అమరావతి ప్రాతంలోని ఆర్ 5 జోన్ లో పేదలకు కేటాయించిన ఇంటి స్థలాల్లో ఇళ్ల నిర్మాణాలకు ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం ఒక వంక కృష్ణాయపాలెంలో శంకుస్థాపన చేశారు. మరోవైపు అమరావతి రైతులు కృష్ణాయపాలెం, తుళ్లూరు, వెంకటపాలెం శిబిరాల వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.
ఆర్ 5 జోన్ పై హైకోర్టులో తీర్పు రిజర్వ్ లో ఉన్నప్పటికీ ఆ ప్రాంతంలో ఇళ్ల నిర్మాణంపై ముందుకెళ్తున్నారని వారు విమర్శించారు. కోర్టులపై జగన్ కు గౌరవం లేదని దుయ్యబట్టారు. రాజధాని రైతులను కోర్టుల చుట్టూ తిప్పుతున్నారని, కావాలనే ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సమాధులపై నుంచి ఎన్నికలకు వెళ్తున్నారని మండిపడ్డారు.
నల్ల బెలూన్లతో నిరసన వ్యక్తం చేశారు. మరోవైపు అమరావతి రైతులు బయటకు రాకుండా పోలీసులు కట్టడి చేస్తున్నారు. అదేసమయంలో వెంకటపాలెంలో లబ్ధిదారులకు సీఎం జగన్ ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన . అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ పేదలకు ఇళ్ళు కట్టించకుండా ప్రతిపక్షాలు అడ్డుకొంటున్నాయని ధ్వజమెత్తారు.
‘‘అమరావతిలో పేదలకు ఇళ్లు ఇస్తే సామాజిక సమతుల్యత దెబ్బ తింటుందని కోర్టుకు వెళ్లారు. పేదలకు ఇళ్లు కట్టించకుండా చంద్రబాబు , దత్తపుత్రుడు అడ్డుకున్నారు. ఇప్పటికీ ఇళ్లు కట్టకుండా దుర్మార్గులు అడ్డుకుంటున్నారు. పేదలకు వ్యతిరేకంగా హైకోర్టులో 18 కేసులు, సుప్రీంకోర్టులో 5 కేసులు వేశారు” అంటూ గుర్తు చేశారు.
ఇళ్లు ఇవ్వకుండా అడ్డుకోవడానికి కేంద్రంలో మంత్రులను, అధికారులను కలిశారని అంటూ పెత్తందార్లపై పేదల ప్రభుత్వం విజయంగా చరిత్రలో గుర్తుండి పోతుందని సీఎం జగన్ స్పష్టం చేశారు. పేరుకు రాజధాని కానీ పేదలకు ఇక్కడ చోటు ఉండొద్దా? అని ప్రశ్నించారు.
సెంటు స్థలం ఇచ్చి ఇల్లు కట్టిస్తామంటే కోర్టుకెళ్లి అడ్డుకుంటున్నారని జగన్ దుయ్యబట్టారు. పేదలకు ఇళ్లు ఇస్తే అభివృద్ధి జరగదంటూ వాదిస్తున్నారని చురకలంటించారు. ఇలాంటి పెత్తందారులతో మనం యుద్ధం చేస్తున్నామని వివరించారు. ఇలాంటి దుర్మార్గులను ఇక్కడే చూస్తున్నామని, దుర్మార్గమైన రాజకీయ పార్టీలను ఎక్కడా చూడలేదని మండిపడ్డారు.
రాజధాని అమరావతిలో సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇళ్ళ పట్టాలిచ్చింది పేద మహిళలకు కాదని, వైఎస్ఆర్సిపి నాయకులకి, వాలంటీర్లకి అంటూ జనసేన నేతలు ఆరోపించారు. అర్హుల జాబితాలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల మహిళలు లేరని, వైసీపీ నాయకులే ఉన్నారని ఆరోపించారు.
వైయస్ఆర్సీపీ మాయమాటలను విజయవాడ నగరంలో మహిళలు నమ్మే పరిస్థితిలో లేరని అంటూ అర్హులు ఎవరికి ఇళ్ల పట్టాలు మంజూరు కాలేదని ధ్వజమెత్తారు. అర్హుల జాబితా అంతా పెద్ద బూటకం అంటూ ఆ జాబితా నిండా వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు, వాలంటీర్ ఉన్నారని విమర్శించారు.
ఇలా ఉండగా, కృష్ణాయపాలెంలో ముఖ్యమంత్రి శంకుస్థాపన కార్యక్రమం నేపథ్యంలో ప్రజల్ని మోసం చేస్తున్న వంటి కార్యక్రమానికి ప్రజాస్వామ్య పద్ధతిలో శాంతియుతంగా నిరసన తెలపాలని జనసేన పార్టీ ఛలో కృష్ణాయపాలెం కు పిలుపునివ్వడంతో ఆదివారం రాత్రి నుంచే జనసేన పార్టీ నాయకులను అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ లకు తరలించారని ఆ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఆదివారం ఉదయం జనసేన మంగళగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావును, ఆదివారం రాత్రి రాష్ట్ర కార్యదర్శి బేతపూడి విజయ్ శేఖర్, మంగళగిరి మండల అధ్యక్షుడు వాసా శ్రీనివాసరావు,తాడేపల్లి మండల అధ్యక్షుడు సామల నాగేశ్వరావు తదితరులను ఆరెస్ట్ చేశారని తెలిపారు. అలాగే గుంటూరు జిల్లా సంయుక్త కార్యదర్శి బడే కోమలి, ఎంపిటిసి అధ్యక్షులు మునగపాటి వెంకట మారుతీరావు, దుగ్గిరాల మండల అధ్యక్షుడు పసుపులేటి శ్రీనివాసరావు లను గృహనిర్బంధం చేశారని చెప్పారు.