‘‘రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా అందరూ కలసి ఒక్కతాటిపైకి రావాలి.’’ ఆహా ఎంత అందంగా ఉంది ఈ సూచన!
‘‘అందరూ మనవైపే చూస్తుంటారు..’’ ఆహా.. ఎంత గొప్పగా చెప్పారు ఈ జాగ్రత్త!
‘‘రాజకీయ పార్టీల మధ్య విభేదాలు సహజం.. వాటిని మన వరకే పరిమితం చేసుకోవాలి.. ముందుకు సాగాలి’’ ఆహా ఎంత అద్భుతమైన సందేశం వెలిబుచ్చారో కదా.. మహానుభావుడు అని అనుకుంటాం.
కానీ.. ఈ మాటలు అన్నది ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని తెలిస్తే ముక్కున వేలేసుకుంటాం. ఏదో సామెత గుర్తు వస్తున్నట్టుగా ఉన్నదే అని ఆశ్చర్యపోతాం. భారత్ జీ20 దేశాలకు నాయకత్వం వహిస్తున్న నేపథ్యంలో వచ్చే ఏడాది జరిగే శిఖరాగ్ర సదస్సుకు సలహాలకోసం ఏర్పాటుచేసిన సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన సందేశం ఇది.
ఢిల్లీ వేదికగా అందరూ ప్రముఖులు ఉండే ఒక గొప్ప కార్యక్రమంలో మాట్లాడుతున్నప్పుడు.. దానికి తగినట్టుగా ఎవరైనా సరే ప్రిపేర్ అయి వెళ్తారు. ఆ క్రమంలోనే వైఎస్ జగన్ కూడా.. కొన్ని నీతులను వల్లించడానికి సిద్ధమై వెళ్లినట్టుగా ఉంది. ఏ పదాలకైతే అసలు తనకు అర్థమే తెలియదు అన్నట్టుగా జగన్ వ్యవహరిస్తుంటారో.. ఆ పదాలను ఆయన ఆ వేదికమీద నీతులుగా అందరికీ సందేశంగా అందించడమే పెద్ద కామెడీ.
రాజకీయాలకు అతీతంగా అందరేూ కలిసి ఒక్కతాటి మీదకు రావడం అనేది అసలు జగన్ పరిధిలో ఎన్నడైనా జరిగిందా? ఇప్పుడంటే రాజకీయ వైషమ్యాలు ముదిరిపోయాయి గనుక పరిస్థితులు కలిసి రావని అనుకోవచ్చు గానీ.. ఈ రాష్ట్రం దీనంగా కునారిల్లుతున్నప్పుడు.. కేంద్రం తన బాధ్యతగా ఇవ్వవలసిన ప్రత్యేకహోదా ఇస్తే.. అంతో ఇంతో అభివృద్ధి సాధ్యం అవుతుందని నమ్ముతున్న రోజుల్లోనైనా సరే ఆయన అన్ని పార్టీలతో కలిసి రాష్ట్రం కోసం తన గళం వినిపించడానికి ముందుకు వచ్చారా? ఆరోజు ఆయన ఒంటెత్తు పోకడలకు పోయి కుమ్మక్కు రాజకీయ డ్రామాలు నడిపించకుండా.. ప్రత్యేకహోదా కోసం ఐక్యంగా పోరాడి ఉంటే మనం సాధించకపోయే వాళ్లమా? అనే ప్రశ్న ఆయన సందేశం విన్నవారికి కలుగుతోంది.
అంతర్జాతీయంగా అందరూ మనవైపు చూస్తుంటారు- అనే సంగతి జగన్ కు తెలుసు. దేశమంతా మనవైపు చూస్తుంటారు అనే సంగతి మాత్రం తెలియదా? దేశం విస్తుపోయేలా రాజకీయ వేధింపులు, వ్యవస్థలమీద దాడిచేయడాలు, న్యాయవ్యవస్థపై సైతం నిందలతో చెలరేగిపోవడాలు వంటి దుర్మార్గాలకు పాల్పడుతోంటే ఎవ్వరూ గమనించరని అనుకుంటున్నారేమో తెలియదు.
రాజకీయ పార్టీల మధ్య విభేదాలు సహజం.. వాటిని మన వరకే పరిమితం చేసుకోవాలి.. ముందుకు సాగాలి- జగన్ నోటినుంచి ఈ మాట వింటే ఎవ్వరికైనా సరే నవ్వు వస్తుంది. రాజకీయ పార్టీల మధ్య ఉండేది విభేదాలు కాదు.. శత్రుత్వాలు అనే స్థాయిలో రాష్ట్రంలో పరిస్థితుల్ని మార్చేసిన వ్యక్తి జగన్. ఇద్దరు స్నేహితులు వేర్వేరు పార్టీల్లో ఉంటే వారిద్దరి మధ్య వాతావరణం కూడా చెడిపోయేలా కలుషితం అయ్యేలా పరిస్థితుల్ని మార్చేశారు. అలాంటి జగన్ ఢిల్లీ వెళ్లి.. అనేక సందర్భాల్లో విపక్షాలనుంచి ప్రముఖులను ఎంపిక చేసి ప్రభుత్వం తరఫున కీలక బాధ్యతలు అందిస్తూ ఉండే ప్రధాని మోడీకి ఈ హితోపదేశం చేయడం కామెడీగా ఉంది.
అందుకే ఆయన మాటలు.. సామెతను గుర్తుకు తెస్తున్నాయి.