‘వై నాట్ 175’ అంటూ ఏపీలో వైసీపీకి తిరుగులేదని, కుప్పంతో సహా అన్ని సీట్లను గెల్చుకోబోతున్నామని అంటూ నిత్యం పార్టీ శ్రేణులకు భరోసా కలిగించే ప్రయత్నం చేస్తుండే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాజాగా చంద్రబాబు నాయుడు – పవన్ కళ్యాణ్ ల భేటీతో ఖంగు తిన్నట్లు స్పష్టం అవుతుంది.
ఆయన ఒక్కరే కాదు, ఆయన మంత్రులు, పార్టీ నాయకులు అందరూ ఈ విషయమే చేస్తున్న ప్రకటనలు ఈ విషయాన్నే స్పష్టం చేస్తున్నాయి. వారిద్దరి భేటీ జరుగుతూ ఉండగానే, ఏమేమి మాట్లాడుకున్నామో బైటకు చెప్పకుండానే వీరు దూషణలతో ప్రకటనలు చేయడం ప్రారంభించడాన్ని చూస్తుంటే వారెంతగా ఖంగు తిన్నారో స్పష్టం అవుతుంది.
పవన్ కాపుల ఆత్మగౌరవాన్ని చంద్రబాబుకు తాకట్టు పెడుతున్నారని, కాపు జాతికి ద్రోహం చేస్తున్నారని, పవన్ ప్యాకేజి లీడరని, ఇద్దరు ముసుగు దొంగలని, జనసేన టిడిపికి ‘బి’ టీమ్ అని, రాజకీయాలంటే సినిమా కాదని అనేక విధాలుగా వ్యక్తిగత విమర్శలు కుప్పించారు. పవన్ కు ఒక్క సీట్ కూడా గెలిచే సత్తా లేదని అంటూనే ఇంతగా భయపడవలసిన అవసరం ఏమిటనే ప్రశ్న తలెత్తుతుంది.
సంక్షేమ కార్యక్రమాలే తమను తిరిగి గెలిపిస్తాయని జగన్ ఎంతగా చెబుతున్నా రోజు రోజుకు ప్రజా వ్యతిరేకత పెరుగుతున్నదని భయంన్నట్లు వెల్లడి అవుతుంది. అందుకనే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సభలకు జనం తరలి వస్తుంటే తట్టుకోలేక ఎక్కడికక్కడ ఆంక్షలు విధిస్తూ వచ్చారు. ఆలోచన లేకుండా భయంతో చేసే పనులు ఎప్పుడు ప్రతికూల ప్రయత్నాలు అంటాయి.
ఇప్పుడు అదే జరిగింది. విశాఖపట్నంలో పవన్ ను అడ్డుకోవడంతో చంద్రబాబు స్వయంగా వెళ్లి ఆయనను విజయవాడలో కలిసి, సంఘీభావం వ్యక్తం చేసే అవకాశం ఇచ్చినట్లయింది. కుప్పంలో చంద్రబాబు పర్యటనలకు పోలీసులు అడుగడుగునా అడ్డు చెప్పడంతో ఇప్పుడు చంద్రబాబు వద్దకు పవన్ వెళ్లే సందర్భం ఎదురయింది.
ఒక విధంగా జగన్ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు, తమ ప్రజాబలంపై సన్నగిల్లుతున్న నమ్మకమే తప్పటడుగులు వేసేటట్లు చేసి, చంద్రబాబు – పవన్ లు ఉమ్మడిగా పోటీ చేయక తప్పని పరిస్థితి వచ్చినట్లు స్పష్టం అవుతోంది.
2019 ఎన్నికల్లో వచ్చిన ఓట్ల శాతాన్ని పరిశీలిస్తే వైఎస్‌ఆర్‌సిపికి 49.95 శాతం ఓట్లు వచ్చాయి. వేర్వేరుగా పోటీ చేసిన టిడిపికి 39.26 శాతం, జనసేనకు 5.15 శాతం ఓట్లు వచ్చాయి. రెండు పార్టీల ఓట్ల శాతాన్ని కలిపినా వైఎస్‌ఆర్‌సిపికి ఇంకా దాదాపు 5 శాతం ఓట్లు అధికంగానే కనిపిస్తుంది. అందుకని వాస్తవానికి టిడిపి, జనసేన కలిస్తే భయపడవలసిన పరిస్థితి లేదు.
అయితే తమ పరిపాలనలో ప్రజా వ్యతిరేకతను పెంచుకున్నామని జగన్, మంత్రులు గ్రహించారు. అందుకనే ప్రతిపక్ష ఓట్లలో చీలికలు తీసుకు రాని పక్షంలో తాము గెలుపొందడం అసాధ్యమని భావిస్తున్నారు. ఈ అంచనాతోనే స్వయంగా ముఖ్యమంత్రి మర్యాదను మరచి పవన్ కళ్యాణ్ ను `దత్తపుత్రుడు’ అంటూ వ్యక్తిగత దూషణకు దిగుతూ వారిద్దరూ కలవకుండా శతవిధాలా ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. చివరకు బిజెపిని కూడా ప్రయోగించారు.
అయితే ప్రభుత్వం అనుసరిస్తున్న అణచివేత విధానాలే ఉమ్మడిగా ఉంటేగాని ఎదుర్కోలేమనే బలమైన నిర్ణయానికి ఆ రెండు పార్టీలు వచ్చేటట్లు చేశాయని చేశాయి. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల కన్నా కక్ష సాధింపు చర్యలే ప్రజలలో ప్రభుత్వ వ్యతిరేకతను పెంపొందింప చేస్తున్నాయి. ప్రభుత్వాన్ని ఒక విధంగా ఆత్మరక్షణలో పడేస్తున్నాయి. స్వయంగా ముఖ్యమంత్రి చేయించుకున్న సర్వేల ప్రకారమే మూడోవంతు ఎమ్యెల్యేలపై వారి వారి నియోజకవర్గాలలో తీవ్ర ప్రతికూలత నెలకొంది.
ఈ వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకునే జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను ఎట్టి పరిస్థితుల్లో చీలనివ్వమని పదేపదే ప్రకటించడం అధికార నేతల గుండెల్లో రైళ్లు పరిగెట్టేటట్లు చేస్తున్నాయి. మంత్రులే నిత్యం బూతులు తిట్టేందుకు సిద్ధపడుతున్నా పట్టించుకోకుండా పవన్ ముందడుగు వేస్తున్నారు.