సత్తెనపల్లి ఇంఛార్జ్ గా మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణను నియమిస్తూ ప్రకటన చేయగానే కొందరు ధిక్కార ధోరణులు ప్రదర్శిస్తుండటం గమనిస్తే పార్టీ నేతలపై పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పట్టు కోల్పోతున్నారా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. సత్తెనపల్లిలో 2019లో మాజీ స్పీకర్ డా. కోడెల శివప్రసాదరావు ఓటమి చెందడానికి ఆయన కుమారుడు డా. శివరాం అక్కడ చేసిన అరాచకాలు కారణమని అందరికి తెలుసు.
కొడుకును అదుపులో పెట్టుకోమని పలువురు పార్టీ పెద్దలతో పాటు సవయంగా చంద్రబాబు నాయుడు కోడెలకు సూచించారు. అయితే ఆయన నిస్సహాయత వ్యక్తం చేయడంతో చంద్రబాబు సహితం ఏమీచేయలేక పోయారు. ఆ విధంగా 2019 ఎన్నికలలో ఓటమి చెందుతారని తెలిసి కూడా అనేకమందికి తిరిగి సీట్లు ఇచ్చారు.
తాజాగా, కౌరవసభను గౌరవసభగా చేసేందుకు వచ్చే ఎన్నికలలో టిడిపి గెలుపొందాలని, అందుకనే గెలిచేవారికే సీట్లు ఇస్తానని చంద్రబాబు ప్రకటించారు. 2019లో జేసీ దివాకరరెడ్డి వంటివారు కొన్ని సర్వేల నివేదికలు తీసుకెళ్లి కనీసం 40 మంది ఎమ్యెల్యేలను మార్చనిదే పార్టీ గట్టెక్కదని స్పష్టం చేశారు. అయినా, వారెవ్వరిని చంద్రబాబు మార్చలేకపోయాడు.
నియోజకవర్గాలలో విచ్చలవిడిగా అవినీతికి పాల్పడి, సొంత పార్టీ శ్రేణుల నుండి వ్యతిరేకత తెచ్చుకున్నవారు అనేకమంది నారా లోకేష్ లేదా చంద్రబాబు అండదండలు ఉండడంతో తిరిగి సీట్లు పొందారు. సత్తెనపల్లిలో పార్టీ బ్రస్టు పట్టేందుకు కారకుడైన డా. కోడెల శివరాం అలిగారని సముదాయించేందుకు నక్కా ఆనందబాబు, జివి ఆంజనేయులు వంటి వారిని పంపించడం చంద్రబాబు బలహీనతలనే వెల్లడి చేస్తుంది.
పైగా, గత ఎన్నికలలో ఓటమి చెందిన తర్వాత మొన్నటివరకు పార్టీ గురించి పట్టించుకోకుండా, వ్యాపారాలు చేస్తూకొంటున్న మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు వచ్చి కోడెల కుటుంబానికి న్యాయం చేయాలనడం, తన నియోజకవర్గంలో ఎవ్వరో ట్రస్ట్ అంటూ సేవా కార్యక్రమాలు చేయడం ఏమిటి? అంటూ ఆగ్రవేశాలు వ్యక్తం చేస్తున్నారు.
అప్పట్లో ఆయనకు మంత్రి పదవి ఇవ్వడమే వివాదాస్పదమైనది. ఆయన మంత్రిగా ఉండగా నియోజకవర్గంలో ఆయన భార్య పెత్తనం చేస్తున్నదనే ఆరోపణలు వచ్చాయి. తాను చెప్పిన్నట్లు చేయలేదని ఆమె నేరుగా జిల్లా కలెక్టరుకు ఫోన్ చేసి, దుర్భాషలాడారు. ఆ కలెక్టర్ ఆమె మాట్లాడిన మాటల రికార్టును నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గరకు తీసుకెళ్లి వినిపిస్తే ఆయన ఏమీ చెప్పలేకపోయారు.
తాజాగా, విజయవాడ ఎంపీ కేశినేని నాని వైసీపీ ఎమ్యెల్యేలతో వేదికను పంచుకొంటూ, పరస్పరం ప్రశంసలు కురిపించుకొంటూ … వచ్చే ఎన్నికల్లో తనకు సీట్ ఇవ్వని పక్షంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని ప్రకటించారు. లేదా తనకు మరెవ్వరు సీట్ ఇచ్చినా వారి తరపున పోటీచేస్తా అంటూ వైసిపిలో చేరేందుకు సిద్ధం అంటూ పరోక్షంగా సంకేతం ఇచ్చారు.
అటువంటి నానిని మందలించకుండా తనతో పాటు ఢిల్లీకి తీసుకెళ్లడం ఒక విధంగా చంద్రబాబు బలహీనతలనే వెల్లడి చేస్తుంది. గెలిచేవారికి సీట్లు ఇస్తానని లేదా పార్టీ కోసం పనిచేసేవారికి ఇస్తానని మాటలు చెప్పడమే గాని చివరకు ఎన్నికల సమయంలో ఇతరత్రా అంశాలను పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. ఎమ్యెల్సీల ఎంపిక, రాజ్యసభ సభ్యుల ఎంపికలో చాలావరకు పార్టీ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని చేసినట్లు మాత్రం కనబడుటలేదు.