జనసేన నేతపై చెంపదెబ్బతో దాడిచేసి మీడియాలో సంచలనం సృష్టించిన శ్రీ కాళహస్తికి చెందిన సర్కిల్ ఇన్‌స్పెక్టర్ అంజు యాదవ్ పై ఒక ఏపీ రాష్త్ర మానవ హక్కుల కమిషన్ సీరియస్ కాగా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సహితం ఆగ్రహం వ్యక్తం చేశారు. కమిషన్ ఆమెకు నోటీసులు జారీచేయగా, తమ పార్టీ నేతను కొడితే తనను కొట్టినట్లే అంటూ, తాను స్వయంగా శ్రీకాళహస్తి వెళ్లి తేల్చుకుంటానని ప్రకటించారు.
వాలంటీర్ వ్యవస్థపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ వైసీపీ నేతలు, వాలంటీర్లు ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. ఇందుకు ప్రతిగా శ్రీకాళహస్తిలో బుధవారం జనసేన ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా స్థానిక కళ్యాణ మండపం సమీపంలో పార్టీ జిల్లా కార్యదర్శి కొట్టె సాయి మహేష్‌తో పాటు ఇతర నాయకులు ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను దహనం చేసేందుకు సిద్ధమయ్యారు.
పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు దిష్టిబొమ్మను స్వాధీనం చేసుకుని నాయకులందరినీ బలవంతంగా టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో టౌన్ సీఐ అంజుయాదవ్ జనసేన నాయకుడు సాయిపై అసభ్యంగా ప్రవర్తించారు. ఆమె రెండు చెంపల మీద కొట్టింది. ఈ ఆకస్మిక పరిణామంతో బిత్తరపోయిన జనసేన నాయకులు సిఐ తీరుపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.
సీఎం దిష్టిబొమ్మ దహనం చేసేందుకు ప్రయత్నించిన ఘటనలో పలువురు జనసేన నాయకులపై టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సంఘటనను వివిధ దిన పత్రికలో ప్రచురించబడిన ఫోటోలను మానవ హక్కుల కమిషన్ పరిశీలించి సుమోటో కేసుగా నమోచేసింది. ఇందుకు సంబంధించి ప్రతివాదులైన ఐదు మందికి నోటీసులు జారీ చేశారు. ఈనెల 27 వ తేదీలోగా అందుకు సమాధానం ఇవ్వాలని అందులో ఆదేశించారు.
మరోవంక, తానే స్వయంగా శ్రీకాళహస్తికి వెళ్లి అక్కడే ఈ సంఘటన గురించి తేల్చుకుంటా అని పవన్ కళ్యాణ్ తణుకులో ప్రకటించారు. శాంతియుతంగా ధర్నా చేస్తున్న తమ పార్టీ వ్యక్తిని కొడితే తనను కొట్టిన్నట్లే అని స్పష్టం చేశారు.
“శ్రీకాళహస్తికి వెళ్తున్నా.. మా నాయకుడు సాయిని పోలీసోళ్ళు కొట్టారు.. శాంతియుతంగా ధర్నా చేస్తున్నాడా అబ్బాయి.. ప్రజాస్వామ్యంలో హక్కది.. మీరెంత పోలీసు అధికారులైనా కావచ్చు.. శాంతియుతంగా ధర్నా చేస్తున్న వారిని కొట్టే హక్కు ఏ పోలీసు అధికారికీ లేదు.. మేం మాట్లాడతాం.. నేనే స్వయంగా కాళహస్తికి వస్తున్నా.. అక్కడే తేల్చుకుంటాం” అని ప్రకటించారు.
ఇలా ఉండగా, అలిపిరి వద్ద 2003 అక్టోబరు 1న అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు కాన్వాయ్‌పై నక్సలైట్లు క్లైమోర్ మైన్స్ పేల్చిన ఘటనలో సీఎం కారుపైకి ఎక్కి సూపర్ కాప్‌గా పేరు తెచ్చుకున్న పోలీసు అధికారి అంజూ యాదవ్ ఇప్పుడు వరుస వివాదాలతో సొంత శాఖ ప్రతిష్ట మసకబారి పోయేందుకు కారకులవుతున్నారు. ముఖ్యంగా వైసీపీ నేతల కనుసన్నల్లో పనిచేస్తున్నారని విమర్శలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా పలు సందర్భాలలో టిడిపి శ్రేణుల పట్ల దురుసుగా ప్రవర్తించి వార్తల్లోకి ఎక్కారు.
ఇంతకు ముందు శ్రీకాళహస్తిలో హోటల్ నడుపుకుంటున్న మహిళ ధనలక్ష్మిని సీఐ అంజూ యాదవ్ వేధించినట్టు ఆరోపణలు వచ్చాయి. మద్యం విక్రయిస్తున్నారనే ఆరోపణతో ఆమెను హోటల్ వద్దే చితకబాది వాహనంలో స్టేషన్‌కు లాక్కెళ్ళిన దృశ్యాలతో కూడిన వీడియో అప్పట్లో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. తర్వాత సీఐపై హోటల్ నిర్వాహకులు ప్రైవేటు కేసు దాఖలు చేశారు.
రేణిగుంట మండలంలో ఒక వ్యక్తి మరణం అనుమానాలకు దారి తీయగా రమేష్ అనే విలేకరి వార్త రాయడం కోసం డీఎస్పీని వివరణ కోరారు. ఈ విషయం తెలుసుకున్న సీఐ అంజూ యాదవ్ అతడికి ఫోన్ చేసి గొడవ చేసిందని, మరుసటి రోజు వార్త ప్రచురితం కావడంతో విలేకరితో పాటు కుటుంబసభ్యుల్ని కూడా స్టేషన్‌కు తీసుకెళ్ళి దాడిచేసిందని ఆరోపణలు వచ్చాయి. దీనిపై దళిత సంఘాలు కలెక్టర్, ఎస్పీ మొదలుకుని గవర్నర్ వరకూ ఫిర్యాదులు చేశారు. ఈ ఘటనలో కలెక్టర్‌తో పాటు ఎస్సీ, ఎస్టీ కమిషన్ కూడా సీఐపై కేసు నమోదు చేయాలని ఆదేశించినప్పటికీ పోలీసు అధికారులు పట్టించుకోలేదని సమాచారం.