చంద్రబాబు ‘పెన్నా టు వంశధార’ ప్రాజెక్టుల సందర్శన

Friday, November 15, 2024

ఏపీలో సాగునీటి ప్రాజెక్టుల పరిశీలనకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సిద్ధమయ్యారు. ‘పెన్నా టు వంశధార’ పేరుతో ఆగస్టు 1 నుంచి 10 రోజుల పాటు ప్రాజెక్టులను సందర్శించనున్నారు. ప్రాజెక్టుల సందర్శనకు రూట్ మ్యాప్ ఖరారు చేశారు. ఆగస్టు 1వ తేదీన ఉమ్మడి కర్నూలు జిల్లాలో మొదలయ్యే పర్యటనలో మచ్చుమర్రి, బంకచర్ల ప్రాజెక్టులను చంద్రబాబు సందర్శించనున్నారు. 

అదే రోజు నందికొట్కూరులో రోడ్ షో, బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొంటారు. ఆగస్టు 2వ తేదీన కొండాపురం ప్రాజెక్టును పరిశీలించనున్నారు. అదే రోజు పులివెందులలో రోడ్ షో, పూల అంగళ్ల సర్కిల్ వద్ద నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. ఆగస్టు 3న ఉమ్మడి అనంతపురం జిల్లాలోని పేరూరు లిఫ్ట్ ఇరిగేషన్‌ ప్రాజెక్టు, గొల్లపల్లి రిజర్వాయర్‌లను సందర్శిస్తారు. అదే రోజు పెనుగొండ పరిధిలోని కియా కార్ల ఫ్యాక్టరీని సందర్శించనున్నారు. 

ఆగస్టు 4వ తేదీన ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పలమనేరు బ్రాంచ్‌ కెనాల్‌ సందర్శించనున్నారు. పూతలపట్టులో రోడ్‌ షో, అనంతరం బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొంటారు. వైసీపీ ప్రభుత్వంలో మొత్తం 198 ఇరిగేషన్ ప్రాజెక్టులు ప్రీక్లోజర్ చేస్తే అందులో 96 ప్రాజెక్టులు కోస్తాంధ్రలో ఉన్నాయని చంద్రబాబు తెలిపారు. 

ఇటీవల టీడీపీ కేంద్ర కార్యాలయంలో ‘పడకేసిన ప్రాజెక్టులు-ప్రజా ద్రోహి జగన్ ‘ అంటూ చంద్రబాబు ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. ప్రాజెక్టు గేట్లకు కనీసం గ్రీజ్ కూడా పెట్టడంలేదని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలోని 69 నదుల అనుసంధాన ప్రక్రియ పూర్తి చేస్తే, నీటి సమస్యే ఉండదని పేర్కొన్నారు.

 ఉత్తరాంధ్రలో వంశధార, నాగావళి ప్రధాన నదులన్న చంద్రబాబు వీటితో పాటు అనేక ఉపనదులు ఉన్నాయని తెలిపారు. ఉత్తరాంధ్రలో నదులను అనుసంధానం చేసేందుకు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు చేపట్టామని చంద్రబాబు గుర్తు చేశారు. వంశధార-గోదావరి నదులను అనుసంధానం చేసే అవకాశం ఉందని చెప్పారు. 

కానీ వైసీపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. కోస్తాంధ్ర ప్రాజెక్టులపై టీడీపీ ప్రభుత్వంలో రూ.21,442 కోట్లు ఖర్చు పెడితే, వైసీపీ ప్రభుత్వం కేవలం రూ.4,375 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టిందని విమర్శించారు. టీడీపీ హయాంలో మొత్తం 64 ప్రాజెక్టులు మొదలు పెట్టి 23 పూర్తి చేశామని చంద్రబాబు స్పష్టం చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో 4 శాతం ప్రాజెక్టుల పనులు చేసిందని విమర్శించారు.

రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులను వైసీపీ ప్రభుత్వం సర్వనాశనం చేసిందని చంద్రబాబు ఆరోపించారు. దేశంలో ఏ రాష్ట్రానికీ లేనివిధంగా ఏపీకి నీటి వనరులు మనకు ఉన్నాయని చెబుతూ నదులు అనుసంధానం చేస్తే ప్రతి ఎకరాకు నీరు ఇవ్వొచ్చని స్పష్టం చేశారు. నీటిపారుదల శాఖను నాశనం చేసిన వైసీపీ ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 

కృష్ణ, గోదావరి నదుల అనుసంధానం వల్ల రాష్ట్రానికి మేలు కలుగుతుందని చెప్పారు. అనంతపురం లాంటి జిల్లాల్లో పదేళ్లల్లో ఎనిమిదేళ్లు వేరుశెనగ పంటలు ఎండిపోయిన పరిస్థితులు ఉండేవని, అలాంటి సమయంలో రాయలసీమ ప్రజలకు ఎన్టీఆర్ తెలుగు గంగ ప్రాజెక్టు తెచ్చారని గుర్తు చేశారు. హంద్రీ – నీవా, గాలేరు నగరి ప్రాజెక్టులకు అంకురార్పణ చేశారని తెలిపారు. హంద్రీ -నీవా ప్రాజెక్టు కోసం టీడీపీ రూ. 4 వేల కోట్లకు పైగా ఖర్చు పెడితే, వైసీపీ ప్రభుత్వం రూ.500 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టిందని మండిపడ్డారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles