రాష్ట్రంలోని వైసిపి ప్రభుత్వ అరాచక, విధ్వంసకర పాలనలో ఆగడాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్ నియంత పోకడలు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టుగా మారాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమిష్టి తిరుగుబాటుతో ప్రభుత్వ ఉగ్రవాదాన్ని ఎదుర్కొందామని ఒక బహిరంగలేఖలో రాష్ట్ర ప్రజలకు ఆయన పిలుపిచ్చారు.
ప్రజావ్యతిరేక పాలనను ప్రశ్నిస్తే ప్రజలు, ప్రతిపక్షాలపై దాడులు, కేసులు, హింసాత్మక ఘటనలు, పోలీస్ టార్చర్ అన్నట్లుగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు గన్నవరం విధ్వంసం ఒక తాజా ఉదాహరణ అని పేర్కొన్నారు.
వల్లభనేని వంశీ ఆధ్వర్యంలోనే గన్నవరం టిడిపి కార్యాలయంపై దాడి జరిగిందని స్పష్టం చేస్తూ గన్నవరంలోని టిడిపి కార్యాలయం, పార్టీ నేతల ఇళ్లు, కార్యకర్తలపై దాడులు చేసి ఆస్తులు ధ్వంసం చేశారని తెలిపారు. బాధితులనే పోలీస్ టార్చర్‌కు గురిచేసి నిందితులుగా మార్చి, జైలుకు పంపుతున్నారని పేర్కొన్నారు.
జగన్ పాలనలో ప్రజల ధన, మాన, ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని లేఖలో ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే విపక్ష నేతలు, ప్రజలపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఆయన మండిపడ్డారు. మహిళలపై అకృత్యాలకు రాష్ట్రం వేదికగా మారిందని తెలిపారు.
రాష్ట్రంలో దారుణ పరిస్థితులపై ప్రజలను చైతన్యవంతులను చేయడానికి తాను చేపట్టిన పర్యటనలకు అన్ని తరగతుల ప్రజల నుంచి విశేష స్పందన కనిపిస్తోందని గుర్తు చేశారు. ఆంక్షలు, నిర్భందాలు ఉన్నా అద్భుతంగా జరిగిన అనపర్తి సభతో జగన్ ఉలిక్కిపడి గన్నవరం విధ్వంసానికి పాల్పడ్డారని, స్థానిక ఎమ్మెల్యే దీనికి వ్యూహరచన చేశారని విమర్శించారు.
కొంతమంది పోలీసు అధికారుల సహకారంతో వైసీపీ గూండాలు ప్రణాళికా బద్ధంగా టిడిపి నేతలపై దాడులు, పార్టీ కార్యాలయంలో విధ్వంసం సృష్టించారని పేర్కొన్నారు. దీనిపై జిల్లా ఎస్‌పి ఫోన్ చేసినా స్పందించలేదని విమర్శించారు. నియంతృత్వ ధోరణులకు నిలువెత్తు నిదర్శనం సిఎం జగన్ అని మండిపడ్డారు.
అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కనపెట్టి, తన సొంత రాజ్యాంగాన్ని అమలు పరుస్తున్నారని ధ్వజమెత్తారు. ధాన్యం బకాయిలు అడిగితే రైతులకు బేడీలు, జీతాలు అడిగితే ఉద్యోగులకు బెదిరింపులు అన్నట్లుగా పరిస్థితి మారిందని తెలిపారు.
ప్రేరేపిత ఉగ్రవాద విధానాన్ని విస్తృత పరచడం ద్వారా వచ్చే ఎన్నికల్లో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయాలనేది కుట్ర అని పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ధర్మానికి, అధర్మానికి, ప్రజాస్వామ్యానికి, నియంత పోకడలకు మధ్య యుద్ధం జరుగుతోందని తెలిపారు.