వచ్చే ఏడాది జరగాల్సిన ఎన్నికలు లక్ష్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విస్తృతంగా ప్రజలలోకి వెడుతుండటం, వారి సభలకు అనూహ్యంగా జన స్పందన లభిస్తుండటంతో తన అధికారానికి రోజులు దగ్గర పడ్డాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిలో అసహనం పెరుగుతున్నట్లున్నది.
అందుకనే, వారిద్దరిని జనం మధ్యకు వెళ్లకుండా అడ్డుకోవడానికి రాష్ట్ర ప్రజల భద్రత దృష్ట్యా..ఇకపై రోడ్లపై సభలు, ర్యాలీలని నిషేదిస్తున్నట్లు ఏపీ రాష్ట్ర హోమ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అధికారులు నిర్ణయించిన ప్రదేశంలో మాత్రమే సభలు పెట్టుకోవాలని సూచించింది. ఈ నియమాలని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
జాతీయ, రాష్ట్ర, మున్సిపల్, పంచాయతీ రహదారులపై, అలాగే మార్జిన్లలో సభలు, ర్యాలీలకు అనుమతించేది లేదని తెలిపింది. అత్యంత అరుదైన సందర్భాల్లో జిల్లా ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు ఖచ్చితమైన షరతులతో అనుమతి ఇవ్వచ్చని మినహాయింపు ఇచ్చింది. ఇక ఇలా రూల్ పెట్టడంతో ఇకపై చంద్రబాబు రోడ్ షోలకు, సభలకు బ్రేకులు పడే అవకాశాలు ఉన్నాయి.
అదే సమయంలో త్వరలోనే నారా లోకేష్ పాదయాత్ర మొదలుపెట్టనున్న విషయం తెలిసిందే. అటు పవన్ బస్సు యాత్ర మొదలుపెట్టనున్నారు. ఈ నిర్ణయం వల్ల..ఇప్పుడు వారికి చెక్ పెట్టినట్లు కాగలదు. ఇటీవల కందుకూరు,గుంటూరు లలో చంద్రబాబు నాయుడు జరిపిన బహిరంగసభలలో తొక్కిసలాట కారణంగా జరిగిన జననష్టాన్ని సాకుగా చూపుతూ ఈ ఆంక్షలు విధించారు.
ఈ ఉత్తరువు రాగానే చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటనపై పోలీసులు ఆంక్షలు విధించారు. షెడ్యూల్ ప్రకారం బుధవారం నుంచి మూడు రోజులపాటు చంద్రబాబు కుప్పంలో పర్యటించనున్నారు. చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శికి పలమనేరు డీఎస్పీ నోటీసులిచ్చారు. సభలు ఎక్కడ పెడుతున్నారో ముందస్తు సమాచారం ఇవ్వాలని నోటీసులిచ్చారు.
” చంపేది చంద్రబాబే.. మొసలికన్నీరు కార్చేది” ఆయనే అంటూ టిడిపి జరిగిన జననష్టంపై చంద్రబాబును ఉద్దేశిస్తూ సీఎం జగన్ మండిపడ్డారు. చంద్రబాబుకు తెలిసింది ఫొటోషూట్లు, డ్రోన్‌షాట్లు, డ్రామాలు.. సీఎంగా ఉన్నప్పుడు పుష్కరాల్లో డ్రోన్ షాట్ల కోసం 29 మందిని పొట్టనబెట్టుకున్నారని అంటూ సీఎం విరుచుకు పడ్డారు.
రాజకీయ పార్టీలను నియంత్రించాలనే ఉద్దేశంతో బహిరంగ సభలు, ర్యాలీలను నిషేధిస్తూ అర్ధరాత్రి వేళ హడావుడిగా ఉత్తర్వులు ఇవ్వడం ద్వారా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తన నిరంకుశ ధోరణిని బయటపెట్టిందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ కన్వీనర్ నాదెండ్ల మనోహర్ ఆరోపించారు.
రాష్ట్ర హోమ్ శాఖ ఉత్తర్వులు జారీచేయడంఫై బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసారు. రాష్ట్రంలో అధికార పార్టీకి ఒక రకరమైన నిబంధనలు, విపక్ష పార్టీలకు మరో రకమైన నిబంధనలు విధించడం సరికాదని హితవు చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబు సభలో ప్రజలు చనిపోవడం బాధాకరమని… ఈ ఘటనపై సభ నిర్వాహకులపైన లేదా టీడీపీపైన చర్యలు తీసుకుంటే ఎవరికీ అభ్యంతరం లేదని, సభకు అనుమతులు కోరిన వారిపై కూడా చర్యలు తీసుకోవచ్చని తెలిపారు.