చిడతలు వేయడంలో ఇది మరీ టూ మచ్!

Saturday, January 18, 2025

పవన్ కళ్యాణ్ రాష్ట్రంలోని వాలంటీర్లకు సంబంధించి ఏవో వ్యాఖ్యలు చేశారు. దాని మీద వీలైనంత రాద్ధాంతం చేయడానికి ఇపుడు వైఎస్సార్సీపీ దళాలు మొత్తం తమ శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నాయి. ఈ వ్యాఖ్యలను ఆలంబనగా చేసుకుని పవన్‌ను వీలైనంత బద్నాం చేయడం ఒక్కటే వారి లక్ష్యం గనుక.. ఎడా పెడా మాటలు అంటున్నారు. ఇలాంటి అడ్డగోలుగా విమర్శలు చేయడంలో సహజంగా కాస్త లాజిక్ మిస్ అవుతూ ఉంటారు. అయితే మంత్రి మేరుగ నాగార్జున అందులో పీక్స్ కు వెళుతున్నారు. గ్రామ వాలంటీర్లను దైవాంశ సంభూతులుగా అభివర్ణిస్తున్నారు.

నిజానికి పవన్ కళ్యాణ్ అన్నటువంటి మాటలు వేరు. ఆయన నింద వేసినది వాలంటీర్ల మీద కాదు.. వైఎస్సార్సీపీ నాయకుల మీద! వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు చేస్తున్న అరాచకాల మీద! ప్రభుత్వం సేకరిస్తున్న సమాచారాన్ని.. వైఎస్సార్సీపీ నాయకులు విమెన్ ట్రాఫికింగ్ కు వాడుకుంటున్నారని పవన్ అన్నారు. నిజ్జంగా పవన్ విమర్శించింది ఎవరినో అర్థం కానంత అమాయకులు వైఎస్సార్సీపీ నాయకులు కాదు. కాకపోతే చాలా తెలివిగా వాలంటీర్లను రెచ్చగొట్టారు. పవన్ మీదికి ఎగదోసారు. అటువైపు రచ్చ రచ్చ అవుతోంది. మరొకవైపు పవన్ ను తిట్టిపోయడంతో పాటూ తమ స్వామి భక్తిని ప్రదర్శించుకోవడానికి ఈ అవకాశాన్ని నాయకులు వాడుకుంటున్నారు.

వాలంటీర్లను మంత్రి మేరుగ నాగార్జున దైవాంశ సంభూతులుగా పేర్కొంటున్నారు. కేవలం దేవుడి అంశగా చెప్పేయడం మాత్రమే కాదు.. ఈ మాటలు ఆయన ఎక్కడ చెప్పారు అనేది కూడా ముఖ్యం.  అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు తిరు వేంకటేశ్వరుడు కొలువైన తిరుమల క్షేత్రంలో స్వామివారిని దర్శించుకుని వచ్చిన వెంటనే ఆయన ఇలా వాలంటీర్లు భజన స్టార్ట్ చేశారు. దేవుడి దర్శనం పూర్తి కాగానే ఆయనకు దైవాంశ సంభూతులు గుర్తుకొచ్చా రు. వీరినే అలాగంటే ఇక సాక్షాత్తూ సీఎం జగన్ ను ఏమైనా అంటే.. నాగార్జున ఏమైపోతారో? జగన్ అంటే అటు విష్ణుమూర్తి, ఇటు ఏసుప్రభువు, మహ్మద్ ప్రవక్త అందరి సమష్టి స్వరూపం అని అక్రోశిస్తారేమో!

వాలంటీర్లు వృద్ధులకు వికలాంగులకు సేవ చేస్తున్నారని మేరుగ అంటున్నారు. పెన్షన్లు ఇవ్వడం మినహా.. వారు ఏం సేవ చేస్తుండగా ఆయన చూశారో తెలియదు. అలాగే ప్రతి పెన్షను ఇవ్వడంలోనూ 100-200 రూపాయలు తమ వాటాగా తీసుకోకుండా ఇస్తున్న వాలంటీర్లను మేరుగ నాగార్జున ఎక్కడైనా చూశారో ఏమో కూడా చెప్పాలి. నాయకుల్లో ఈ అతి భక్తి వెల్లువను ప్రజలు తట్టుకోలేక పోతున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles