సరిగ్గా నెల రోజుల క్రితం రాజమహేంద్రవరంలో జరిగిన టీడీపీ మహానాడులో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు 2024 ఎన్నికల గురించి `భవిష్యత్ కు గ్యారంటీ’ అంటూ ప్రకటించిన ఆరు అంశాలతో కూడిన `మినీ మేనిఫెస్టో’ జనం మధ్యలో నవ్వులపాలైన్నట్లు స్పష్టం అవుతుంది. ఎంతో పరిపాలన అనుభవం గల చంద్రబాబు ఇటువంటి `చావుకబారు ప్రయోగం’ చేసారేమిటని ఆ పార్టీలోనే పలువురు ప్రముఖులే వాపోతున్నారు.
అందులోని అంశాలన్నీ ప్రస్తుతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అమలు పరుస్తున్న `బటన్ నొక్కుడు’ నగదు బదిలీ పథకాలకు కాపీ చేసినవిగా ఉండడంతో చెప్పుకోదగిన ప్రభావం చూపలేకపోయింది క్షేత్రస్థాయి నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. క్షత్రస్థాయి అనుభవం లేకుండా టిడిపి కేంద్ర కార్యాలయంలో కీలక పదవులలో కొనసాగుతూ, ఇతరులపై ఆధిపత్యం చెలాయిస్తున్న కొందరు నేతలు ఈ విషయంలో చంద్రబాబును తప్పుడుదోవ పట్టించారని ప్రచారం జరుగుతుంది.
మినీ మ్యానిఫెస్టోను విస్తృతంగా జనంలోకి వెళ్లి ప్రచారం చేయమని కార్యక్రమాలు ఇస్తున్నా జనంకు కొత్తగ్గా చెప్పేందుకు వాటిల్లో ఏముందని జిల్లా స్థాయి నేతలు తేల్చి పారేస్తున్నారు. అయితే, ఈ విషయంలో ఈ మినీ మేనిఫెస్టో జనంలో సంచలనం సృష్టిస్తుందని అంటూ సోషల్ మీడియాలో 80 శాతం మైలేజ్ ఇస్తున్నదని అంటూ చంద్రబాబుకు తప్పుడు నివేదికలు ఇస్తున్నట్లు తెలిసింది.
అయితే, టిడిపి `వార్ రూమ్’లోని ప్రముఖులు మీడియాలో మైలేజ్ 6 శాతం మాత్రమే అని అసలైన లెక్కలు చంద్రబాబుకు చెప్పారు. ఇప్పటి వరకు టిడిపి చేపట్టిన ఏ కార్యక్రమంకు ఇంత తక్కువ మైలేజ్ రాలేదని కూడా తేల్చి చెబుతున్నారు. 2019 ఎన్నికలకు ముందే జగన్ మోహన్ రెడ్డి `నవరత్నాలు’ను ప్రకటించిన తర్వాత చంద్రబాబు ప్రభుత్వం పసుపుకొమ్ములు వంటి కొన్ని కార్యక్రమాలను అమలు పరచినా ప్రయోజనం లేకపోయిందని, ఇప్పుడు ఇటువంటి పథకాలు ఎటువంటి ప్రభావం చూపుతుందని ప్రశ్నిస్తున్నారు?
మరోవంక, ఈ అంశాలను ప్రజలలోకి తీసుకెళ్లేందుకు నియోజకవర్గాల స్థాయిలో చేపట్టిన బస్సు యాత్రలు సహితం ఓ పరవశంగా జరుగుతున్నట్లు తెలుస్తున్నది. మొక్కుబడిగా ఈ యాత్రలు జరుగుతున్నాయని, ప్రజలపై చెప్పుకోదగిన ప్రభావం చూపలేక పోతున్నాయని క్షత్రస్థాయి నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
ప్రతి రోజు పూజలు, ఇతర సన్నాహాలు పూర్తి చేసి యాత్ర ప్రారంభమయ్యే సరికి 11 గంటలు దాటుతుంది. ఒకటి, రెండు గంటలు కాగానే భోజన విరామం. తిరిగి సాయంత్రం 4- 5 గంటలకు బయలుదేరి ఓ బహిరంగసభలో పాల్గొంటున్నారు.
ఇక ఆ రాత్రికి అక్కడే బస. రాజకీయంగా ఉపయోగం లేకపోయినా ఈ యాత్ర బస సమయంలో భోజనాలు, మరుసటి రోజు ఉదయం అల్పాహారం ఏర్పాటుకు స్థానిక నాయకులకు లక్షల రూపాయలలో ఖర్చవుతుంది. దానితో వారు హడలిపోతున్నారు.
ఇక, నాయకులు అందరూ బస్సులలో ఉమ్మడిగా ప్రయాణం చేయాలని చెప్పినా ఎక్కడ జరగడం లేదు. బస్సులో కన్వీనర్, మరో కొద్దిమంది మాత్రమే ఉంటున్నారు. మిగిలిన నాయకులు అందరూ ఎవ్వరి కారులో వారు వెంట వస్తున్నారు. అసలు బస్సు యాత్రలు ఏమాత్రం ప్రభావంతంగా జరుగుతున్నాయో పార్టీ వైపు నుండి చెప్పుకోదగిన పర్యవేక్షణ ఉండటం లేదు. అన్నింటిని చంద్రబాబు చూసుకోవాలన్న సాధ్యం కాదు.