చంద్రబాబు కాన్వాయ్ లో వైసిపి వాహనాలతో కలకలం!

Saturday, January 18, 2025

ఏపీలో `జెడ్ ప్లస్’ కేటగిరీ భద్రత గల ఏకైక నేత అయిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎక్కడకు పర్యటనకు వెడుతున్నా రాష్త్ర పోలీసుల భద్రతా వైఫల్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.  ఈ విషయమై ఎస్పీజీ ఉన్నతాధికారులే పలు సందర్భాలలో ఆగ్రహం వ్యక్తం చేయడం, రాష్ట్ర పొలిసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అయినా వారిలో మార్పు రావడం లేదు.

తాజాగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కాన్వాయ్‌లోకి వైఎస్సార్‌సీపీ వాహనాలు చొచ్చుకు రావడం కలకలంరేపింది. ఆయన పశ్చిమగోదావరి పర్యటనలో భాగంగా ఉండవల్లిలోని తన నివాసం నుంచి రోడ్డు మార్గంలో తణుకు నియోజకవర్గంలోని ఇరగవరం బయల్దేరారు.

చంద్రబాబు కాన్వాయ్ ఉంగుటూరు సమీపానికి వచ్చేసరికి రెండు వైఎస్సార్‌సీపీ వాహనాలు చంద్రబాబు కాన్వాయ్‌లోకి రావడం భద్రతా వర్గాలకు విస్మయం కలిగించింది. ఒక వాహనంపై  వైసీపీ స్టిక్కర్‌ ఉన్నప్పటికీ పోలీసు ఎస్కార్టు వాహనాల సిబ్బంది చూసీ చూడనట్లు వ్యవహరించారని తెలిసింది.

ఈ వాహనాలు తాడేపల్లిగూడెం వరకు దాదాపు 15 కిమీ మీరా అనుసరించినట్లు తెలుస్తోంది. భద్రత నిబంధనల ప్రకారం చంద్రబాబు కాన్వాయ్‌ వెళ్లే దాకా సాధారణ వాహనాలను అనుమతించకూడదు. ఒకవేళ ఆ వాహనాలు పొరపాటున వచ్చినా, పోలీసుల ఎస్కార్ట్ వెంటనే తప్పించాల్సి ఉంటుంది. అయినా రాష్త్ర పోలీసులు పట్టించుకోకపోవడంతో,  వెంటనే రంగంలోకి దిగిన ఎన్‌ఎస్‌జీ సిబ్బంది ఆ వాహనాలను నియంత్రించింది.

చంద్రబాబు తణుకు నియోజకవర్గం ఇరగవరంలో రైతులతో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొంటూ ప్రభుత్వ విధానాల కారణంగా ధాన్యం రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు చంద్రబాబు. ధాన్యం కొనుగోలు అక్రమాలు చోటుచేసుకుంటున్నాయని అంటూ ఎన్నికలకు ముందు జగన్ రైతులకు చెప్పిందేంటి.. ఇప్పుడు చేస్తోంది ఏంటి అని ప్రశ్నించారు.

ఉమ్మడి రాష్ట్రంలో తుఫాన్ వచ్చిన సమయంలో.. రాజమండ్రిలో సచివాలయం పెట్టి సహాయ చర్యలు చేపట్టామని గుర్తు చేశారు. నాయకుడు అంటే కష్టం వచ్చినప్పుడు నిలబడాలని అంటూ ఈ ప్రభుత్వం పంటలకు ఎందుకు బీమా కట్టలేదని ప్రశ్నించారు. దీంతో పరిహారం వచ్చే అవకాశం కూడా లేకుండా పోయిందని చెప్పారు.

రైతుల నుంచి బస్తాకు రెండు కేజీలు ఎక్కువ తీసుకుంటున్నారని చంద్రబాబు ప్రశ్నించారు. ఇదెక్కడి న్యాయం ? రైతులు ఎందుకివ్వాలి ? ప్రభుత్వం దళారి వ్యవస్థ కాదని, మిల్లర్లు పెత్తందార్లు కాదని ధ్వజమెత్తారు. రైతులకు వంద కేజీల బస్తాకు అదనంగా అయిదు నుంచి ఆరు కేజీలు ఎక్కువ ధాన్యం తీసుకుంటున్నారని విమర్శించారు.

మిల్లర్లు నూక చూపించి దానికి డబ్బులు  వసూలు చేస్తున్నారని అంటూ  అకాల వర్షాల వల్ల ఇబ్బందులు పడుతున్న రైతులను మిల్లర్లకు డబ్బులు చెల్లించమనడం ఏమిటని మండిపడ్డారు. రైతుల సమస్యలపై ప్రశ్నించడానికి రైతు పోరుబాట పెట్టానని, అందుకే ఇక్కడ పాదయాత్ర పెట్టాను అని చెప్పారు.

రైతులకు న్యాయం జరిగేవరకు ప్రభుత్వాన్ని వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి ఎందుకు రైతు వద్దకు రాలేదో చెప్పాలని నిలదీశారు. ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు ధాన్యం కొంటున్నామని కబుర్లు చెబుతున్నారని ధ్వజమెత్తారు.

ఒక మంత్రి రైతుల్ని ఎర్రిపప్ప అంటారా? రైతులంటే అంత లెక్కలేనితనమా? అంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మంత్రికి కనీసం రైతు అంటే గౌరవం లేదని అంటూ నోరుమూయాల్సింది రైతులు కాదు, ఈ మంత్రులు, ఈ ప్రభుత్వం అని మండిపడ్డారు. ఏడాదిలో టీడీపీ అధికారంలోకి వస్తుంది.. అప్పుడు వైఎస్సార్‌సీపీ నేతలు ఎక్కడికి పోవాలో చూసుకోండి అని హెచ్చరించారు.

కాకినాడ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే నేతృత్వంలో ధాన్యం సిండికేట్.. 40 కేజీల బస్తాపై రెండు కేజీలు అదనంగా తీసుకుంటున్నారని చంద్రబాబు ఆరోపించారు. ఆ రెండు కేజీలు ఎక్కడికి పోతుందని ప్రశ్నించారు. రైతును మోసం చేస్తే చర్యలు తీసుకుంటాం అని ప్రభుత్వం చెప్పింది.. మరి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. అదనంగా వసూలు చేస్తున్న 2 కేజీలు తాడేపల్లి ప్యాలెస్ కే కదా అని విమర్శించారు.

రాష్ట్రానికి విభజన వల్ల జరిగిన నష్టం కంటే జగన్ విద్వంస పాలనతో జరిగిన నష్టమే ఎక్కువని చంద్రబాబు చెప్పారు. పోలవరాన్ని గోదావరిలో కలిపేశారని, అమరావతిని నిర్వీర్యం చేశారని అంటూ కౌలు రైతుల ఆత్మహ్యతల్లో ఏపీ రెండో స్దానంలో ఉందని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు.  దేశంలో ఒక రైతుపై రూ. 75 వేలు తలసరి అప్పుంటే మన రాష్ట్రంలో ఒక్కో రైతుపై రూ.2.40 లక్షలు ఉందని తెలిపారు.

ఈ ప్రభుత్వ విధానాల వల్ల రైతులు వ్యవసాయాన్ని వదిలేసే పరిస్థితి ఉందని అంటూ టీడీపీ అధికారంలోకి వచ్చాక రైతులు పొలాల్లోనే ధాన్యం ఆరబెట్టుకునేందుకు సిమెంట్ కాంక్రీట్ తో కల్లాలు ఏర్పాటు చేస్తామని చంద్రబాబు ప్రకటించారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles