రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వంటి వారి సభలకు పెద్ద ఎత్తున వస్తున్న జనాన్ని చూసి ఆందోళనలో పడిన ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయ సభలు, ర్యాలీలపై విధించిన ఆంక్షలు ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపుతున్నట్లు అధికార పక్ష నేతలే ఆందోళన చెందుతున్నారు. ప్రతిపక్షాలను చూసి జగన్ భయపడుతున్నాడనే సంకేతం పంపినట్లవుతుందని స్పష్టం చేస్తున్నారు.
గత ఎన్నికలలో 151 సీట్లు మాత్రమే గెల్చుకున్నామని, ఈ సారి కుప్పంతో సహా మొత్తం 175 నియోజకవర్గాలలో ఎందుకు విజయం సాధింపలేమని అంటూ పార్టీ శ్రేణుల ముందు నిర్దిష్ట లక్ష్యం ఉంచుతూ వెడుతున్న జగన్ అకస్మాత్తుగా ప్రతిపక్ష నేతల పర్యటనల పట్ల ఆత్మరక్షణలో పడినట్లు ఈ ఆంక్షలు సూచిస్తున్నట్లు వెల్లడవుతుంది.
కుప్పంలో అధికార దుర్వినియోగం, దౌర్జన్యాలతో మునిసిపల్ ఎన్నికలలో వైసిపి గెలుపొందిన తర్వాత జాగ్రత్త పడిన టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ప్రతి మూడు నెలలకు ఒకసారి పర్యటనలు జరుపుతూ, అక్కడే ఇల్లు కట్టుకొంటున్నట్లు ప్రకటిస్తూ ప్రజలలో మమేకం అవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అయితే, జగన్ ప్రభుత్వం విధించిన ఆంక్షలు చంద్రబాబు కుప్పం పర్యటన రోజునుండి ప్రారంభం కావడంతో టిడిపికి ఓ బలమైన అస్త్రం ఇచ్చిన్నట్లయింది.
మాములుగా అయితే, చంద్రబాబు వెళ్లి పార్టీ కార్యకర్తలు, అభిమానులతో సమావేశాలలో ప్రసంగించి వచ్చేవారు. కానీ ఇప్పుడు ఆయన బహిరంగ సభలు పెట్టరాదని ఆంక్షలు విధించడంతో పాటు, ప్రచార రధం డ్రైవర్ ను కూడా అరెస్ట్ చేయడంతో టిడిపి శ్రేణులలో ఆగ్రవేశాలు నింపాయి. పోలీసులపైననే తిరగపడే విధంగా చేసింది.
చంద్రబాబు సహితం ఓ సవాల్ గా తీసుకొని గ్రామాలు చుట్టి వస్తూ ఇంటింటికి తిరుగుతున్నారు. రాష్ట్రంలో జగన్ పని అయిపోయిందని.. టీడీపీ సభలకు ప్రజలు పోటెత్తుతున్నారని… అందుకే భయపడి చీకటి జీవో తీసుకొచ్చారని జనం మధ్యకు వెళ్లి విమర్శలు చేసే అవకాశం కల్పించి నట్లయింది.
ప్రతి పక్షాల సభలు ప్రభుత్వ దయ, దాక్షిణ్యాలతో జరిగేలా ప్రభుత్వం జీవో తెచ్చిందని మండిపడ్డారు. సీఏం వైఎస్.జగన్మోహన్ రెడ్డి మాత్రం రాజమహేంద్రవరంలో రోడ్‌షో, సభ నిర్వహించారని విమర్శించారు. అధికారపార్టీలకు, ప్రతిపక్షాలకు నిబంధనల్లో తేడాలెందుకని ప్రశ్నించారు.
తన పర్యటనపై నెల రోజుల ముందే డీజీపీకి లేఖ రాశానని, ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని చెబుతూ తీరా తాను పర్యటనకు వస్తే తన నియోజకవర్గ ప్రజలతో తాను మట్లాడవద్దా అంటూ ప్రభుత్వాన్ని, పోలీసుల్ని చంద్రబాబు ప్రశ్నించారు.
ఏ చట్టం ప్రకారం తనను మాట్లాడకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని నిలదీశారు. తన రోడ్ షోకు, సభకు ఎందుకు అనుమతిని ఇవ్వడం లేదో రాసివ్వాలని పోలీసులను అడిగానని… ఇంత వరకు వారి నుంచి స్పందించడం లేదని చెప్పారు. ఇలాంటి పనికిమాలిన దద్దమ్మ, సైకో సీఎంను తన జీవితంలో తొలిసారి చూస్తున్నానని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ప్రతిపక్షాలు ఎన్ని సభలు పెట్టుకున్నా జనం మనవైపే ఉన్నారంటూ పార్టీ శ్రేణులలో భరోసా నింపవలసిన సీఎం జగన్, ఒక విధంగా ఆంక్షల ద్వారా పిరికితనం నింపుతున్నారని వైసిపి వర్గాలు వాపోతున్నాయి.