జగన్‌పై పవన్ సెటైర్లే ఘాటుగా ఉన్నాయ్!

Wednesday, December 18, 2024

సాధారణంగానే ముఖ్యమంత్రి జగన్మోహన్  రెడ్డి పబ్లిక్ లోకి వచ్చి మాట్లాడే ప్రతి సందర్భంలోనూ.. చంద్రబాబునాయుడును, పవన్ కల్యాణ్ నానా రకాలుగా తూలనాడుతూ ఉంటారు. దీన్ని తప్పుపట్టే పనిలేదు. రాజకీయాల్లో చాలా సహజమైన విషయం ఇది. అవతలి వారినుంచి కూడా ఇలాంటి విమర్శలే వస్తుంటాయి. ఒకరు ఎక్కువ, మరొకరు తక్కువేమీ కాదు. కాకపోతే.. తాజా పరిస్థితుల్లో పవన్ వారాహి యాత్ర నేపథ్యంలో జగన్ విమర్శలు – వాటికి పవన్ కౌటర్లను పరిశీలిస్తే ఓ సంగతి అర్థమవుతుంది. పవన్ మీద చేస్తున్న విమర్శలు రొటీన్ గా చేస్తున్నవే. కొత్తదనం లేదు. కానీ జగన్ కు పవన్ కల్యాణ్ ఇచ్చిన కౌంటర్లు చాలా ఘాటైన సెటైర్లు. ఆయన పరువు తీసే వ్యవహారాలు.

పవన్ వారాహి యాత్ర మొదలెట్టిన తర్వాత.. ఆయన మీద విరుచుకుపడడానికి జగన్‌కు తాజాగా అమ్మఒడి కార్యక్రమమే దొరికింది. ఆ సభను వాడుకున్నారు. ఆయన పబ్లిక్ మీటింగ్ ల్లో తప్ప ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే రకం కాదు గనుక.. ఇదే మీటింగులోనే తన అక్కసునంతా వెళ్లగక్కారని సర్దుకోవచ్చు. కానీ.. పవన్ కల్యాణ్ మళ్లీ ఎత్తిచూపించే దాకా.. ఆయన ఎంత చవకబారుగా మాట్లాడారో చాలా మందికి అర్థం కాలేదు.

తనమీద చేసిన విమర్శల పట్ల స్పందిస్తూ పవన్ కల్యాణ్ అమ్మఒడి సభలో అలాంటి విషయాలు మాట్లాడతారా? అని తప్పుపట్టారు. నిజమే.. స్కూలు పిల్లలు ఉన్న, వారిని ఉద్దేశించిన సభలో పవన్ కల్యాణ్ పెళ్లాల గురించి, నాలుగేళ్లకు ఒక పెళ్లాన్ని మేం మార్చలేం అంటూ మాట్లాడడం అనవసరం, తప్పు అని ప్రజలు అనుకుంటున్నారు. నిజానికి భార్యలు అనేది పవన్ కల్యాణ్ వ్యక్తిగత వ్యవహారం. భార్యల సంగతి ప్రస్తావించకుండా.. పవన్ ను నిందించడం అనేది జగన్ కు చేతగాని వ్యవహారంలాగా మారిపోయింది. ఒక రకంగా అది నిజమే. అవినీతి, దుర్మార్గాలు, రౌడీయిజం లాంటి మాటలు పవన్ ను ఉద్దేశించి అనడానికి అవకాశం లేదు. అలాగని వ్యక్తిగత వ్యవహారాన్ని రోడ్డుమీదకు లాగి, ఆయన భార్యల్ని ప్రస్తావిస్తూ విమర్శించడం అనేది.. తెలుగునేలపై ప్రతి మహిళకూ తాను అన్నదమ్ముడినని చెప్పుకునే, అలాంటి పథకాలు తీసుకువచ్చే సీఎం జగన్ కు తగదు.

వారాహి – వాహనాన్ని ‘వరాహి’ అని మాట్లాడుతూ కూడా జగన్, పవన్ దృష్టిలో నవ్వులపాలయ్యారు. జగన్ కోసం జనసేన ఆధ్వర్యంలో వయోజన విద్యాపాఠశాల పెట్టి చదువు నేర్పుతామని ఆయన సెటైర్లు వేశారు.

మొత్తానికి పవన్ కౌంటర్ల నేపథ్యంలో.. పసిపిల్లలున్న సభలో అనైతిక  విషయాల ప్రస్తావన, భార్యల గురించిన అనైతిక ప్రస్తావనతో.. జగన్ దొరికిపోయారు. ఆ కోణంలో పవన్ కల్యాణ్ ఆయనకు ఇచ్చిన కౌంటర్లు చాలా ఘాటుగానే పేలాయి. వైసీపీ అభిమానులు తిరిగి పవన్ ను ట్రోల్ చేయడానికి రెచ్చిపోయేలా.. ఆయన వారికి బుద్ధిచెప్పారని ప్రజలు అనుకుంటున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles