జగన్ కు ఓటమి తప్పదని విశాఖ శారదా పీఠం గ్రహించిందా!

Wednesday, September 18, 2024

ప్రతిపక్ష నేతగా ఉన్నప్పటి నుండి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కీలకమైన `రాజగురు’గా వ్యవహరిస్తూ, ఆయన అధికారంలోకి వచ్చిన్నప్పటి నుండి `అనధికార ప్రభుత్వ పీఠాధిపతి’ వలే వ్యవహరిస్తున్న విశాఖపట్నంలోని శారద పీఠం అధిపతి స్వామి స్వరూపానంద వచ్చే ఎన్నికలలో జగన్ కు పరాజయం తప్పదని, తీవ్ర ప్రజావ్యతిరేకతను ఎదుర్కొంటున్నారని గ్రహించారా?

తమకు రాజకీయ పార్టీలకు, రాజకీయాలతో ఎటువంటి అనుబంధం, సంబంధం లేదంటూ తాజాగా స్వామి స్వాత్మానంద ఎన్నడూ లేని విధంగా ప్రకటించడం చూస్తుంటే జగన్ తో తమకు సంబంధం లేదన్న సంకేతాలు ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్లు స్పష్టం అవుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికార పార్ట్టీల అధినేతలతో సన్నిహితంగా వ్యవహరిస్తూ, ఇప్పుడు ఆ `మచ్చ’ చెరిపివేసుకొనే ప్రయత్నం చేస్తున్నారా? అనే అనుమానాలు కలుగుతున్నాయి.

2019 ఎన్నికలకు ముందు స్వరూపానందేంద్ర నిర్వహించిన రాజశ్యామల యాగం వల్ల జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రాగలిగారని అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. తాజాగా, తిరిగి జగన్ ను అధికారంలోకి తీసుకు రావడంకోసం హర్యానాలో గత నెల 10 నుంచి 26 వరకు లక్ష చండీ మహాయజ్ఞం నిర్వహించినట్లు కూడా వార్తలు వచ్చాయి.

తరచూ ముఖ్యమంత్రులు, మంత్రులు, అధికార పార్టీ నేతలు మాత్రమే కాకుండా సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు సహితం పీఠం సందర్శించి స్వామివారితో భేటీ కావడం జరుగుతూ ఉంటుంది. విశాఖపట్నం ప్రాంతంలో భూకబ్జాల వంటి ఆరోపణలతో సహితం పీఠం ప్రసక్తి పలుమార్లు వచ్చింది. అయినా, ఎన్నడూ అధికార పార్టీతో తమకు సంబంధం లేదని చెప్పుకొనే ప్రయత్నం చేయలేదు. ఇప్పుడే అటువంటి ప్రయత్నం చేస్తుండటం గమనార్హం.

 రాజకీయ పార్టీలతో సన్నిహిత సంబంధాలతో తరచూ వార్తల్లో నిలిచే పీఠానికి పార్టీలతో ఎలాంటి రాజకీయ సంబంధాలు లేవని చిన్న స్వామి చెప్పారు.

విశాఖ శారదా పీఠానికి ఎలాంటి రాజకీయ పార్టీలతో అనుబంధాలులేవని, ఒక రాజకీయపార్టీకి అనుబంధంగా పనిచేస్తున్నట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి స్పష్టం చేశారు. విశాఖ శ్రీ శారదాపీఠం ఎవరికీ వత్తాసు పలకదని.. హిందూ ధర్మం వైపే నిలబడుతుందని పేర్కొన్నారు.

పైగా, తాము రాజకీయ పార్టీల కోసం పూజలు చేయడం లేదని,, రాజశ్యామల అమ్మవారి అనుగ్రహం కోరుకునే వారి కోసం మాత్రమే పీఠంలో పూజలు నిర్వహిస్తున్నామని సంజాయిషీ చెప్పుకునే రీతిలో తెలిపారు. విశాఖ శ్రీ శారదాపీఠానికి వ్యక్తిగత ఆలోచనలు ఉండబోవని, సమాజ హితం కోసం మాత్రమే పని చేస్తుందని స్పష్టం చేశారు.

విశాఖ శారదా పీఠం ఒక రాజకీయపార్టీకి అనుబంధంగా పనిచేస్తున్నట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి. ప్రతి ఒక్కరిలో ఆధ్యాత్మిక చింతన పెంపొందించాలనే ఉద్దేశంతో పీఠం ఎన్నో కార్యక్రమాలు చేపడుతోందని.. అందుకు రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, సామాజికవేత్తలు సహకారం అందిస్తున్నారని చెప్పారు.

ఎవరైనా శారదా పీఠాన్ని ఆశ్రయిస్తే యాగాలు చేస్తాం తప్పితే ఏ పార్టీకో, వ్యక్తికో అధికారం రావాలని ఎప్పుడూ చేయలేదు, చేయబోమని స్పష్టం చేశారు.  విశాఖ శ్రీ శారదాపీఠం పర్యవేక్షణలో విజయవంతంగా సాగిన శ్రీ లక్ష చండీ మహా యజ్ఞంపై త్వరలో డాక్యుమెంటరీని రూపొందించబోతున్నామని తెలిపారు. ఈ భూమండలంపై లక్ష చండీ మహా యజ్ఞాన్ని తొలిసారి నిర్వహించిన ఘనత విశాఖ శ్రీ శారదాపీఠానికే దక్కుతుందని చెప్పారు. 

కాగా, స్వామి స్వరూపానంద తీరుపై ప్రతిపక్ష పార్టీలు గతంలో తీవ్ర స్థాయిలో విమర్శలు సైతం చేశాయి. ఈ నేపథ్యంలో పీఠం ఉత్తరాధికారి స్వామి స్వాత్మానందేంద్ర ఇప్పుడు వివరణ ఇవ్వడం ప్రాధాన్యత సంతరింప చేసుకుంది.  శారదా పీఠంపై మొదటి నుంచి కొందరు ఉద్దేశ పూర్వకంగా రాజకీయ ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారని అంటూ నిందించారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles