల సంకేతాలు వ్యక్తం కాలేదు.
పైగా, ఈ ఫిర్యాదుల కోసం ఢిల్లీ దాకా రావాలా? రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు చెప్పవచ్చు కదా? అంటూ వారిని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి, విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి మురళీధరన్ వారిని సున్నితంగా మందలించిన్నటు తెలుస్తున్నది.
అంటే, కేంద్రంలోని మోదీ ప్రభుత్వం వచ్చే ఎన్నికలలో జగన్ కు బాసటగా ఉండేందుకు వ్యూహరచన చేస్తున్నట్లు స్పష్టమైందని ఢిల్లీ వెళ్లిన ఓ ప్రముఖ నాయకుడు స్పష్టం చేశారు. ఏపీలో బిజెపిని బలోపేతం చేయడం, వచ్చే ఎన్నికలలో ఓట్లు పెంచుకొని, కొన్ని సీట్లు గెల్చుకోవడం పట్ల పార్టీ కేంద్ర నాయకత్వంపై ఏమాత్రం ఆసక్తి లేదని తేలిందని చెప్పారు.
మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పార్టీకి రాజీనామా చేస్తూ, టిడిపిలో చేరుతూ తనకు పార్టీ కేంద్ర నాయకత్వంతో ఎటువంటి ఇబ్బంది లేదని, కేవలం సోము వీర్రాజు వైఖరి నచ్చకనే వచ్చానని వెల్లడించడం గమనార్హం. అయినా, ఎంపీ జీవీఎల్ నరసింహా రావు మినహా ఎవరూ కన్నను ఒక్క మాట కూడా అనలేదు.
ఇదే సమయంలో ఎంపీ జీవీఎల్ కు ట్విట్టర్ వేదికగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. పురందేశ్వరి కౌంటర్ కూడా ఇవ్వడంతో వివాదం మరింత ముదిరించి. పార్టీలో సీనియర్ నేతలు తనతో టచ్ లో ఉన్నారని, క్రమంగా టిడిపిలోకి వస్తారని కన్నా చెప్పడం గమనార్హం.
దానితో సోము వీర్రాజుపై అసంతృప్తితో ఉన్న రాష్ట్రంలోని బిజెపి నేతలు ముందుగా గతబుధవారం విజయవాడలో సమావేశం కావాలని అనుకోని, ముందుగా ఢిల్లీ వెళ్లి పెద్దలకు తమ అభిప్రాయలు వ్యక్తం చేద్దామని వెళ్లి ఏపీ బీజేపీ ఇంఛార్జ్ మురళీదరన్ సమావేశమయ్యారు. వెళ్తూనే సోము వీర్రాజు.. జీవీఎల్ పై ఫిర్యాదు చేశారు. సమస్యలు అన్నీ ఏకరువు పెట్టారు.
అయితే వారి సమస్యలు విని, సరిదిచెప్పే ప్రయత్నం చేయకుండా మురళీధరన్ వారి పట్ల ఆగ్రహం వ్యక్తం చేసారని తెలిసింది. ఇంతమంది ఎందుకు వచ్చారు? స్థానికంగా ఉండే విషయాలు తెలియజేయటానికి ఇంతమంది రావాలా? కొంతమంది వస్తే సరిపోదా? ఈ మాత్రం కూడా తెలియదా? అంటూ వారికి చీవాట్లు పెట్టి పంపడంతో వారంతా నివ్వెరపోయారు.
ఢిల్లీలో మురళీధరన్‌తో భేటీ అయినవారిలో రాష్ట్ర బీజేపీ మాజీ ప్రధాన కార్యదర్శి శ్యామ్ కిషోర్, టెక్కలి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు భాస్కర్, కృష్ణాజిల్లా మాజీ అధ్యక్షుడు కుమారస్వామి, మైనార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ కె.బాజి, బొడ్డు నాగలక్ష్మి, రాష్ట్ర మాజీ అధికార ప్రతినిధి శ్రీనివాసరాజు, శ్రీకాకుళం, ఒంగోలు జిల్లాల మాజీ అధ్యక్షులతోపాటు పలువురు నేతలున్నారు.
ఒక విధంగా విసుగు వ్యక్తం చేస్తూ, రెండు రోజుల్లో తాను రాజమండ్రి వస్తానని, మాట్లాడుకునేవి ఏమన్నా ఉంటే అక్కడే మాట్లాడుకుందాం అని చెప్పినట్టు తెలిసింది. పైగా, సోము వీర్రాజును మార్చాలనే డిమాండ్ పట్ల అసహనం కూడా వ్యక్తం చేసిన్నట్లు చెబుతున్నారు.