జగన్ అవినీతిపై అమిత్ షాను ఫిక్స్ చేస్తున్న చంద్రబాబు!

Tuesday, November 5, 2024

తమ రాజకీయ ఎత్తుగడలతో భాగంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి అవినీతిపరుడు అంటూ ఆయన ప్రభుత్వంపై బిజెపి అగ్రనేతలు అమిత్ షా, జెపి నడ్డా ఒకేసారి పెద్ద ఎత్తున విమర్శలు చేయడం ద్వారా రాజకీయ కలకలం దృష్టిస్తే, టిడిపి అధినేత చంద్రబాబునాయుడు వ్యూహాత్మకంగా వారి మాటలనే ఉపయోగించుకొనే ప్రయత్నం చేస్తున్నారు.

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి అవినీతి పరుడని ప్రకటనలు చేయడం కాదు, జగన్ పై చర్యలు ఎప్పుడు తీసుకుంటారో చెప్పండని బుధవారం మూడురోజుల కుప్పం నియోజకవర్గ పర్యటనను ప్రారంభిస్తూ ప్రశ్నించడం గమనిస్తే వైసీపీ ప్రభుత్వం పీకల్లోతు అవినీతిలో కూరుకుపోయిందని తాము చేస్తున్న విమర్శలకు బాసటగా బిజెపి అగ్రనేతలను ఫిక్స్ చేసే ప్రయత్నంలో ఉన్నట్లు స్పష్టం అవుతుంది.

జగన్ అంత అవినీతి పరుడు దేశంలో ఎవరూ లేరని సాక్షాత్తు కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారని గుర్తు చేయడం ద్వారా ఇప్పటివరకు జగన్ కు మద్దతు ఇస్తూవస్తున్న బిజెపి నైజాన్ని ఒకవంక ప్రజాక్షేత్రంలో బహిర్గతం చేయడంతో పాటు, మరోవంక జగన్ ప్రభుత్వంపై తమ దాడులను ఉధృతం చేస్తున్నారు.

అయితే, మొదటిసారిగా అంత ఘాటుగా ఇద్దరు బిజెపి అగ్ర నాయకులు జగన్ ప్రభుత్వంపై ఎందుకు దండయాత్ర ప్రారంభించారో అనే చర్చలు రాజకీయ ఒకవర్గాలలో ఒకవంక జరుగుతూ ఉండగా, కేవలం మాటలేనా లేదా అవినీతిపై చర్యలు తీసుకుంటారా? అని చంద్రబాబు నిలదీయడం ప్రాధాన్యత సంతరింప చేసుకుంది.

జగన్ ప్రభుత్వంపై ఒకవంక విమర్శలు గుప్పిస్తూనే, మరోవంక ఎన్నికల సంవత్సరంలో ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండాలని ఉదారంగా నిధులు మంజూరు చేస్తుండటం, అదనపు రుణాలకు అనుమతులు ఇస్తుండటం జరుగుతుంది. దానితో వ్యూహాత్మకంగా మాత్రమే కొన్ని రాజకీయ ప్రయోజనాలకోసం బీజేపీ అగ్రనేతలు జగన్ ప్రభుత్వంపై విమర్శలు కురిపిస్తున్నట్లు సర్వత్రా భావిస్తున్నారు.

కేంద్రం ఇస్తున్న బియ్యాన్ని, నిధులను దారిమళ్లిస్తున్నట్లు స్వయంగా కేంద్ర పెద్దలే ఆరోపిస్తున్నారు. అయితే ఈ అవినీతి ప్రభుత్వంపై ఎటువంటి చర్యలు తీసుకొంటున్నారో చెప్పాలని నిలదీయడం ద్వారా చంద్రబాబు వ్యూహాత్మకంగా బీజేపీని ఇరకాటంలో పెట్టె ప్రయత్నం కనిపిస్తున్నది. జగన్ ప్రభుత్వంపై విమర్శలు కురిపిస్తున్నంత మాత్రం చేత బిజెపి – వైసీపీల మధ్య బంధం చెడిపోయిందని అపోహాలు తగవని పార్టీ శ్రేణులకు సంకేతం కూడా ఇచ్చిన్నట్లయింది.

ఇటీవల చంద్రబాబు ఢిల్లీ వెళ్లి అమిత్ షా, జెపి నడ్డలతో భేటీ జరిపినప్పటి నుండి తిరిగి టీడీపీ – బిజెపి పొత్తు పెట్టుకోబోతున్నట్లు కధనాలు వెలువడుతున్నాయి. అయితే, అటువంటి ప్రచారం నమ్మవద్దనే విధంగా చంద్రబాబు కుప్పం పర్యటన జరుగుతూ ఉండడం గమనార్హం.

ఏ రాష్ట్రానికి లేనంతగా అప్పులకు కేంద్రం ఏపీకి ఎందుకు అనుమతి ఇచ్చిందని ప్రశ్నించిన అచ్చెన్నాయుడు సీఎం జగన్ కు బీజేపీ అండ లేకుండానే జరిగిందా అని నిలదీసారు. ఏ సంబంధాలు లేకపోతే ఇన్ని సార్లు ఎందుకు ఢిల్లీకి వెళ్లారని ప్రశ్నించారు. దీనికి కొనసాగింపుగా కుప్పం కేంద్రంగా చంద్రబాబు కేంద్ర నేతలను నిలదీయడం గమనార్హం.

కుప్పంలో గ్రానైట్ డోపిడి చేస్తున్నారు, టీడీపీ అధికారంలోకి వచ్చాక దోచిదంతా కక్కిస్తా…ఖబడ్దార్ అని చంద్రబాబు వైసీపీ నేతల్ని హెచ్చరించారు. రెండు వేల రూపాయల నోట్లు వైసీపీ నేతలు బ్రాందీ షాపుల్లో మార్చుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ఈ విధంగా జగన్ ప్రభుత్వపు అవినీతి చర్యలను ఎండగడుతూ బిజెపి జగన్ అవినీతి చర్యలకు రక్షణ అకల్పిస్తున్నా టిడిపి అధికారంలోకి వస్తే మాత్రం సాధ్యం కాదనే సంకేతం కూడా ఇచ్చారు.

“అన్ని లెక్కపెడుతున్నా, వడ్డీతో సహా చెల్లిస్తాం, తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపిన వారిని వదిలేది లేదు” అంటూ అధికారపక్షం ప్రాపకం కోసం ఏకపక్షంగా, అడ్డదిడ్డంగా వ్యవహరిస్తున్న అధికారులను మాజీ ముఖ్యమంత్రి హెచ్చరించారు. వైసీపీ దొంగలను తరిమికొట్టాల్సిన బాధ్యత ప్రజలదేనని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles