`చలో బాట సింగారం’ అంటూ కిషన్ రెడ్డి హై డ్రామా

Friday, November 22, 2024

మూడేళ్లపాటు తెలంగాణ బీజేపీ అధ్యక్షునిగా ఉంటూ రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడం గురించి గాని, బలమైన నాయకత్వం కోసం గాని ప్రయత్నం చేయకుండా నిత్యం మీడియాలో కనిపించేటట్లు చేయడం కోసం హడావుడి చేస్తూ గడిపారు. దానితో చివరకు పార్టీకి అరిష్టంగా భావించి బలవంతంగా ఆ పదవి నుండి అధిష్టానం తొలగించాల్సి వచ్చింది.

ఎంతో అనుభవం ఉన్న కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డిని ఆ పదవిలో నియమించడంతో పార్టీని ఎన్నికలకు సిద్ధం చేసేందుకు కసరత్తు చేస్తారని ఆశించినవారిని నిరాశపరుస్తూ బండి బాటలో నడిచేందుకు సిద్ధపడుతున్నట్లు గురువారం `చలో బాట సింగారం’ చేపట్టి, అరెస్ట్ ద్వారా మీడియా దృష్టి ఆకట్టుకోవడం కోసం హై డ్రామా ఆడినట్లయింది.

రాష్త్ర అధ్యక్షుడిగా నియమించినప్పటి నుండి తెలంగాణ బీజేపీలో చలనం లేకుండా పోయిందని కధనాలు వస్తుండడంతో అమెరికా పర్యటన నుండి నేరుగా హైదరాబాద్ వచ్చి మీడియా హైప్ సృష్టించే ప్రయత్నం చేశారు. నాలుగు రోజులుగా తెలంగాణ అంతా వర్షాలతో ఉక్కిరి బిక్కిరి అవుతుంది. మరోవంక గురువారం నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి.

ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి మణిపూర్ లో రెండున్నర నెలలుగా మారణహోమం జరుగుతున్నా ఎప్పుడూ నోరు విప్పలేదు. కనీసం ఇప్పుడు ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి, అత్యాచారంకు పాల్పడినట్లు వీడియో ప్రత్యక్షం కావడంతో పార్లమెంట్ లో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడితే పట్టించుకోకుండా నేరుగా హైదరాబాద్ వచ్చారు.

నిజంగా బాట సింగారంలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం చూసేందుకు వెళ్లడం ఆయన ఉద్దేశం అయితే 60 వాహనాలలో దండయాత్రగా వీడుతున్నట్లు ప్రకటించారు. ఒక కేంద్ర మంత్రిగా ఆ విధంగా వెడుతున్నప్పుడు ముందుగా పోలీస్ అనుమతి అవసరం అని తెలియదా?  పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేసినప్పుడు వర్షంలో రోడ్డుపై బైఠాయించి అలజడి కలిగించడం వార్తలలో నిలబడటం కోసం కదా?

కాంగ్రెస్ మంచి జోష్ లో ఉండటం, కేసీఆర్ కోర్కె మేరకే బండి సంజయ్ ను మార్చి కిషన్ రెడ్డిని నియమించారని వార్తలు వ్యాపిస్తూ ఉండడంతో తన ఉనికి చాటుకోవడం కోసం పోలీసుల సహకారంతో ఈ డ్రామా అంతా ఆడినట్లు స్పష్టం అవుతుంది. పోలీసులు సహితం శాంతిభద్రతల ముప్పు ఏర్పడకుండా నిరోధించడం కోసమే కిషన్ రెడ్డిని ఆపినట్లయింది పరిమితంగా వెళ్ళమని సూచించి ఉండాల్సింది.

రోడ్ పై బైఠాయింపు జరిపినప్పుడు కిషన్ రెడ్డి ఉపయోగించిన బాషా సహితం అసహజంగా ఉంది. “నన్ను చంపేయండి..నేను ఇంటికి మాత్రం వెళ్ళను” అందంలో అర్థం ఏమిటి? ఒక నేరస్థుడితో, ఉగ్రవాదితో ఎలా వ్యవహరిస్తారో.. ఇవాళ తనతో పోలీసులు అలా వ్యవహరించారని మండిపడ్డారు. అదే నిజమైతే అదుపులోకి తీసుకొని నగరంలోని వివిధ ప్రాంతాల్లో తిప్పుతూ చివర్కౌ నాంపల్లిలోని బిజెపి రాష్ట్ర కార్యాలయం వద్ద విడిచిపెట్టరు గదా.

కాగా, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉదయం నుంచి డ్రామా చేస్తున్నారని మంత్రి తలసాని  శ్రీనివాస్ యాదవ్ ధ్వజమెత్తారు. డబుల్ బెడ్ రూమ్ ప్రారంబాలకు కిషన్ రెడ్డి, తాను కలిసి వెళ్ళామని గుర్తుచేశారు. కిషన్ రెడ్డి చాలా సార్లు డబల్ బెడ్ రూం ఇళ్లు బాగా ఉన్నాయి అని అన్నారని ఆయన పేర్కొన్నారు. బాట సింగారంలో కట్టిన డబుల్ బెడ్ రూం ఇళ్లు ఉన్నాయని తెలిపారు.

ఎక్కడైనా బిజెపి పాలిత రాష్ట్రాల్లో డబుల్‌ బెడ్ రూమ్ ఇళ్లు కట్టారా? అని ప్రశ్నించారు. కిషన్‌రెడ్డి కేంద్ర మంత్రిగా అధికారికంగా వెళ్లి డబుల్ బెడ్ రూంలు చూడవచ్చని, అయితే ఎందుకీ రాజకీయ డ్రామా అంటూ ప్రశ్నించారు. వస్తా అంటే కిషన్ రెడ్డిని కొల్లూరు తీసుకుని పోయి తానే చూపిస్తా అని తెలిపారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles