ఖమ్మంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాల్గొన్న బహిరంగ సభకు అనూహ్య స్పందన కనిపించడం, రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీ అభిమానులలో కదలిక తీసుకు రావడంతో అధికార బిఆర్ఎస్ నేతలు ఉలిక్కి పడినట్లు కనిపిస్తున్నది. 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత చంద్రబాబు తెలంగాణాలో పాల్గొన్న భారీ బహిరంగసభ ఇదే కావడంతో, వచ్చే ఏడాది జరిగే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
పైగా, ఖమ్మం బహిరంగసభకు పొరుగున ఉన్న ఏపీలోని జగ్గయ్యపేట, నందిగామ ప్రాంతాల నుండి జనాలు వచ్చారు గాని తెలంగాణ నుండి ఎవ్వరు రాలేదు అన్నట్లు బిఆర్ఎస్ నేతలు ప్రచారం చేస్తున్నారు. అయితే వాస్తవానికి గ్రేటర్ హైదరాబాద్, ఉమ్మడి నల్గొండ, మహబూబ్ నగర్, ఖమ్మం తదితర జిల్లాల నుండి పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. అదే ఇప్పుడు అధికార పార్టీ నేతలలో కలవరం సృష్టిస్తోంది.
2018లో చంద్రబాబు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకొని, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో వేదిక పంచుకోవడంతో కాంగ్రెస్ వ్యతిరేక రాజకీయాలకు అలవాటు పడిన టీడీపీ శ్రేణులు సహించలేక పోయారు. దానితో తిరిగి కాంగ్రెస్ ద్వారా `ఆంధ్రోవాళ్ళు (చంద్రబాబు) మనపై పెత్తనం చేసే ప్రయత్నం చేస్తున్నారు’ అంటూ కేసీఆర్ ప్రయోగించిన సెంటిమెంట్ అస్త్రం బాగా ఉపయోగపడింది.
దానితో టీడీపీ అభిమానులు ఎవ్వరు కాంగ్రెస్ కు ఓటు వేయడానికి ఇష్టపడక టిఆర్ఎస్ కు వేయడంతో ఆ పార్టీ అంచనాలకు మించి సీట్లు గెల్చుకోగలిగింది. ఆ తర్వాత ఏపీలో సహితం అధికారం కోల్పోవడంతో చంద్రబాబు తెలంగాణ రాజకీయాలపై శ్రద్ద చూపడం మానేశారు. కానీ ఇప్పుడు తిరిగి ఇటు వైపు దృష్టి మళ్లించడం సహజంగానే బిఆర్ఎస్ నేతలకు ఖంగారు కలిగిస్తున్నది.
దాదాపు 40 అసెంబ్లీ నియోజకవర్గాలలో గెలుపోటములను నిర్ధేశింపగల సామర్ధ్యం టిడిపి మద్దతుదారులకు ఉంది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ నుండి కూడా పెద్ద సంఖ్యలో ఖమ్మం బహిరంగ సభకు టీడీపీ అభిమానులు తరలి వెళ్లడం అధికార పార్టీకి ఆందోళన కలిగిస్తుంది.
టిడిపి బలమైన అభ్యర్థులను పోటీకి దింపితే అధికారంలోకి రాలేకపోయినా కేసీఆర్ ను అధికారంకు దూరం చేసే అవకాశం ఉంటుందని భయపడుతున్నారు. అందుకనే, ఖమ్మం సభపై ఆ పార్టీ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు ఆరాటపడుతున్నారని ఆర్ధిక మంత్రి టి హరీష్ రావు ధ్వజమెత్తారు. బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకే చంద్రబాబు డ్రామాలు చేస్తున్నారని ఆరోపించారు. ఏదో ఉద్దరించానని చంద్రబాబు చెబితే ప్రజలు నమ్ముతారా? అని ప్రశ్నించారు.
అసలు భయాన్ని హరీష్ రావు వెళ్లగక్కారు. ఇప్పటి వరకు టిడిపికి దూరంగా ఉంటున్న బీజేపీలో ఒక వర్గం టిడిపి అండ లేకుండా తెలంగాణాలో బిఆర్ఎస్ ను ఓడించలేమని వాదిస్తున్నది. టిడిపి మద్దతుదారులను ఆకట్టుకునేందుకు ప్రత్యేకంగా ప్రయత్నం చేయాలని ఆ పార్టీ జాతీయ నాయకులు కూడా రాష్ట్ర నాయకులకు సూచించారు.
బీజేపీలో చేరిన టిడిపి ఎంపీ గరికపాటి మోహనరావును కేవలం టిడిపి నేతలను బిజెపిలోకి ఆకర్షించే పని చేయమని కోరారు. అయితే అందులో ఆయన ఏమాత్రం విజయం సాధించలేకపోయారు. ఏపీలో వైఎస్ జగన్ ను ఓడించేందుకు సహకరిస్తామని భరోసా ఇస్తే గాని టిడిపి మద్దతుదారులు బిజెపికి తెలంగాణాలో ఓటు వేయలేరని స్పష్టం చేస్తున్నారు.
ఇటువంటి పరిస్థితులలో ఖమ్మం సభ బీజేపీ నాయకత్వంపై కూడా స్పష్టమైన సందేశం పంపినట్లయింది. ఈ పరిణామాలు అన్ని సహజంగానే బిఆర్ఎస్ నేతలలో కలవరం పుట్టిస్తున్నాయి.
‘‘మేము ఖమ్మంలో సుఖంగా ఉన్నాం. ఇబ్బంది పెట్టకండి.. దండ యాత్రలా మా మీదకు రాకండి.. ఏపీలో పరిస్థితులు ఎలా ఉన్నాయో అంతా చూస్తున్నారు.. అక్కడి ప్రజలు పారిపోయి తెలంగాణకు వస్తున్నారు..’’ అంటూ ఖమ్మంకు చెందిన మంత్రి అజయ్ కుమార్ తన భయాందోళనలను స్పష్టంగా వ్యక్తం చేశారు.
టీడీపీ రాజకీయాలు తెలంగాణలో చెల్లవని అంటూ ఎమ్యెల్సీ కవిత తన అసహనతను వ్యక్త పరిచారు. చుక్కలు ఎన్ని ఉన్నా చంద్రుడు ఒక్కడే అన్నట్లు తెలంగాణలో కేసీఆర్ ఒక్కడే అంటూ ఆమె తన భయాందోళనలను కప్పిపుచ్చుకొనే ప్రయత్నం చేశారు.