చర్చలు విఫలం … జగన్ కు ప్రభుత్వ ఉద్యోగుల అల్టిమేటం!

Saturday, January 18, 2025

వెంటనే తమ డిమాండ్లు తీర్చాల్సిందేనంటూ స్పష్టం చేస్తూ ప్రభుత్వం తమ డిమాండ్లకు ఒప్పుకోకపోతే ఈనెల 9వ తేదీ నుండి వచ్చే నెల 3వ తేదీ వరకూ ఉద్యమ కార్యాచరణకు దిగుతామని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంకు ఉద్యోగ సంఘాలుఅల్టిమేటం ఇచ్చాయి.

నెల రోజుల దశల వారి ఉద్యమంతోనైనా ప్రభుత్వం దిగి వస్తుందేమో అని ఆశిస్తున్నామని.. అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే వచ్చే నెల 5వ తేదీన భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తామంటూ తేల్చి చెప్పారు. అయితే,  దీనిపై ఎలా ముందుకెళ్లాలనే దానిపై ప్రభుత్వం ఆచితూచి అడుగులేస్తోంది. ఏపీ ఉద్యోగ సంఘాల నేతలతో మంత్రుల కమిటీ మంగళవారం జరిపిన సమావేశం విఫలమైంది.

రాష్ట్ర ఉద్యోగుల సమస్యలపై ఈ సమావేశంలో చర్చించామని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. కరోనా కారణంగా రాష్ట్ర ఆదాయం తీవ్రంగా దెబ్బతిన్నదని, ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగుల సమస్యలపై తామే రెండు మెట్లు దిగి చర్చిస్తున్నట్టు తెలిపారు.

ఆర్థిక వ్యవహారాలు పక్కన పెట్టి ఉద్యోగుల కనీస సమస్యలు పరిష్కరిస్తున్నామని చెప్పారు. ఉద్యోగ సమస్యల పరిష్కారంపై ఉద్యోగ నేతలు లిఖితపూర్వక హామీ కోరగా, నెలాఖరుకు రూ. 3 వేల కోట్లు ఇస్తామంటూ మంత్రుల కమిటీ దాటవేసింది. దీంతో ఉద్యమ కార్యాచరణ ఆగేదేలేదని బొప్పరాజు తేల్చి చెప్పారు.

వాస్తవానికి వారికి అన్ని ప్రయోజనాల కింద రూ.21,000కోట్లకు పైగా ప్రభుత్వం బకాయి పడగా, కేవలం రూ. 3,000 కోట్లు ఇస్తాములే అనడం, అందుకు కూడా నిర్దిష్టంగా హామీ ఇవ్వక పోవడంతో ఈ వారం జరుగనున్న ఎమ్యెల్సీ ఎన్నికలలో ఉద్యోగులు ప్రభుత్వంకు వ్యతిరేకంగా తిరగకుండా బుజ్జగించేందుకు వేస్తున్న డ్రామాగా భావిస్తున్నారు. డీఏ బకాయిలే బకాయిలు రూ 15,000 కోట్ల వరకు ఉన్నాయి.

  అయితే ప్రభుత్వ ధోరణిపై ఏపీ జేఏసీ అమరావతి  చైర్మన్‌ బొప్పరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలకు 1వ తేదీనే జీతాలు చెల్లిస్తున్నారని, మరి ఉద్యోగులకు 1వ తేదీనే ఎందుకు జీతాలు వేయడం లేదు? అని వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మంత్రులు, ఎమ్మెల్యేలకు సమయానికే పెన్షన్ ఇస్తున్నారని, ఉద్యోగులకు సీపీఎస్ రద్దు చేయమంటే మాత్రం మాట్లాడటం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వం ఏ హామీ ఇచ్చినా లిఖితపూర్వకంగానే ఇవ్వాలని బొప్పరాజు స్పష్టం చేశారు. మంత్రుల కమిటీ ఏం చెబుతుందో చూస్తామని, అప్పటివరకూ కార్యాచరణ యథావిధిగా కొనసాగుతుందని తేల్చి చెప్పారు. ఈ సమావేశానికి మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఆదిమూలపు సురేష్, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి హాజరయ్యారు.

ఇలా ఉండగా, ఉద్యోగ సమస్యలపై గవర్నర్‌ను కలిసిన నేత సూర్యనారాయణను చర్చలకు పిలవలేదు.   అప్పటి నుండి ఆయన సంఘాన్ని ప్రభుత్వం పక్కన పెడుతూ వస్తోంది. సంఘాన్ని ఎందుకు రద్దు చేయకూడదంటూ ప్రభుత్వం నోటీసు ఇవ్వగా, కోర్టుకు వెళ్లి ఆయన విజయం సాధించారు. ఈ ఉత్తర్వులపై కోర్టు స్టేటస్‌ కో ఇచ్చిన విషయం తెలిసిందే. ‘‘మా సంఘం గుర్తింపు రద్దు కాలేదు కదా! సమావేశానికి మమ్మల్ని ఎందుకు పిలవ’’లేదని ఆ సంఘం నేతలు పలువురు మండిపడుతున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles