ఎన్నికల సమయంలో తమ పార్టీ శ్రేణులలో ఉత్సాహం కలిగించడం కోసం తామే అధికారంలోకి రాబోతున్నామనే భరోసాను ఏ నాయకుడైనా ఇవ్వాల్సి ఉంటుంది. ఆంధ్ర ప్రదేశ్ లో నోటా కన్నా తక్కవ ఓట్లు తెచ్చుకున్న, పోటీ చేయడానికి బలమైన అభ్యర్థులు కూడా లేని బిజెపి నాయకులు సహితం ఎప్పుడు ఎన్నికలు జరిగినా రాబోయెడిది తామే అన్నట్లు ప్రగల్భాలు నిత్యం పలుకుతున్నారు.
అయితే, కీలకమైన ప్రతిపక్ష నేతలు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మాత్రం సెంటిమెంట్ అస్త్రం ప్రయోగించడం ద్వారా ప్రజల సానుభూతి పొందాలని తప్పటడుగు వేస్తున్నారా? అనే అభిప్రాయం బలంగా వారి పార్టీలలోని నెలకొంటుంది. ప్రజా వ్యతిరేక పాలన అందిస్తున్నట్లు చెబుతున్న వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చుతామనే భరోసా ఇవ్వాల్సింది పోయి, ఒక విధంగా నిరాశాజనకంగా మాట్లాడుతున్నారు.
ఒక విధంగా చంద్రబాబు, పవన్ కలసి క్షేత్రస్థాయిలో ఆయా పార్టీల శ్రేణులు కోరుకొంటున్నారు. ఈ విషయంలో నిర్దుష్టమైన స్పష్టత ఇచ్చే ప్రయత్నం రెండు పార్టీల నేతలు చేయడం లేదు. కర్నూల్ జిల్లా పర్యటన సందర్భంగా “ఇవే చివరి ఎన్నికలు కావచ్చు” అంటూ టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు చేసిన ప్రసంగం ఆయన రాజకీయ ప్రత్యర్థులకు సహితం విస్మయం కలిగించింది.
ఆ తర్వాత గోదావరి జిల్లాల పర్యటనలో “ఇవి ఏపీకి చివరి ఎన్నికలు కావచ్చు” అంటూ సర్దుబాటుకు ప్రయత్నం చేసిన్నప్పటికీ జరగవలసిన నష్టం అప్పటికే జరిగిపోయింది. 2024 ఎన్నికలను ఎదుర్కోవడానికి చంద్రబాబు భయపడుతున్నారా? అనే అభిప్రాయం సహితం ఈ సందర్భంగా కలుగుతుంది.
ప్రజా క్షేత్రంలోకి వెళ్లి ప్రభుత్వంకు వ్యతిరేకంగా ప్రజలను, పార్టీ శ్రేణులను సమీకరించడం పట్ల దృష్టి సారింప కుండా, ఒక వంక పొత్తులకు పవన్ కళ్యాణ్ కలసి వస్తారా? రారా? అనే మీమాంసలో, మరోవంక కేంద్రంలోని బిజెపి వైసిపి మరోసారి అధికారంలోకి తేవడం కోసం ఎత్తుగడలు వేస్తూనే ఉంటుందా? అనే ఆందోళన మరో వంక ఆయనను వెంటాడుతున్నట్లు పలువురు భావిస్తున్నారు.
రాజకీయ పోరాటాలలో ఎప్పుడు ఇటువంటి అస్పష్టత దారుణమైన ప్రతికూలతను తీసుకు వస్తుందని నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం గల చంద్రబాబుకు తెలియని విషయం కాదు. మొదటి నుండి సరైన సమయంలో తప్పుడు నిర్ణయాలు తీసుకోవడంలో దిట్టగా ఆయన ప్రఖ్యాతి చెందారు.
మరోవంక, తాను విఫల రాజకీయ నాయకుడిని అంటూ పవన్ కళ్యాణ్ చేసిన వాఖ్య సహితం ప్రజలలో ఆయన “నిజాయతి” పట్ల సానుభూతిని తీసుకు రావడం కన్నా, ఎన్నికలకు ముందే చేతులెత్తేస్తున్నారనే సంకేతం ఇస్తుందని గ్రహించడం లేదు. వైసిపిని ఓడిస్తామని చెప్పడమే గాని అందుకు నిర్దుష్టమైన రాజేకీయ ఎత్తుగడలను ఆయన ప్రదర్షింపలేక పోతున్నారు.
చివరకు సొంత పార్టీ శ్రేణులకు సహితం వచ్చే ఎన్నికలలో తమ సత్తా చూపగలమనే భరోసా ఇవ్వలేక పోతున్నారు. 2019 ఎన్నికలలో ఓటమి చెందినా `వైసిపి ప్రభంజనం’ అని సరిపెట్టుకోవచ్చు. కానీ మరోసారి, అదే విధంగా జరిగితే జనసేనకు రాజకీయ మనుగడ ప్రశ్నార్ధకరం కాగలదని గ్రహించాలి.
జనసేన కేవలం పవన్ కళ్యాణ్ అభిమానుల కూటమిగా మాత్రమే ఉంది గాని, నిర్దుష్టమైన ఓ రాజకీయ స్వరూపమే, సంస్థాగత నిర్మాణం చేసుకోలేక పోయినదని గ్రహించాలి. ఎన్నికలలో పోటీ చేయడానికి బలమైన అభ్యర్థులను గుర్తించే ప్రక్రియ చేపట్టాక పోవడం ఎన్నికల సమయంలో ప్రతికూలతలు దారితీసే అవకాశం ఉంటుంది.
పొత్తుల విషయాన్నీ ఎన్నికలకు కొద్దీ నెలల ముందు తేల్చుకోవచ్చు. ఈ లోగా ఎన్నికలలో గట్టి పోటీ ఇచ్చే విధంగా, వైసీపీ దౌర్జన్యాలను తట్టుకొనే విధంగా పార్టీ శ్రేణులను సమాయత్తం చేసుకుంటూ, పోటీ చేయడానికి బలమైన అభ్యర్థులను గుర్తించడం కూడా టిడిపి, జనసేన ఇప్పటి నుండే ప్రారంభించాలి. లేని పక్షంలో రాజకీయంగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని గ్రహించాలి.
ఆత్మనూన్యతను కలిగించే `సానుభూతి’ అస్త్రాలను ప్రయోగించడం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ విరమించుకోవాలి. జగన్ మోహన్ రెడ్డి తిరిగి అధికారంలోకి రావడానికి పనికి వస్తాయి అనుకొంటున్న పలు సంక్షేమ పధకాల పట్ల నిర్దుష్టమైన వైఖరిని ఈ రెండు పార్టీలు ప్రదర్శించాలి. అప్పుడే ప్రజల విశ్వాసం చూరగొనే అవకాశం ఉంటుంది.