చివరకు కాంగ్రెస్ గూటికి పొంగులేటి, జూపల్లి

Wednesday, January 22, 2025

బిఆర్ఎస్ నుండి సస్పెన్షన్ కు గురైన తర్వాత తమ రాజకీయ భవిష్యత్ గురించి గత ఆరు నెలలుగా ఎటూ తేల్చకుండా రోజుకొక ఊహాగానానికి ఆస్కారం కల్పిస్తున్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు చివరకు కాంగ్రెస్ గూటికి చేరుకోనున్నట్లు తేల్చేశారు. ఎఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, టిపిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకొన్నట్లయినది.

అయితే, జులై 2న ఖమ్మంలో జరిగే సభలో రాహుల్ సమక్షంలో లాంఛనంగా  కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోనున్నారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ కాంగ్రెస్ నేతలంతా వెనక్కి రావడం ఆనందంగా ఉందని  తెలిపారు. ఘర్ వాపసీ కార్యక్రమం జరుగుతోందని చెబుతూ కెసిఆర్ హఠావో-తెలంగాణ బచావో నినాదంతో ముందురు వెళ్లాలని కాంగ్రెస్ శ్రేణులకు  సూచించారు.

తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకే కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆ తర్వాత తెలిపారు పదవులు ఇవ్వలేదని బీఆర్ఎస్ నుంచి బయటకు రాలేదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్‌ను గద్దె దించేందుకే బయటకు వచ్చి కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు వెల్లడించారు. అయినా తనకు పదవులు ముఖ్యం కాదని, పదవుల కంటే తనకు ఆత్మాభిమానమే ముఖ్యమని చెప్పుకొచ్చారు.

ఓ దశలో ప్రాంతీయ పార్టీ పెట్టాలని ఆలోచించానని, పార్టీ పెట్టడంపై అభిప్రాయ సేకరణ కూడా చేసినట్లు వివరించారు. అయితే, కొత్త పార్టీతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలగలదని భావించి కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. ఇక రాష్ట్రంలోని పరిస్థితులపై కూడా సర్వే చేయించానని చెబుతూ ప్రభుత్వ వ్యతిరేక ఓటు అంతా ఒకవైపే కేంద్రీకృతమైందని వెల్లడించారు.

ఇక కర్ణాటక ఫలితాల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగి, బీజేపీ పరిస్థితి దిగజారిందని పొంగులేటి తెలిపారు. బీజేపీలో కాకుండా తాము కాంగ్రెస్ లో చేరేందుకు అదొక్క ప్రధానకారణమనే సంకేతం ఇచ్చారు. ఎన్నికలు వచ్చాయంటే కేసీఆర్ కొత్త స్కీములు పెడతారని, గారడి మాటలు చెప్పడంలో కేసీఆర్ సిద్ధహస్తులు అని చెప్పుకొచ్చారు.

మూడోసారి మాయమాటలతో ముఖ్యమంత్రి కావాలని కేసీఆర్ అనుకుంటున్నారని చెప్పారు. కానీ తెలంగాణ బిడ్డలు కోరుకున్నది మాత్రం ఇంకా నెరవేరలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు, యువత ఏం కోరుకుంటున్నారనేది పరిశీలించామని చెబుతూ తెలంగాణ బిడ్డలు ఆత్మగౌరవం కోల్పోయారని పొంగులేటి వెల్లడించారు.

 కాగా,తొమ్మిదేళ్ల కేసీఆర్ పాలనలో ప్రజాస్వామ్యం పాతాళానికి, అవినీతి ఆకాశంకు చేరిమాడని జూపల్లి కృష్ణారావు ధ్వజమెత్తారు.  కేసీఆర్ ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడుతూ ప్రతిపక్షం ఉండొద్దని నియంతలా వ్యవహరించే వ్యక్తి మరోసారి అధికారంలోకి రాకుండా అడ్డుకోనేందుకే కాంగ్రెస్ లో చేరుతున్నట్లు తెలిపారు.

కాగా, జులై 2న ఖమ్మంలో జరిగే బహిరంగసభలో రాహుల్ గాంధీ సమక్షంలో పొంగులేటి కాంగ్రెస్ లో చేరుతారని టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలిపారు. అదే విధంగా జులై 12 లేదా 14న మహబూబ్ నగర్ లో మరో బహిరంగసభ జరుగుతోందని, అక్కడ జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ లో చేరతారని చెప్పారు.

ఈ సందర్భంగా పొంగులేటి, జూపల్లిలతో పాటు కాంగ్రెస్ లో చేరనున్న 35 మంది నాయకుల జాబితాను ఏఐసీసీకి ఇచ్చారు. ఈ రోజు జరిగిన భేటీలో రేవంత్ రెడ్డి, కేసీ వేణుగోపాల్, జానా రెడ్డి, మధుయాష్కీ షబ్బీర్ అలీ,  అరికెల నర్సారెడ్డి, గురునాథ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles