జగన్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి ‘కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుంది’ అనే చిన్న సామెత సరిపోదు. ‘ఎదుటివారి మీదకు కత్తిదూస్తే.. అది మన కంట్లోనే పొడుచుకుంటుంది..’ అని కొత్త సామెతలను తయారు చేయాలి. ఎందుకంటే.. పంతానికి పోయి, అర్థపర్థం లేకుడా ఆగ్రహం వ్యక్తం చేస్తే వారి పరువే పోతుంది. ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు రాష్ట్ర గవర్నరును కలిసి, జీతాలు సవ్యంగా చెల్లించేలా ప్రభుత్వం జీవో తెచ్చేలా చూడాలని విన్నవించిన సంగతి తెలిసిందే. ఈ వైనంపై జగన్ సర్కారు ప్రభుత్వ ఉద్యోగుల సంఘంపై కత్తి దూసింది. ‘గవర్నరును కలిసినందుకు’ అని స్పష్టంగా చెప్పకపోయినా.. మీడియాతో మాట్లాడినందుకు, ప్రభుత్వంలో ప్రత్యామ్నాయ వ్యవస్థలతో సంప్రదించకుండా ఇతర మార్గాలను అనుసరించినందుకు.. అసలు మీ సంఘం గుర్తింపును ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలంటూ నోటీసులు ఇచ్చింది. దీనికి ఉద్యోగుల సంఘం వారం రోజుల్లో సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది.
జగన్ ప్రభుత్వం అనుసరిస్తున్న ధోరణులను బట్టి.. ఉద్యోగుల సంఘం ఏ సమాధానం ఇచ్చినా సరే.. వారి గుర్తింపు రద్దు కావడం మాత్రం గ్యారంటీ అని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇలాంటి నోటీసులు ఇచ్చినప్పుడు, సమాధానం వచ్చిన తర్వాత, ‘మీ సమాధానం సంతృప్తికరంగా లేదు’ అని వ్యాఖ్యానించడం, తదుపురి వారు తలచుకున్న చర్యలు తీసుకోవడం చాలా కామన్. అయితే ఉద్యోగుల సంఘంపై కోపంతో ప్రభుత్వం తీసుకోగల గరిష్టమైన కఠిన చర్య వారి గుర్తింపు రద్దు అవుతుంది.
ప్రభుత్వం దూకుడుగా వ్యవహరించి ఈ చర్య తీసుకుంటే గనుక.. ప్రభుత్వానికి మళ్లీ ఎదురుదెబ్బ తప్పదేమో అని పలువురు విశ్లేషిస్తున్నారు. సంఘం మీద కత్తిదూస్తే, అది ప్రభుత్వం కంట్లోనే పొడుచుకుంటుందని భావిస్తున్నారు. సంఘం గుర్తింపును రద్దు చేస్తే.. వారు కోర్టుకు వెళతారు. కోర్టు సాక్షిగా మళ్లీ ఒకసారి ప్రభుత్వం జీతాలు చెల్లించడం లేదని, జీతాలు సరైన సమయానికి రాకపోవడం వలన ఉద్యోగులు ఎన్నెన్ని రకాల ఇబ్బందులు పడుతున్నారో నంటూ.. వారు మొత్తం చరిత్ర అంతా వెల్లడిస్తారు. ఇప్పుడు ఏదో గవర్నరు ముందు కొంతసేపు, మీడియా ముందు కొంతసేపు మాత్రమే తమ కష్టాలు, ప్రభుత్వ వైఖరితో వస్తున్న ఇబ్బందులు చెప్పుకున్నవాళ్లు.. వారి సంఘం గుర్తింపు రద్దయితే.. కోర్టులో కొన్ని రోజుల తరబడి తమ కష్టాలన్నీ చెప్పుకుంటారు. ఇవన్నీ కలిపి ప్రభుత్వానికి మరింత పరువు తీస్తాయి.
పైపెచ్చు.. కక్షసాధింపుగా తీసుకునే ఇలాంటి నిర్ణయాలకు న్యాయస్థానంలో ఎదురుదెబ్బ తగిలే అవకాశమే ఎక్కువ. నోటీసులో పేర్కొన్న ఈ కారణాల మీద సంఘం గుర్తింపు అనేది చట్టం ముందు నిలబడే అవకాశం తక్కువ. అదే జరిగితే ప్రభుత్వానికి మళ్లీ ఓసారి ఘోరంగా పరువు పోతుంది.
జగన్.. కత్తి దూస్తే నీ కంట్లోనే పొడుచుకుంటుంది!
Wednesday, January 22, 2025