ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదింపేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఒక్కటిగా ఎన్నికల బరిలోకి వెళ్లేందుకు సన్నాహాలు చేసుకొంటున్నట్లు మూడు రోజులక్రితం వారిద్దరి మధ్య జరిగిన భేటీ స్పష్టం చేస్తుంది. ఈ విషయంలో బీజేపీ కలిసి వస్తే సరి, లేకపోతే తామే ముందుకు వెళ్లాలని వారిద్దరూ ఒక నిర్ణయానికి వచ్చిన్నట్లు తెలుస్తున్నది.
గతంలో రెండు దఫాలుగా చంద్రబాబు, పవన్ భేటీ అయినా, ఈ పర్యాయం మాత్రం నిర్దుష్టంగా సమాలోచనలు జరిపినట్లు చెబుతున్నారు. అయితే ఈ భేటీపై జనసేన తమ మిత్రపక్షం అని చెప్పుకొంటున్న ఏపీ బిజెపి నేతలు మౌనం వహించడం ఆసక్తి కలిగిస్తోంది. ఇంతకు ముందు రెండు సార్లు వీరిద్దరూ భేటీ అయినప్పుడు వారి భేటీల గురించి నిష్ఠూరంగా మాట్లాడారు. పవన్ కళ్యాణ్ ను తమ నుండి హైజాక్ చేసేందుకు చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నట్లు మాట్లాడారు.
అయితే, తాజగా మూడోసారి వారు భేటీ కావటంపై ఏపీ బీజేపీ నేతలు ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తుంది. రాజకీయాల్లో భేటీలు జరుగుతూనే ఉంటాయంటూ ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సౌమ్యంగా సమాధానం ఇచ్చారు. వారేమీ మాట్లాడుకున్నారో తనకు తెలియదని, వారే చెప్పాలంటూ పేర్కొన్నారు. మరోవంక, రాష్ట్రం తిరోగమనంలో ప్రయాణిస్తున్నందున పురోగమనంలోకి తీసుకొచ్చే విషయాలపై చర్చిస్తున్నామంటూ బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ చెప్పడం గమనార్హం.
రాష్ట్రంలో వైఎస్ జగన్ ను గద్దె దింపాలంటే వ్యతిరేక ఓటు చీలకుండా చేయడం కోసం టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడిగా పోటీ చేయాలని గత ఏడాది ప్రతిపాదించిన పవన్ కళ్యాణ్ ఈ విషయమై ఎక్కడా ఏపీ బీజేపీ నేతలతో సమాలోచనలు జరిపిన దాఖలాలు లేవు. నేరుగా ఢిల్లీలోని బీజేపీ అగ్రనేతలతోనే మాట్లాడుతున్నారు.
బిజెపి అగ్రనేతలు సహితం ఈ విషయమై ఏపీ బిజెపి నేతలతో ఎప్పుడు చర్చించిన దాఖలాలు లేవు. కేవలం, పొత్తుల విషయం పార్టీ అధిష్టానంపై వదిలివేసి, పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి సారించాలని రాష్ట్ర నాయకులకు హితవు చెబుతున్నారు.
పవన్ కళ్యాణ్ ఏపీ బీజేపీ నేతలతో కాకుండా నేరుగా బీజేపీ అధిష్టానంతో మాట్లాడుతుండడం, తర్వాత చంద్రబాబుతోనే మాట్లాడుతుండడం, మూడుపార్టీల మధ్య పొత్తుకోసం తీవ్రంగా ప్రయత్నిస్తుండటం, ఈ మొత్తం ప్రక్రియలో తమకు ఎటువంటి పాత్రకూడా లేకుండా చేస్తుండటం పట్ల ఏపీ బిజెపి నేతలు ఒకింత అసహనంగా ఉన్నట్లు తెలుస్తోంది. నోటా కన్నా తక్కువ ఓట్లున్న పరిస్థితులలో ఏపీ బిజెపి నేతలను పట్టించుకోవలసిన అవసరం లేదన్నట్లు బిజెపి అగ్రనాయకత్వం కూడా వ్యవహరిస్తున్నట్లు స్పష్టం అవుతుంది.
ఏదేమైనా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తాజా భేటీ ఏపీలో కొత్త రాజకీయ సమీకరణలకు దారితీస్తోందని అంచనాలు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో బిజెపికి గట్టి దెబ్బ తగిలే అవకాశం ఉందనే సంకేతాలు వెలువడడంతో ఎన్నికల ఫలితాల అనంతరం దక్షిణాదిన కొత్త పొత్తులకు బిజెపి ప్రయత్నాలు చేస్తుందని జనసేన, టిడిపి నేతలు భావిస్తున్నట్లు కనిపిస్తున్నది. అందుకనే, కర్ణాటక ఎన్నికల అనంతరం మరింత వివరంగా సమాలోచనలు జరపాలని చంద్రబాబు, పవన్ నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు.
మొదటి నుంచి టీడీపీతో కలిసే ప్రసక్తే లేదని ఏపీ బీజేపీలోని ఓ వర్గం అధికార పక్షం కోసమే అన్నట్లు వ్యవహరిస్తూ వస్తుంది. ఇప్పుడు ఆ నేతలు ఇరకాటంలో పడే పరిస్థితులు నెలకొన్నాయి. అందుకనే పోటీపడి వైఎస్ జగన్ ప్రభుత్వంపై విమర్శలకు దిగాల్సి వస్తుంది. గతంలో మాదిరిగా సందర్భం లేకుండానే చంద్రబాబు నాయుడుపై ఒంటెత్తున ఎగిసిపడటాన్ని తగ్గించుకోవలసి వస్తున్నది.