చంద్రబాబునాయుడు, తాను భవిష్యత్ పరిణామాలు, అభివృద్ధి, సాంకేతిక విప్లవం అన్నిటినీ సమన్వయం చేసుకుంటూ ప్రగతి బాటలను నిర్దేశించగల ఆలోచన స్థాయి ఉన్న వ్యక్తిని అని మరో మారు నిరూపించుకున్నారు. దార్శనిక దృక్పథం ఉన్న నాయకుడిగా ఆయన గురించి విశ్లేషకులు పేర్కొనే మాట నిజమే అని చాటారు. భారత ప్రతిష్ఠకు సంబంధించి, ప్రపంచ దేశాల ఎదుట భారత దేశపు ఔన్నత్యాన్ని నిరూపించవలసిన మార్గనిర్దేశనానికి సంబంధించి ఏర్పాటుచేసిన సమావేశంలో.. విపక్ష నేత అయినప్పటికీ.. సలహాల కోసం తనను ఆహ్వానించిన ప్రధాని నరేంద్రమోడీ పెట్టుకున్న నమ్మకాన్ని కూడా ఆయన నిలబెట్టారు. మనదేశంలో పుష్కలంగా ఉన్న యువమేథస్సును సద్వినియోగం చేసుకుని.. ప్రపంచంలో అగ్రగామిగా ఆవిర్భవించడానికి వచ్చే 25 ఏళ్ల కోసం ఒక విజన్ డాక్యుమెంట్ రూపొందించాలంటూ చంద్రబాబునాయుడు సందేశం అందించారు.
భారత్ జీ20 నాయకత్వ బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో ఢిల్లీలో ఒక అఖిలపక్ష సమావేశం జరిగింది. వచ్చే ఏడాది భారత్ లోనే జరిగే జీ20 శిఖరాగ్ర సదస్సుకు సంబంధించి సన్నాహక చర్యలను ఇందులో చర్చించారు. ఈ సమావేశానికి ప్రత్యేక ఆహ్వానంతో హాజరైన చంద్రబాబునాయుడు.. దేశానికే దిశానిర్దేశం చేయగల చక్కటి ప్రసంగం చేశారు. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత.. విజన్ 2020 పేరుతో రాష్ట్ర అభివృద్ధికి రోడ్ మ్యాప్ తయారుచేసి.. పురోగమనంలో కీలక పాత్ర వహించిన సంగతి అందరికీ గుర్తుంటుంది. మధ్యలో తాను అధికారంలో లేకపోయినప్పటికీ.. తన విజన్ 2020 నిరాటంకంగా సాగే వాతావరణానికి ఆయన తొలి రోజుల్లోనే భూమిక సిద్ధం చేశారు. అదే తరహాలో.. దేశం 75వ స్వాతంత్ర్యదినోత్సవాలను జరుపుకుంటున్న ఈ సమయంలో.. వందేళ్ల స్వాతంత్ర్య ఉత్సవాల ఘట్టం ఆవిర్భవించే నాటికి దేశాన్ని ప్రపంచంలో అగ్రదేశాల సరసన నిలపాలనే తన స్వప్నాన్ని ఆయన ఈ సమావేశంలో ఆవిష్కరించారు.
యువమేథస్సును మనం సద్వినియోగం చేసుకోవాలని, రాబోయే 25 ఏళ్ల కోసం విజన్ డాక్యుమెంట్ రూపొందించి ప్రణాళిక బద్ధంగా అడుగులు వేస్తే ప్రపంచాన్ని శాసించే స్థితికి చేరుకుంటాం అని ఆయన పేర్కొన్నారు. మోడీ సారథ్యంలో ‘ఇండియా ఎట్ హండ్రెడ్ ఇయర్స్- గ్లోబల్ లీడర్’ పేరుతో ఆ డాక్యుమెంట్ తయారుకావాలని అభిలషించారు.
2047 నాటికి భారతదేశంలో సగటు వయస్సు పెరిగే అవకాశం ఉంటుందని కూడా విశ్లేషిస్తూ.. ఆ వృద్ధ భారతాన్ని కూడా మన శక్తిగా మార్చుకునేలా విజన్ డాక్యుమెంట్ తయారుచేయగలిగితే.. మనకు తిరుగు ఉండదని కూడా చెప్పారు. ఇప్పటినుంచే ఒక వ్యూహం ప్రకారం. డెమోగ్రఫిక్ మేనేజిమెంట్ ద్వారా వ్యవహరిస్తే వయోభార సమస్యను ఎదుర్కోవడం పెద్ద సమస్య కాదని కూడా ఆయన వివరించారు. ప్రధాని మోడీ తన ప్రసంగాన్ని ప్రారంభించే ముందు.. చంద్రబాబు ప్రసంగంలోని అంశాలను కూడా ప్రత్యేకంగా ప్రస్తావించడం విశేషం.
చంద్రబాబు దార్శనికదృక్పథంలో భారత్ భవిష్యత్ ఇదీ!
Wednesday, January 15, 2025