వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు విశాఖపట్నం విమానాశ్రయంలో జరిగిన `కోడికత్తి’ దాడి ఘటనలో ఎలాంటి కుట్ర లేదని జాతీయ దర్యాప్తు ఏజెన్సీ (ఎన్ఐఏ) స్పష్టం చేస్తూ ఈ కేసును విచారిస్తున్న విజయవాడలోని ప్రత్యేక కోర్టుకు సంచలన నివేదిక సమర్పించింది.
పైగా, రెస్టారెంట్ యజమాని హర్షవర్ధన్‍కు ఘటనతో సంబంధం లేదని స్పష్టం చేసింది. నిందితుడు శ్రీనివాసరావు టీడీపీ సానుభూతిపరుడు కాదని కూడా తేల్చి చెప్పింది. దానితో ఈ కేసుపై కోర్టులో విచారణ ప్రారంభమైనందున ఇంకా దర్యాప్తు అవసరం లేదని ఎన్ఐఏ తెలిపింది.
గత వాయిదాలో ఈ కేసును కుట్ర కోణంలో ఈ కేసును విచారించేలా ఆదేశించాలని కోరుతూ సీఎం జగన్ పిటిషన్ దాఖలు చేశారు. దానికి కౌంటర్ గా ఇందులో అసలు కుట్ర అంటూ ఏమీ లేదని స్పష్టం చేస్తూ ముఖ్యమంత్రి పిటీషన్ ను కొట్టివేయాలని సూచిస్తూ ఇప్పుడు కోర్టును కోరడం రాజకీయంగా కలకలం రేపుతోంది.
సంఘటనలో కుట్ర కోణం ఏదీ లేదని సుదీర్ఘ దర్యాప్తు పిమ్మట తేలిందని ఎన్‌ఐఏ స్పష్టం చేసింది. దానితో ఈ ఘటనపై ఇప్పటివరకు వైసిపి నేతలు ప్రచారం చేస్తున్న కథనాలు, ఆరోపణలు అన్ని అవాస్తవాలని జాతీయ దర్యాప్తు సంస్థ తేల్చిన్నట్లు అయింది.
2019 ఎన్నికల ముందు జరిగిన ఈ ఘటనను వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయ అస్త్రంగా ఉపయోగించుకున్నారు. నాటి టిడిపి ప్రభుత్వం ఆయనపై హత్యాయత్నం జరిపినట్లుగా వైసిపి శ్రేణులు పెద్ద ఎత్తున ప్రచారం చేసి రాజకీయ లబ్ది పొందే ప్రయత్నం చేశారు.
ఈ కేసులో టీడీపీకి చెందిన హర్షవర్ధన్ కుట్ర చేసి దాడి చేయించారని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. అలాగే ఈ దాడి చేసిన నిందితుడు జనిపల్లి శ్రీనివాస్ కూడా టీడీపీ సానుభూతిపరుడు అంటూ ప్రచారం చేశారు. ఎన్ఐఏ దాఖలు చేసిన ఈ కౌంటర్ రాజకీయంగా కూడా ప్రకంపనలు రేపే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అయితే ఎన్ఐఏ వాదనలపై తమకు రెండు రోజుల సమయం కావాలని జగన్ తరపు న్యాయవాదులు కోరారు. ఇరవైపు వాదనలు విన్న న్యాయస్థానం కోడికత్తి కేసు తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది. అదేరోజు తీర్పు ఇవ్వనున్నట్లు కూడా తెలిపింది.
కాగా, ఎన్ఐఏ కౌంటర్ పిటిషన్ నేపథ్యంలో సీఎం జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ విరుచుకుపడింది. కోడి కత్తి దాడి డ్రామాకు బ్రాండ్ అంబాసిడర్ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డే అని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఆరేటి మహేష్ బాబు ధ్వజమెత్తారు. ఎన్ఐఏ అఫిడవిట్ ద్వారా అసలు నిజం తెలిసిపోయింది ఆంటూ 2019 ఎన్నికల ముందు వీధి నాటకాలు ఆడి ప్రజలను మోసం చేసి గెలిచారని విమర్శించారు. నిజాలు ఎన్ఐఏ తేల్చేసిన నేపథ్యంలో ప్రజలకు సీఎం జగన్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.