‘జగనన్నకు చెబు దాం’ కార్యక్రమంతో వైసీపీలో ముసలం

Wednesday, January 22, 2025

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా ప్రారంభిస్తున్న కొత్త కార్యక్రమం ‘జగనన్నకు చెబు దాం’ అధికారపక్షంలో ముసలంకు దారితీసే అవకాశాలు కనిపిస్తున్నాయి.  ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పరంగా ఎవరికైనా ఏమైనా సమస్యలుండి, అవి పరిష్కారం కాకపోతే 8296082960 నంబరుకు ఫోన్‌చేసి జగన్‌ మోహన్‌ రెడ్డితో నేరుగా మాట్లాడే అవకాశం కల్పిస్తున్నామని ప్రకటించారు.

అదే సిట్టింగ్ ఎమ్యెల్యేలు, నియోజకవర్గ కోఆర్డినేటర్లలో కలకలం రేపుతున్నది. ఇప్పటి వరకు ప్రతి నియోజకవర్గంలో వారే మోనార్క్ ల మాదిరిగా వ్యవహరిస్తున్నారు. మొత్తం ప్రభుత్వ యంత్రాంగం వారి కనుసన్నలలో నడవలసిందే అన్నట్లు చేస్తున్నారు. తమకు గిట్టనివారిని దూరంగా నెట్టివేస్తున్నారు. దానితో వారితో పడనివారు అనేకమంది `అసంతృప్తివాదులు’గా పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు.

ఈ ఫోన్‌ నంబరుకు నియోజక వర్గంలో సిట్టింగులు, లేదా కో ఆర్డినేటర్లకు దూరంగా ఉంటూ వస్తున్న అసంతృప్తివాదులు ఫోన్‌చేసి నియోజకవర్గ  ఎమ్మెల్యే లేదా కో ఆర్డినేటర్‌ అవలంభిస్తున్న అరాచక తీరుతెన్నులను నేరుగా సీఎంకు చెబితే పరిస్థితులేంటని వారు ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది.

వ్యక్తిగత సమస్యలను పరిష్కరించే కార్యక్రమంలో భాగంగా రేషన్‌ కార్డు స్ప్లిట్‌ కాకపోవడం వంటి సమస్యలు గ్రామంలో ఒకటి అరా ఉంటే వాటిని కూడా మిస్‌ కాకూడదని, పరిష్కరించడానికి జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. ఈనెల 13న ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నారు. అయితే అధికార పార్టీలో ప్రతి నియోజకవర్గంలో పేరుకుపోయిన అంతర్గత కుమ్ములాటలకు ఇదొక్క వేదికగా మారే అవకాశం కనిపిస్తున్నది.

అయితే, ఇది ఐవీఆర్‌ఎస్‌ కాల్‌ అని, ఫిర్యాదు దారుడు చెప్పిన మాటలు రికార్డు అవుతాయని, తరువాత దీనిని శాఖల వారీగా పంపే ప్రయత్నం చేస్తారు తప్ప ఇందులో రాజకీయ ఫిర్యాదులకు అవకాశం లేదని కొంత మంది వాదిస్తున్నారు. అయితే, నియోజకవర్గాల్లో అసంతృప్తి వాదులు మాత్రం ఈ సదుపాయాన్ని తమకు జరిగిన అన్యాయాన్ని జగనన్నకు కచ్చితంగా చెప్పి తీరాల్సిందే అంటూ ఉన్నట్లు చెబుతున్నారు.

ప్రస్తుతం ప్రభుత్వం ఇచ్చిన నెంబరు ఐవీఆర్‌ఎస్‌ కాల్‌ నంబర్‌ అని చెబుతున్నారు. అయితే, అసంతృప్తి వాదులు మాత్రం అయినా సరే అంటున్నారు. తమకు వచ్చిన అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులకునేది లేదని, ఐవీఆర్‌ఎస్‌ కాల్‌లో రికార్డు అయిన సందేశాన్ని అయినా తమ అభిమాన నేత వింటారు కదా .. అంటూ ఎదురు ప్రశ్నిస్తున్నారు.

 తామేమీ పార్టీకి వ్యతిరేకం కాదని, స్థానికంగా తమకు ప్రాధాన్యతను ఇవ్వకుండా వేరే పార్టీ నుండి వచ్చిన వారికి ప్రాధాన్యతనిస్తూ తమను అవమానిస్తున్నారన్నది మాత్రమే తాము అధినేతకు చెబుతామని అనేక మంది అంటున్నారు. కొంతమంది తమపై అక్రమ కేసులు పెట్టిన విధానాన్ని కూడా అధినేతకు తెలియజేస్తామని వాపోతున్నారు.

ఇలా పలు రకాల సమస్యలతో ఆదినుండి పార్టీకోసం కష్టపడి పనిచేసిన వారంతా ప్రస్తుతం స్థబ్దుగా ఉంటూ వస్తున్నారు. వీరందరికీ జగనన్నకు చెబుదాం .. ఒక వేదికగా మారిందని స్పష్టమౌతోంది. ఈ విధంగా పార్టీలో అసంతృప్తులు ధిక్కార స్వరం వినిపించేందుకు సిద్ధమౌతుండటం సిట్టింగులకు తలనొప్పిగా పరిణమిస్తోందని అంటున్నారు.

ప్రస్తుతం జగనన్నకు చెబుదాం అనే కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలకు పరిష్కారం దొరకుతుందని, అది తమకు సానుకూలంగా మారుతుందని ఆశపడ్డామని, ఇప్పుడు కొత్త సమస్య వచ్చినట్లైందని కొంత మంది సిట్టింగులు వాపోతున్నారు. ఐవీఆర్‌ఎస్‌ కాల్‌ అయినా, నేరుగా సీఎం మాట్లాడినా కేవలం సమస్య మీద మాత్రమే పరిమితమైతే తమకు ఎటువంటి ఇబ్బంది ఉండదని, అలా కాకుండా లేనిపోనివి తమపై సీఎంకు చెబితే పరిస్థితి ఏంటని కొంతమంది చర్చించుకుంటున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles