చిన్నమ్మ మీదికి అస్త్రాలు ఎక్కుపెట్టిన లక్ష్మీపార్వతి!

Monday, December 23, 2024

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారి ప్రాపకంతో తెలుగు, సంస్కృత అకాడమీ అధ్యక్షురాలుగా పదవిని పొందిన లక్ష్మీపార్వతి, ఇప్పుడు రాజకీయంగా కూడా కొత్త పదవులు కోరుకుంటున్నారేమో అనిపిస్తోంది. గతంలో ప్రత్యక్ష ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయిన ఆమె, ఇప్పుడు వైసీపీ తరఫున మరొకసారి బరిలోకి దిగాలని ఉత్సాహపడుతున్నట్లుగా ఉంది. దానికి అనుగుణంగా జగన్మోహన్ రెడ్డిని ప్రసన్నం చేసుకోవడానికి ఆయన రాజకీయ ప్రత్యర్థులైన చంద్రబాబు నాయుడు, బిజెపి రాష్ట్ర సారధి పురందేశ్వరి మీద విచ్చలవిడిగా విమర్శలు ఎక్కువ పెట్టడానికి లక్ష్మీపార్వతి సిద్ధం అవుతున్నారు.

నందమూరి తారక రామారావు శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఆయన బొమ్మతో కూడిన వంద రూపాయల స్మారక నాణేన్ని తీసుకురావడానికి పురందేశ్వరి ఆధ్వర్యంలో ఒక ప్రయత్నం జరిగింది. ఆ స్మారక నాణేలను ఆవిష్కరించడానికి ఆమె స్వయంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అపాయింట్మెంట్ కూడా తీసుకున్నారు. చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ తదితరులు సహా ఎన్టీఆర్ కుటుంబ సభ్యులందరినీ ఆహ్వానించి రాష్ట్రపతి భవన్ లో ఆ కార్యక్రమం నిర్వహించారు. దీనిని చూసి కన్నుకుట్టినట్లుగా లక్ష్మీపార్వతి చెలరేగి విమర్శలు చేస్తూ ఉండడం ఇప్పుడు రాజకీయ వర్గాలలో చర్చనీయాంశం అవుతోంది.

తాను ఎన్టీఆర్ అర్ధాంగినని, జీవిత సహచరిని అని చెప్పుకుంటూ- తనను ఎన్టీ రామారావు పెళ్లి చేసుకున్నారని లక్ష్మీపార్వతి ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి అంటున్నారు. ఎన్టీఆర్ తనని పెళ్లి చేసుకున్నట్లుగా పత్రికలలో వచ్చిన కథనాలను సాక్ష్యాలుగా ఆమె చూపిస్తున్నారు. ‘అసలు ఎన్టీఆర్ లక్ష్మీపార్వతిని పెళ్లి చేసుకోనే లేదు’ అనే వాదన తెరమీదకు వచ్చిన ప్రస్తుత సమయంలో ఆమె ఈ సాక్ష్యాలు చూపుతుండడం విశేషం. అయితే పెళ్లి అనే ప్రక్రియకు సంబంధించి పత్రికలలో వచ్చిన కథనాలు ఎప్పటికీ కూడా లీగల్ సాక్ష్యాలు కానేరవు అనే సంగతి బహుశా ఆమె పట్టించుకున్నట్లు లేదు. అయితే చంద్రబాబు నాయుడు మీద, దగ్గుబాటి పురందేశ్వరి మీద నిందలు వేయడానికి, తిట్టిపోయడానికి అవి సరిపోతాయని నమ్మకంతో మాత్రమే చెలరేగుతున్నారు.

నిజానికి ఎన్టీఆర్ స్మారక నాణేన్ని రాష్ట్రపతి విడుదల చేయడం అనేది ప్రభుత్వ అధికారిక కార్యక్రమం కాదు. ఆ నాణెం సమాజంలో నగదుగా చలామణి కావడం కోసం ప్రభుత్వం విడుదల చేసినది కూడా కాదు. ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే కార్యక్రమం కానప్పుడు, దానికి తనను ఆహ్వానించలేదని ఏ ఒక్కరూ కూడా అడిగే ప్రస్తావనే ఉండదు. అయితే జగన్ గూటిలో రాజకీయ లబ్ధిని, పదవులను ఆశిస్తున్న వ్యక్తిగా లక్ష్మీపార్వతి- ఆయనను ప్రసన్నం చేసుకునే ఉద్దేశంతోనే ఈ మాటలన్నీ మాట్లాడుతున్నారని ప్రజలు అనుకుంటున్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకురాలుగా పురందేశ్వరి బాధ్యతలు స్వీకరించడం, గత బిజెపి సారథుల మాదిరిగా జగన్ తో కుమ్మక్కురాజకీయం నడిపించకుండా.. ఆమె ఇండిపెండెంట్ గా వ్యవహరించడం వారికి జీర్ణం కావడం లేదు. అందుకే లక్ష్మీపార్వతి రూపంలో పురందేశ్వరిని నిత్యం చికాకు పెట్టడానికి ఒక అస్త్రాన్ని ప్రయోగించినట్లుగా కనిపిస్తోంది. ‘ఇకమీదట పురందేశ్వరి మీదనే తన పోరాటం’ అంటూ లక్ష్మీపార్వతి ప్రకటించడమే ఇందుకు నిదర్శనం అని ప్రజలు అనుకుంటున్నారు. ఆమె తన అడ్డగోలు వాదనలతో ప్రజలను మభ్యపెట్టడానికి ఎన్టీఆర్ కుటుంబం మీద బురద చల్లడానికి, వారి మధ్య విభేదాలు సృష్టించడానికి తన వంతు పాటు పడుతున్నదని కూడా ప్రజలు భావిస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles