చంద్రబాబుపై నిందలా? సజ్జలలో ఇంత వక్రబుద్ధి ఎలా?

Sunday, November 17, 2024

ప్రజలు నవ్వుతారనే భయం సజ్జలకు లేదా?

సిబిఐ అధికారులు- వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డిని రెండోసారి పిలిపించి ఏకంగా నాలుగున్నర గంటల పాటు విచారించిన తరువాత..  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద తలకాయలకు వెన్నులో వణుకు పుట్టినట్టుగా కనిపిస్తోంది!  అవినాష్ రెడ్డి అమాయకుడు అని చాటి చెప్పడానికి మొదటిసారిగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు,  సకల శాఖ మంత్రిగా ప్రతిపక్షం పిలుచుకునే సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా ముందుకు వచ్చారు.  అవినాష్ రెడ్డి అమాయకత్వాన్ని ఆయన విపులంగా వివరించి చెప్పారు.  ఈ సందర్భంగా హత్యోదంతాన్ని, విచారణపర్వాన్ని కూడా చంద్రబాబునాయుడుకే ముడిపెట్టడానికి సజ్జల పడిన పాట్లు చూస్తే ఎవరికైనా నవ్వు వస్తుంది. తాను నవ్వులపాలు అయిపోతాననే భయం కూడా లేకుండా.. ఎంతో సీనియర్ జర్నలిస్టు కూడా అయిన ఈ నాయకుడు సజ్జల.. మోకాలికీ బోడిగుండుకీ ముడిపెట్టే ప్రయత్నాలు చేయడమే తమాషా. 

వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ అధికారులు ఇప్పటికే తెలంగాణ హైకోర్టులో కౌంటర్ కూడా దాఖలు చేశారు. నూటికి నూరుశాతం.. వారి అనుమానాలన్నీ కడప ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి మీదనే సాగుతున్నాయి. వారి పాత్రను నిర్దరించే విధంగానే ఉన్నాయి. దేశంలోనే అత్యున్నత దర్యాప్తు సంస్థ సీబీఐ సేకరించి, అధికారికంగా ప్రకటిస్తున్న వివరాలు ఇలా ఉండగా.. సజ్జల చెబుతున్న చందమామ కథ తమాషాగా సాగుతోంది. 

వైఎస్ వివేకానందరెడ్డిని హత్య చేయడానికి చంద్రబాబునాయుడే పథక రచన చేశారట. అసలు బిటెక్ రవి, ఆదినారాయణ రెడ్డిల పాత్ర ఈ హత్య వెనుక ఉన్నదని ఆధారాలు లభించాయట. అప్పట్లో తాను స్వయంగా స్కెచ్ వేసి వివేకాను హత్య చేయించిన చంద్రబాబునాయుడు, ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో ఉన్న తన అనుచరుల ద్వారా సీబీఐ అధికార్లను ఇన్‌ఫ్లుయెన్స్ చేసి.. అవినాష్ రెడ్డి మీదకు అనుమానాలు మళ్లేలా, ఆయనను ఇరికించేలా కొత్త పథకానికి తెర తీశారట. ఇంత సుదీర్ఘమైన చందమామ కథను సజ్జల మీడియాకు వినిపిస్తున్నారు. 

అయినా, చంద్రబాబునాయుడు బిజెపిలోని తన అనుచరుల ద్వారా సీబీఐను ప్రభావితం చేయగలిగేంత సీన్ ఉంటే.. అవినాష్ రెడ్డి లాంటి అర్భకుడి జోలికి వెళ్లడం ఎందుకు? ఏకంగా జగన్ మీద ఉన్న కేసులన్నీ ఒక కొలిక్కి వచ్చేలా చేస్తే చాలు కదా.. జగన్ జీవితం జైలుకే పరిమితం అయిపోతుంది కదా.. అనేది తెలుగుదేశం వారి వాదన. 

అవినాష్ రెడ్డిని రెండోసారి కూడా విచారించిన నేపథ్యంలో, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిని కూడా విచారించబోతున్న సమయంలో.. అసలు వాస్తవాలు వెలుగులోకి వస్తే తమ కూసాలు కదులుతాయనే భయం జగన్ అండ్ కో లో మొదలైందని విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే సజ్జల రామకృష్ణా రెడ్డి మీడియా ముందుకు వచ్చి.. చంద్రబాబును బూచిగా చూపిస్తూ తలాతోకాలేని అడ్డగోలు మాటలు మాట్లాడుతున్నారని ప్రజలు భావిస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles