చంద్రబాబు కాన్వాయ్‌పై రాళ్ల దాడి..కేంద్రం సీరియస్

Sunday, January 19, 2025

టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాన్వాయ్‌పై రాళ్ల దాడి ఘటనపై కేంద్ర హోంశాఖ సీరియస్ అయింది. జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉన్న చంద్రబాబు నాయుడు పుంగనూరు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంత్రివర్గంలో కీలకమైన మంత్రిగా పేరున్న డా. రామచంద్రారెడ్డి నియోజకవర్గంలో ఈ దాడి జరగడంతో రాజకీయంగా కలకలం రేపుతోంది. 
కుప్పంలో చంద్రబాబు నాయుడును వచ్చే ఎన్నికల్లో ఓడించేందుకు వ్యూహరచన అంతా డా. రెడ్డి చేస్తుండటం గమనార్హం.

‘ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి’ పర్యటనలో భాగంగా శుక్రవారం అన్నమయ్య జిల్లా అంగళ్లు నుంచి పుంగనూరు బయల్దేరిన చంద్రబాబును అడ్డుకునేందుకు వైసీపీ శ్రేణులు యత్నించాయి. 
చంద్రబాబు గో బ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.దీంతో ఒక్కసారిగా వైసీపీ-టీడీపీ కార్యకర్తలు కర్రలు, రాళ్లతో పరస్పరం దాడి చేసుకున్నారు. ఫలితంగా అక్కడంతా తీవ్ర ఉద్రిక్త వాతారణం నెలకొంది. టీడీపీ, వైసీపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీ ఛార్జి చేశారు. ఇందులో పలువురికి గాయలయ్యాయి.

కురబలకోటలో చంద్రబాబు మీటింగ్‌కు వెళ్తున్న టీడీపీ నేతలపై వైసీపీ కార్యకర్తలు రాళ్ల దాడి చేశారు. పోలీసులు పక్కనే ఉన్నా రాళ్ల దాడిని నిలువరించలేకపోయారు. అటు బస్టాండ్ వద్ద టీడీపీ నేతపై వైసీపీ గూండాలు దాడులకు తెగబడ్డాయి. చంద్రబాబు పర్యటనకు వెళుతున్న టీడీపీ కార్యకర్త వద్ద నుంచి జెండాలు లాక్కున్నారు. విచక్షణారహితంగా దాడి చేశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు వైసీపీ గూండాల నుంచి టీడీపీ కార్యకర్తను కాపాడారు.

ఈ ఉద్రిక్త పరిస్థితులతో అంగళ్లు రణరంగంగా మారిపోయింది. యుద్ధవాతావరణం నెలకొంది. చంద్రబాబు పర్యటనను అడ్డుకునేందుకు వైసీపీ శ్రేణులు రోడ్డుపైకి వచ్చి నిరసన, రాస్తారోకో చేపట్టారు. 
చంద్రబాబు అంగళ్లుకు వచ్చే సమయానికి వైసీపీ కార్యకర్తలు మరింత రెచ్చిపోయి టీడీపీ కార్యకర్తలపై రాళ్ల దాడికి దిగారు. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. వైసీపీ కార్యకర్తలు టీడీపీ బ్యానర్లను తొలగించారు. అడ్డుకున్న టీడీపీ కార్యకర్తలపై దాడులు చేశారు.

ఈ ఘటనలో ఓ పోలీస్ వాహనం ధ్వంసమైంది. అంతేకాకుండా… చాలా ప్రైవేటు వాహనాల అద్దాలు ధ్వంసమయ్యాయి. రాళ్ల దాడి జరగటంతో చంద్రబాబు ఎన్ఎస్ జీ కమాండోలు అప్రమత్తమయ్యారు. బుల్లెట్ ఫ్రూప్ ని ఓపెన్ చేశారు. ఈ ఘటనలకు సంబంధించిన పలు వీడియోలను తెలుగుదేశం పార్టీ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు కార్యకర్తలపై రబ్బర్ బుల్లెట్లు, బాష్పవాయువులను ప్రయోగించారు.

టీడీపీ కార్యకర్తలకు గాయాలవడంతో టీడీపీ కార్యకర్తలు ఎదురుదాడికి దిగారు. అన్ని ప్రయత్నాలు అయిపోవడంతో పోలీసులు పారిపోయారు. పుంగనూరు బైపాస్ రోడ్డులో ఉద్రిక్త వాతావరణంతో వాహనాలు ఆగిపోయాయి.  పుంగనూరులో పోలీసుల వజ్రా వాహనం ధ్వంసమవ్వగా, మరొక పోలీసు వాహనానికి వైసీపీ కార్యకర్తలు నిప్పు పెట్టారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డిపై టీడీపీ అధినేత ఆగ్రహం వ్యక్తం చేశారు. “పెద్దిరెడ్డీ! నువ్వూ నీ అనుచరులు కర్రతో వస్తే నేను కర్రతో వస్తా.. నువ్వు యుద్ధం ప్రకటిస్తే నేను యుద్ధం ప్రకటిస్తా.. నీ పతనం ప్రారంభమైంది” అంటూ హెచ్చరించారు. దమ్ముంటే రా తేల్చుకుందామని సవాల్ విసిరారు.

ఇలా ఉండగా, గత కొన్ని రోజులుగా  ఏపీలో జరుగుతున్న పరిణామాల దృష్ట్యా కేంద్రం సీరియస్ అయ్యింది. చంద్రబాబు, లోకేశ్‌ల సెక్యూరిటీపై కేంద్ర హోం శాఖ దృష్టి సారించింది. బాబు, లోకేశ్‌లకు కల్పించిన భద్రతపై కేంద్ర హోం శాఖ నివేదిక కోరింది. ఈ మేరకు ఏపీ సీఎస్, డీజీపీలకు హోంశాఖ లేఖ రాసింది.  మరీ ముఖ్యంగా జడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఉన్న చంద్రబాబు కాన్వాయ్‌పై ఇటీవల జరిగిన దాడులపై కేంద్రం సీరియస్ అయ్యింది.

దీంతోపాటు లోకేశ్ యువగళం పాదయాత్రకు కల్పించిన భద్రత వివరాలను కూడా కేంద్ర హోంశాఖ కోరింది. అదేవిధంగా గత ఏడాది నవంబర్ 4న నందిగామలో చంద్రబాబు ర్యాలీలో జరిగిన రాళ్ల దాడిపై కూడా హోంశాఖ నివేదిక ఇవ్వాలని కోరింది. ఏమాత్రం జాప్యం చేయకుండా చంద్రబాబు, లోకేశ్‌లకు పూర్తిస్థాయి భద్రత కల్పించాలని డీజీపీ, సీఎస్‌లను హోంశాఖ ఆదేశాలు జారీచేసింది. ఈ మొత్తం అన్ని విషయాలపై జూలై- 27న ఏపీ ప్రభుత్వానికి కేంద్రం లేఖ రాసింది. అయితే, ఇంతవరకూ కేంద్రానికి ఎలాంటి స్పందన రాకపోవడం గమనార్హం.

గత కొన్నినెలలుగా చంద్రబాబు, లోకేశ్‌ల పర్యటనల్లో దాడులు జరుగుతున్నాయని, ఇద్దరికీ సరైన భద్రత కల్పించడంలో జగన్ ప్రభుత్వం వైఫల్యం చెందిందంటూ కేంద్రానికి టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ కేంద్ర హోంశాఖ లేఖ వ్రాసారు ఈ లేఖపై కేంద్ర హోంశాఖ స్పందించింది. ప్రతిపక్ష నేతలపై జరుగుతున్న దాడులపైనా కేంద్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనలపై డీజీపీ, సీఎస్‌లను కేంద్ర హోం శాఖ వివరణలు కోరినా ఇంతవరకూ ఏపీ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles