జగన్ అసమర్థతపై దుఃఖిస్తున్న కేంద్రం!

Sunday, December 22, 2024

 ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలన గురించి విమర్శించే వారుంటారు, నిందలు వేసే వారుంటారు, అత్యంత అసమర్థ, దుర్మార్గమైన పరిపాలన అని ఆడిపోసుకునే వారుంటారు. పై చెప్పిన అన్ని రకాలుగా జగన్ ను వ్యతిరేకించేవాళ్లు మనకు కనిపిస్తారు. కానీ, జగన్మోహన్ రెడ్డి అసమర్థతగురించి దుఃఖించేవాళ్లు కూడా ఉంటారు. మరెవ్వరో కూడా.. కేంద్రప్రభుత్వమే! గ్రామాల్లో ఇంటింటికీ తాగునీటి కొళాయి అందించే ఉద్దేశంతో కేంద్రప్రభుత్వం సంకల్పించిన జలజీవన్ మిషన్ అమలు చేయడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందరికంటె వెనుకబడి ఉంది. ఈ పథకానికి సంబంధించిన గణాంకాలను కేంద్ర జల్ శక్తి  శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సభకు తెలియజేస్తూ… 2021 తర్వాత ఈ పథకం కోసం ఇచ్చిన నిధులను ఒక్క పైసా కూడా ఉపయోగించుకోని ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని అత్యంత దుఃఖంతో ఈ విషయాన్ని సభకు తెలియజేస్తున్నానని వ్యాఖ్యానించారు. 2021-22 సంవత్సరానికి ఏపీ సర్కారు కనీసం తమ రాష్ట్రప్రభుత్వ వాటా డబ్బులను కూడా చెల్లించలేదని ఆయన చెప్పడం విశేషం.

దీనిని చాలా ఆందోళనకరమైన పరిస్థితిగా ఆయన అభివర్ణించారు. జలజీవన్ మిషన్ పనితీరు గురించి ఇటీవల కేంద్రప్రభుత్వ అధికారులు అమరావతికి వచ్చి సీఎస్ సమక్షంలో రాష్ట్రప్రభుత్వ అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించి త్వరితగతిన పనులు పూర్తిచేయాలని మార్గదర్శనం చేయడం కూడా జరిగింది. అయితే.. ఆ తర్వాత కూడా రాష్ట్ర సర్కారు పట్టించుకున్న దాఖలాలు లేవు.

సంక్షేమ పథకాలు  పేరిట ప్రజల ఖాతాల్లోకి డబ్బులు పంపేసి.. వారందరూ తమ పార్టీకి ఖచ్చితంగా ఓట్లు వేసి గెలిపిస్తారని నమ్మడం తప్ప ప్రభుత్వం ఇతరత్రా అభివృద్ధి పనులను పట్టించుకోవడం లేదనడానికి ఇదొక ఉదాహరణ. అదే సమయంలో.. వాలంటీర్ల ద్వారా.. జగనన్న ఓడిపోతే.. మీ ఖాతాల్లో డబ్బులు పడవు అనే మాటలతో ఊదరగొడుతూ, జనాల్ని భయపెట్టడం తప్ప వాస్తవమైన అభివృద్ధి జరగడం లేదనే వాదనలను ప్రభుత్వ చర్యలు మరింత బలోపేతం చేస్తున్నాయి.

జగన్మోహన్ రెడ్డి తీరు చూస్తే తాను చేయదలచుకున్న పనులకే కేంద్ర వాటాలను కూడా బతిమాలి తెచ్చుకుని వాటిని పూర్తి చేయడం తప్ప, నిజంగా ప్రజలకు ఉపయోగపడేవి, కేంద్రం ప్రభుత్వ శ్రద్ధతో చేయాలని అనుకుంటున్న వాటి విషయంలో తన రాష్ట్రప్రభుత్వ వాటాలు కూడా ఇవ్వకుండా వ్యవహారం నడిపిస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఓటు బ్యాంకు రాజకీయం తప్ప మరొకటి ఆయనకు పట్టడం లేదని కూడా అర్థమవుతుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles