ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమరావతి రాజధాని పట్ల మాత్రమే విముఖంగా ఉన్నారా? అక్కడి రైతుల పట్ల కూడా ద్వేష భావంతో ఉన్నారా? అనే అనుమానాలు ప్రజల్లో కలుగుతున్నాయి. అమరావతిలో రాజధాని నిర్మానానికి భూములు అప్పగించిన రైతులకు .. సాలీనా చెల్లించాల్సిన కౌలు డబ్బులు కూడా ఇప్పటిదాకా ఇవ్వకపోవడంతో.. ఇప్పుడు రైతులు రోడ్డెక్కే పరిస్థితి వచ్చింది.
అమరావతి రాజధాని కోసం భూములు కేటాయించిన అసైన్డ్ రైతులకు కౌలు చెల్లించకుండా ప్రభుత్వం వేధిస్తోందంటూ అమరావతి రైతులు ఆందోళనలు చేస్తున్నారు. డాక్యుమెంట్లు చూపించాలంటూ రైతుల్ని వేధిస్తున్నారని అంటున్నారు. ప్రతి ఏడాది వారికి చెల్లించాల్సిన కౌలు డబ్బులు ఆపేయడంతో వారంతా విజయవాడలో పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు.
జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత.. అమరావతి రాజధాని అనే స్ఫూర్తిని తుంగలో తొక్కేసిన సంగతి అందరికీ తెలిసిందే. మూడు రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని ఎటూ కాకుండా చేసేశారనే ఆరోపణలున్నాయి. అదే సమయంలో.. జగన్ సర్కారు ప్రకటించిన మూడు రాజధానుల కాన్సెప్టును అమరావతి రైతులు కోర్టుల్లో సవాలు చేసి.. సమర్థంగా అడ్డుకోగలిగారు. అమరావతి నగరం ఒక్కదానినే రాజధానిగా అభివృద్ధి చేయాలంటూ హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చింది. ప్రభుత్వం ఆ తీర్పును అమలు చేయకుండా.. సుప్రీం కోర్టుకు వెళ్లి.. కాలయాపన చేస్తోంది. అమరావతి అనే రాజధాని పూర్తయితే, దానిని సంకల్పించిన చంద్రబాబునాయుడుకు కీర్తిప్రతిష్ఠలు దక్కుతాయనే ఉద్దేశంతో జగన్ దానిని ద్వేషించడం ప్రారంభించారు. అమరావతి ప్రాంతంలో 80 శాతం పూర్తయిన నిర్మాణాలను కూడా ఈ నాలుగేళ్లలో పూర్తి చేయకుండా శిథిలం అయిపోయేలా విడిచిపెట్టారు. చంద్రబాబు మీద వైరభావంతో కేవలం అమరావతి నగరాన్ని మాత్రమే ద్వేషిస్తున్నారని అనుకుంటే.. ఆయన అసైన్డ్ రైతులకు కౌలు డబ్బులు చెల్లించకపోవడాన్ని బట్టి.. అక్కడి రైతులను కూడా ద్వేషిస్తున్నారని ప్రజలకు అర్థమవుతోంది.
అమరావతి రైతులకు సంబంధించి ఒప్పందంలోని చెల్లింపులే ఇంకా పూర్తి కాలేదు. వారికి ఏటా కౌలు డబ్బులు చెల్లించాల్సి ఉంది. అంటే రైతుల నుంచి భూములు స్వాధీనం చేసుకోవడంఅనే పనే ఇంకా పూర్తి కాలేదు. కానీ.. ఆ స్థలాలను పేదలకు ఇళ్లు అంటూ పంచిపెట్టేయడానికి, అలాగే అక్కడ కోర్టు తీర్పుకు విరుద్ధంగా ఇళ్ళు నిర్మించేయడానికి కూడా ప్రభుత్వం ఉత్సాహపడుతోంది. కానీ.. అసలు ఆ భూములు ఇచ్చిన అసైన్డ్ రైతులకు కౌలు మాత్రం ఇవ్వడం లేదు. ఇది రైతులపట్ల కక్ష సాధింపు కదా..అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. తమది పేదల ప్రభుత్వం అని చెప్పుకునే జగన్ అసైన్డ్ భూములిచ్చిన రైతులను ఇలా శత్రువుల్లా చూడడం తగదని అంటున్నారు.