జగన్ కు ఎన్నికల ముందు కంటకంగా వివేకా హత్యకేసు!

Sunday, December 22, 2024

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కేసుపై సుప్రీంకోర్టు దృష్టి పెడుతున్నప్పటి నుండి వైసీపీ నేతలలో ఖంగారు స్పష్టంగా కనిపిస్తున్నది. ప్రతిపక్ష నేతగా తాను డిమాండ్ చేసిన సిబిఐ దర్యాప్తును అడ్డుకోవడానికి ఎంతగా ప్రయత్నించినా సాధ్యం కాకపోవడం, ఆ తర్వాత ఏపీలో సీబీఐ బృందాలకు బెదిరంపులు ఎదురవుతున్నాయని పేర్కొనడంతో ఏపీ హైకోర్టు నుండి తెలంగాణ హైకోర్టుకు కేసును బదిలీ చేయడంతో మరింత ఆందోళనకు దారితీస్తుంది.

ఇప్పుడు ఈ కేసులో కీలక నిందితుడైన, కడప ఎంపీ అవినాష్ రెడ్డికి సన్నిహితుడుగా భావిస్తున్న ఏ-1 ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ ను సుప్రీంకోర్టు హైదరాబాద్ లోని హైకోర్టుకు బదిలీ చేయడంతో ఈ కేసు దర్యాప్తు వేగం పుంజుకొని అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ కేసులో మెరిట్స్ ఆధారంగా బెయిల్ రద్దు చేయాలా? లేదా? అన్నది నిర్ణయించాలని తెలంగాణ హైకోర్టును సుప్రీంకోర్టు ఆదేశించడం గమనార్హం. 

గంగిరెడ్డి బెయిలును రద్దు చేయాలని సిబిఐ సుప్రీం కోర్టును ఆశ్రయించగా అందుకు తిరస్కరించడం ద్వారా హైకోర్టుకు సుప్రీంకోర్టు పరోక్షంగా బెయిల్ రద్దుకు సానుకూలత వ్యక్తం చేస్తున్నట్లు సందేశం నచ్చినట్లే అని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు పేర్కొంటున్నారు. గతంలో ఏపీ పోలీసులు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును విచారిస్తున్న సమయంలో 90 రోజుల పాటు చార్జిషీట్ దాఖలు చేయకపోవడం వల్లే ఎర్ర గంగిరెడ్డి కి స్టాచ్యూరిటీ బెయిల్ లభించడం గమనార్హం.

వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ ఆంధ్రప్రదేశ్‌లో సజావుగా సాగే పరిస్థితి లేదని, సాక్షులతో పాటు దర్యాప్తు అధికారులను సైతం బెదిరిస్తున్నారని ఆరోపిస్తూ వివేకా కుమార్తె డా. సునీత రెడ్డి పిటిషన్ దాఖలు చేయడంతో సుప్రీంకోర్టు తొలుత ఆ పిటిషన్ విచారణ చేపట్టింది. వాదోపవాదాల అనంతరం కేసు విచారణను తెలంగాణలోని సీబీఐ స్పెషల్ కోర్టుకు బదిలీ చేస్తూ తీర్పునిచ్చింది.

తాజాగా గంగిరెడ్డి బెయిల్ రద్దు కోరుతూ దాఖలైన పిటిషన్‌పై చేపట్టిన ధర్మాసనం ఒకవేళ బెయిల్ వ్యవహారంపై పునర్విచారణకు ఆదేశిస్తే ఏ రాష్ట్రంలోని హైకోర్టుకు పంపాలని సీబీఐని అడిగింది. ట్రయల్ కోర్టు విచారణ తెలంగాణకు బదిలీ చేసినందున, బెయిల్ రద్దు వ్యవహారాన్ని కూడా ఆ రాష్ట్ర హైకోర్టుకే బదిలీ చేయాలంటూ సీబీఐ ధర్మాసనాన్ని కోరింది.

దీంతో సోమవారం ఇచ్చిన తీర్పులో గంగిరెడ్డి బెయిల్ రద్దు వ్యవహారంపై తెలంగాణ హైకోర్టు మొదటి నుంచి విచారణ జరపాలని, ఈ క్రమంలో చట్ట ప్రకారం మెరిట్స్ ఆధారంగా అన్ని అంశాలను పరిగణలోకి తీసుకోవాలని సూచించింది.  తెలంగాణ హైకోర్టులో ఒక వేళ గంగిరెడ్డి బెయిల్ రెడ్డయితే ఈ కేసులో అనూహ్య పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉన్నట్లు పలువురు భావిస్తున్నారు. అదే జరిగితే ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రతిపక్షాలకు ఓ ఆయుధంగా మారే అవకాశం ఉంటుంది. 

పైగా, కడప లోక్ సభ అభ్యర్థి విషయంలో ఏర్పడిన వివాదం కారణంగానే వివేకానంద రెడ్డి హత్యకు గురైనట్లు స్వయంగా జగన్ సోదరి వైయస్ షర్మిల కూడా అనుమానం వ్యక్తం చేయడం గమనార్హం.  కడప సీటు కోసం పట్టుబడిన వివేకానందరెడ్డి తాను కానీ పక్షంలో వైఎస్ విజయమ్మ లేదా షర్మిలకు ఇవ్వాలని కూడా సూచించాడని, అవినాష్ రెడ్డికి మాత్రం వ్యతిరేకించారని కూడా ఈ సందర్భంగా చెప్పారు. ఈ హత్య వెనుక ఉన్న రాజకీయ కోణంను వెలికితీసే ప్రయత్నం సిబిఐ చేస్తుండడం జగన్ ప్రభుత్వంలో కలవరం కలిగిస్తోంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles