ఒక వంక నందమూరి తారకరత్న అకాల మరణంతో విషాదం నెలకొన్న సమయంలో, తారకరత్న ఇంటివద్ద బద్ద రాజకీయ శత్రువులుగా పరిగణించే టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుతో వైసీపీలో కీలక నేత విజయసాయిరెడ్డి కలవడమే కాకుండా, ఇద్దరూ మాట్లాడుకుంటున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఇది కేవలం ఒక విషాద సంఘటన సందర్భంగా పరామర్శించుకోవటమేనా, యాదృశ్చికంగా జరిగిన కలయికేనా లేదా రానున్న రాజకీయ పరిణామాలపై ప్రభావం చూపుతుందా? అనే అనుమానాలు ముఖ్యంగా అధికార వైసీపీ వర్గాలలో కలుస్తున్నాయి.
అవకాశం దొరికితే టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు చేస్తుంటారు . సోషల్ మీడియాలో ఒంటికాలిపై లేచి విమర‌్శిస్తుంటారు. మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి విమర్శలు గుప్పిస్తుంటారు. అయితే తారకరత్న నివాసంలో చంద్రబాబు, విజయసాయిరెడ్డిలు పక్క పక్కనే కూర్చుని మాట్లాడుకోవడం రెండు పార్టీల్లో చర్చనీయాంశంగా మారింది.
సినీ నటుడు నందమూరి తారకరత్న మరణించడంతో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆదివారం ఉదయం నుంచి ఆయన నివాసంలో దగ్గరుండి ఏర్పాట్లు చేస్తూకనిపించారు. తారక రత్నసతీమణి అలేఖ్య రెడ్డి,సాయిరెడ్డి మరదలి కుమార్తె కావడంతో తారకరత్న అస్వస్థతకు గురైనప్పటి నుంచి తారకరత్న బాగోగులపై సాయిరెడ్డి దృష్టి పెట్టారు.
అదే సమయంలో, తారకరత్న తమ ఇంటి బిడ్డ కావడంతో అతనిని ఆసుపత్రిలో చేర్పించటం నుండి చికిత్స అందించడం, అతని కుటుంభ సభ్యులకు భరోసా ఇవ్వడం వరకు అంతా తానే అయి చంద్రబాబు నాయుడు వియ్యందుకు, బావమరిది నందమూరి బాలకృష్ణ వ్యవహరిస్తున్నారు. కొద్దీ రోజులక్రితం బెంగుళూరు ఆసుపత్రికి వెళ్లి వచ్చిన విజయసాయిరెడ్డి స్వయంగా బాలకృష్ణ తీసుకొంటున్న శ్రద్ద గురించి ప్రస్తావిస్తూ, ధన్యవాదాలు తెలిపారు. ఆ తర్వాత బాలకృష్ణ సహితం విజయసాయిరెడ్డికి ఫోన్ చేసి మాట్లాడారు.
తారకరత్న అంత్యక్రియలకు సంబంధించి కూడా అంతా బాలకృష్ణ నిర్ణయించిన ప్రకారం జరుగుతోందని స్వయంగా విజయసాయిరెడ్డి చెప్పారు. అంతేకాదు, తారకరత్న కుటుంభం సభ్యుల భవిష్యత్ కు సహితం బాలకృష్ణ భరోసా ఇచ్చినట్టు కూడా ప్రకటించారు. తారకరత్న వివాహం పట్ల మొదట్లో నందమూరి కుటుంభం సభ్యులు ఆగ్రహంతో, దగ్గరకు రానీయకపోగా ఓ అడుగు ముందుకు వేసి, వారందరిని కలపడంలో బాలకృష్ణ గతంలో కూడా కీలక పాత్ర పోషించడం ఈ సందర్భంగా గమనార్హం.
అందుకనే, తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి కోసం విజయసాయిరెడ్డి రాజకీయ విబేధాలను పక్కకు నెట్టి బాలకృష్ణ కుటుంభం సభ్యులతో కలిసిపోయి వ్యవహరించడం సాధారణంగానే కనిపిస్తుంది. ఒక వంక తారకరత్న చికిత్స కోసం బాలకృష్ణ ఎంతో శ్రమించారని విజయసాయిరెడ్డి అంటూ ఉంటె, తారకరత్న మొదటిరోజునే చనిపోయాడని, నారా లోకేష్ పాదయాత్రకు అపశకునంగా జనం భావిస్తారని ఇప్పటివరకు ఆసుపత్రిలో ఉంచారని అంటూ లక్ష్మి పార్వతి అసందర్భపు విమర్శలు చేయడం గమనార్హం.
తారక రత్నకు నివాళులు అర్పించడానికి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వచ్చిన సమయంలో కూడా సాయిరెడ్డి అక్కడే ఉన్నారు. నివాళులు అర్పించిన తర్వాత చాలా సేపు సాయిరెడ్డి, చంద్రబాబు నాయుడు ఒకే సోఫాలో కూర్చుని మాట్లాడుకోవడం అందర్ని ఆశ్చర్యానికి గురి చేసింది.
మాజీ సీఎం చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులపై వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తుంటారు. లోకేశ్‌పై దారుణమైన ట్వీట్స్ చేస్తుంటారు. అలాంటి వ్యక్తి చంద్రబాబును కలిసి.. ఏకంగా అరగంటకు పైగా మాట్లాడుతూ కెమెరాల్లో కనిపించారు. తారకరత్న భార్య తరపు బంధువు కావడంతో సాయిరెడ్డి, మేనత్త భర్తగా చంద్రబాబు అక్కడకు వచ్చినా ఇద్దరు కలిసి ముచ్చటించుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎడమొఖం, పెడమొఖంగా ఎవ్వరి దారిన వారుంకపోవడం గమనార్హం
తర్వాత చంద్రబాబు మీడియాతో మాట్లాడేందుకు వచ్చేటప్పుడు కూడా సాయిరెడ్డి ఆయన వెంట వచ్చారు. చంద్రబాబు మీడియాతో మాట్లాడినంతసేపు ఆయన పక్కనే నిలబడి ఉండడం విశేషం. లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభమైన వెంటనే తారకరత్న అస్వస్థతకు గురి కావడంతో సోషల్ మీడియాలో ట్రోల్స్ ప్రారంభమయ్యాయి. ఆ వెంటనే వైఎస్సార్సీపీలో సాయిరెడ్డికి కీలకమైన అనుచరులుగా ఉన్న వారు సంయమనం పాటించాలని సూచించారు.
తారకరత్న భార్య సాయిరెడ్డి కుమార్తె కావడంతో ట్రోల్ చేయొద్దని విజ్ఞప్తి చేశారు. తారకరత్నను ఉద్దేశించి ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని గట్టిగా సూచించడంతో వైసీపీ సోషల్ మీడియా బృందాలు లోకేష్‌పై విమర్శలు ఎక్కు పెట్టాయి. ఆదివారం ఉదయం నుంచి తారకరత్న నివాసంలో సాయిరెడ్డి కనిపించడంతో లక్ష్మి పార్వతి మినహా వైసీపీ తరపున పెద్దగా ట్రోల్స్ రాలేదు.
వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుండి జగన్ మోహన్ రెడ్డి ఆస్తులను కూడబెట్టుకోవడంలో ఆడిటర్ గా కీలకమైన సలహాలు విజయసాయిరెడ్డి ఇస్తూ వచ్చారు. అందుకనే జగన్ పై నమోదైన అక్రమార్జన కేసులు అన్నింటిలో ఆయన కూడా రెండో నిందితుడిగా ఉన్నారు. ఆయనతో పాటు జైలుకు కూడా వెళ్లివచ్చారు. ఆర్ధిక వ్యవహారాలు చక్కబెట్టడంలో దిట్టగా పేరొందిన విజయసాయిరెడ్డి అంటే జగన్ కు ప్రత్యేక అభిమానం ఉంది. అందుకనే మొదట్లో పార్టీలో, ప్రభుత్వంలో నం 2 గా పరిగణింపబడుతూ వచ్చారు.
అయితే, కొంతకాలంగా తాడేపల్లి ప్యాలెస్ లో వైఎస్ భారతి ప్రాధాన్యత పెరుగుతూ వచ్చినప్పటి నుండి విజయసాయిరెడ్డి ప్రాధాన్యత తగ్గుతూ వస్తున్నది. ఉత్తరాంధ్రలో పార్టీ వ్యవహారాలను ఆయన నుండి తప్పించారు. వైసిపిలో కీలక నియామకాలలో గతంలో వలే ఆయన పాత్ర ఉండటం లేదు. చివరకు ఢిల్లీలో పార్టీ వ్యవహారాలు చక్కబెట్టడంలో, మోదీ ప్రభుత్వంతో లైజాన్ చేయటంలో సహితం గాంతంలో వలే ఆయనకు ప్రాధాన్యత లేదు. అందుకనే కొంతకాలంగా సోషల్ మీడియాలో సహితం రాజకీయ ప్రత్యర్థులపై పదునైన వాఖ్యలు చేయడం లేదు.
ఈ పరిణామాల నేపథ్యంలో చంద్రబాబుకు సన్నిహితంగా కనిపించడం ద్వారా విజయసాయిరెడ్డి పరోక్షంగా జగన్ మోహన్ రెడ్డికి హెచ్చరిక పంపే ప్రయత్నం చేస్తున్నారా? అనే అనుమానాలు సహితం కలుగుతున్నాయి. తనను నిర్లక్ష్యం చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉండేవకాశం ఉంటుందనే హెచ్చరికలు పంపే ప్రయత్నం చేశారా? అని కూడా పలువురు భావిస్తున్నారు.