కమలదళంలో తతిమ్మా అందరు నాయకుల కంటె మాధవ్ కు కాస్త కడుపుమంట ఎక్కువగా ఉండడం సహజం. ఆయన తన సిటింగ్ ఎమ్మెల్సీ హోదాను కోల్పోయారు. ఆ కడుపుమంటను వెళ్లగక్కడం తప్పదు. అయితే దానిని ఎవరి మీద వెళ్లగక్కాలో ఆయనకు అర్థమైనట్లు లేదు. మొత్తం జనసేన మీద పడి ఏడుస్తున్నారు. జనసేన తమకు సహకరించలేదని, పేరుకు మాత్రమే తమతో పొత్తుల్లో ఉన్న పార్టీలాగా ఉన్నదని నిజంగా వారికి తమతో కలిసి ముందుకు సాగాలని ఉంటే.. క్షేత్రస్థాయిలో కలిసి పనిచేయాలని.. ఇంకా చాలాచాలా మాటలు చెప్పారు.
అసలు ఈ తాజా మాజీ ఎమ్మెల్సీ మాధవ్ కు గానీ, కమలదళంలో మరెవ్వరికి గానీ.. జనసేనపై నిందలు వేయడానికి నైతిక అర్హత ఉన్నదా? అనేది ఇక్కడ కీలకాంశం. తమతో ఉండాలని అనుకుంటే.. క్షేత్రస్థాయిలో తమతో కలిసి పనిచేయాలని అంటున్న బిజెపి.. ఎన్నడైనా తమ పార్టీ కార్యక్రమాలకు జనసేనను ఆహ్వానించిందా.. ఒక్కసారైనా ప్రభుత్వ వైఫల్యాలపై ఉమ్మడి కార్యచరణ ప్రణాళికతో ముందుకెళదామని ప్రయత్నించిందా అనేది వారు ఆత్మపరిశీలన చేసుకోవాలి.
అదే సమయంలో.. మాధవ్ మరో నిజాన్ని కూడా ఒప్పుకున్నారు. వైకాపాతో భాజపా కలిసిపోయిందనే ప్రచారాన్ని ప్రజలు నమ్మారని ఆయన అన్నారు. కాకపోతే, ఆ అపవాదును వైకాపా వేసినదని మాధవ్ బుకాయిస్తున్నారు. ఈ అపవాదును తుడిచేసుకోవడానికి వచ్చే నెలలో జగన్ ప్రభుత్వంపై తమ పార్టీ చార్జీషీట వేస్తుందని కూడా మాధవ్ ప్రకటించారు. ఆ పార్టీ చేతకానితనానికి ఇంతకంటె పెద్ద ఉదాహరణ వేరే ఉంటుందా అని విశ్లేషకులు భావిస్తున్నారు. అప్పుడెప్పుడో.. ప్రధాని మోడీ విశాఖలో పలు కార్యక్రమాల్లో పాల్గొనడానికి వచ్చినప్పుడు.. పార్టీ నాయకులతో సమావేశమైనప్పుడు.. జగన్ పాలనపై బిజెపి తరఫున చార్జిషీట్ వేయాలని దిశానిర్దేశం చేశారు. నెలలు గడచిపోయాయి. ఈ అసమర్థ బిజెపి నేతలకు తమ అధినాయకుడు మోడీ చెప్పినది ఆచరణలోకి తీసుకురావడం అనేది చేతకాలేదు. మరి ఈ నాయకులు అధికార వైకాపా కొమ్ము కాస్తున్నారని ప్రజలు నమ్మకుండా ఎందుకు ఉంటారు. తీరు చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న చందంగా.. ప్రజలు పూర్తిగా కమలం లోపాయికారీ ఒప్పందాలని నమ్మిన తర్వాత.. ఇప్పుడు తాము చార్జిషీట్ వేస్తాం అని మాధవ్ అంటున్నారు.
అయితే ప్రభుత్వ వ్యతిరేక పోరాటం అంటే కేవలం చార్జిషీట్ రూపంలో ఓ కాగితం కాదు. ప్రజల్లో చైతన్యం వచ్చేలా సాగించాల్సిన పోరాటం. కమల నాయకులకు అలాంటి ఉద్దేశం అంతరంగంలో ఉన్నదో లేదో తెలియదు. లోపల ఆ భావన లేకుండా..పైపైన ఉత్తుత్తి పోరాటాలు చేయడం వల్ల మరోసారి పరువు పోవడం తప్ప ఉపయోగం లేదు. తమ చేతగాని తనానికి, తమ ఓటమికి జనసేనను నిందించే ముందు.. బిజెపి నాయకులు ఆత్మపరిశీలన చేసుకోవడం ముఖ్యం.