దశాబ్దాల తరబడి రాజకీయాలతో సంబంధం లేకుండా ఆర్ కృష్ణయ్య బిసిల కోసం రాజీలేని పోరాటాలు చేస్తున్నారు. వారి సాధికారికత కోసం తన స్వరాన్ని వినిపిస్తున్నారు. మొదటిసారిగా 2014లో టిడిపి అభ్యర్థిగా ఎన్నికలలో పోటీచేసి తెలంగాణ అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆ తర్వాత రెండేళ్ల క్రితం ఏపీ నుండి వైసీపీ కోటాలో రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆయా పార్టీల నుండి చట్టసభలకు ఎన్నికైనా ఆయన ఆయా పార్టీల రాజకీయాలలో భాగస్వామి కావడం లేదు. బిసిల రాజకీయ సాధికారత ద్వారానే వారి ఆర్థిక, సామాజిక ఉన్నతి సాధ్యమవుతుందని నమ్ముతూ ఆ దిశలో అన్ని రాజకీయ పార్టీలపై వత్తిడి తెచ్చేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు.
బిసిలకు సంబంధించిన అంశాలపై, ముఖ్యంగా జనాభా గణనలో బిసిలను కూడా గణించాలనే డిమాండ్ తో అన్ని పార్టీల నేతలను కలుస్తున్నారు. ఈ విషయంలో బిజెపి ప్రతికూలంగా ఉండడంతో, ఇప్పటివరకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా సానుకూలంగా స్పందించడం లేదు. టిడిపి ఎమ్యెలేగా ఉంటూనే పలు సందర్భాలలో ఆ పార్టీ వైఖరికి వ్యతిరేకంగా గళం విప్పారు. ఇప్పుడు అదే విధంగా వైసీపీ ఎంపీగా ఉంటూ వైఎస్ జగన్ ప్రయోజనాలకు భిన్నంగా బిసిల కోసం తెలంగాణ కాంగ్రెస్ తో చేతులు కలుపుతారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
తిరుగులేని బిసి నేతగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కృష్ణయ్య గుర్తింపు పొందినా రాజకీయంగా ఆమేరకు చెప్పుకోదగిన మద్దతు కూడదీసుకోలేక పోతున్నారు. రాష్ట్ర విభజన అనంతరం 2014లో టీడీపీ ఆయనను తెలంగాణాలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించినా ఆ పార్టీ చెప్పుకోదాగిన మద్దతు బిసిల నుండి పొందలేక పోయింది. తెలంగాణాలో బిసిలు ఇప్పటివరకు ఎక్కువగా బిఆర్ఎస్ కు మద్దతు ఇస్తున్నారు. అయితే ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో ఇక్కడ ఎట్లాగైనా గెలుపొందాలని ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ బిసిల మద్దతుకోసం ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు ఆర్ కృష్ణయ్యను కలిసి మద్దతు కోరడం ఆసక్తి కలిగిస్తుంది.
టీపీసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మానిక్‌రావు ఠాక్రే, మాజీ ఎంపీ వీహెచ్ హనుమంతు హైదరాబాద్‌లోని విద్యానగర్‌లో ఉండే కృష్ణయ్య నివాసానికెళ్లిన భేటీ కావడం రాజకీయంగా కలకలం రేపుతోంది. చాలా రోజులుగా బీసీ జనగణనకు యువనేత రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తున్నారని వారు గుర్తు చేశారు.
రాష్ట్రంలో ఉండే ఓబీసీల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఓబీసీల సమస్యలు, బడ్జెట్, ప్రజా ప్రతినిధుల అంశాలపై కాంగ్రెస్ సానుకూలంగా ఉంటుందని నేతలు హామీ ఇచ్చారు. కృష్ణయ్య డిమాండ్స కాంగ్రెస్ నినాదం వేరు కాదని మాణిక్ ఠాక్రే చెప్పుకొచ్చారు. ఇప్పటికే ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో రెండు అసెంబ్లీ సీట్లు బీసీలకు ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఈ పరిస్థితులలో కాంగ్రెస్ కు అండగా ఉంది, బిసిల మద్దతు సమకూరేటట్లు సహకరించాలని వారు కోరారు.
ఒక విధంగా తెలంగాణలోని ప్రధాన రాజకీయ పార్టీలలో బిసిలకు రాజకీయ ప్రాతినిధ్యం గురించి స్పష్టమైన హామీ కేవలం కాంగ్రెస్ మాత్రమే ఇస్తున్నది. అయితే వైఎస్ జగన్ కాంగ్రెస్ కు వ్యతిరేకంగా తన పార్టీని పెట్టారు. మరోవంక తెలంగాణ సీఎం కేసీఆర్ తో మంచి సంబంధాలు కలిగి ఉన్నారు. కేవలం కేసీఆర్ కు రాజకీయంగా ఇబ్బందులను కలిగించరాదనే వైసీపీ తెలంగాణాలో పోటీ చేయడం లేదు.
కేసీఆర్ ను ఓడించడం కోసం కాంగ్రెస్ తో వైసీపీ ఎంపీగా ఉంటూ కృష్ణయ్య సహకరించగలరా? మరోవంక, జగన్ కేంద్రంలో మోదీ ప్రభుత్వంతో కూడా సన్నిహితంగా ఉంటున్నారు. కాంగ్రెస్ ను ప్రధాన రాజకీయ ప్రత్యర్థిగా మోదీ భావిస్తున్నారు. తెలంగాణాలో కాంగ్రెస్ ను అధికారం చేపట్టకుండా అడ్డుకోనేందుకే కేసీఆర్ తో లోపాయికారి అవగాహనకు వచ్చారనే ప్రచారం జరుగుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ కు సహకరించడం అంటే వైఎస్ జగన్ ను ధిక్కరించడం కాగలదు. అందుకు కృష్ణయ్య సిద్ధపడతారా? రాజకీయంగా ఆసక్తి కలిగిస్తోంది.