స్పీకరు తమ్మినేని ఏం మాట్లాడుతున్నారో.. తన మాటలకు అర్థం ఏమిటో బహుశా ఆయనకైనా తెలుస్తోందో లేదో బోధపడడం లేదు. ఎందుకంటే.. చంద్రబాబు నాయుడును అంతం చేయడానికి తన వంతు కృషి చేస్తానని అర్థం వచ్చేలాగా ఆయన మాట్లాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకరుగా తనకున్న విశేషాధికారాలను అందుకోసం ఉపయోగించగలనని కూడా ఆయన సెలవిస్తున్నారు. వాస్తవంలో ఇలాంటి కోరిక ఆయనకు ఉండకపోవచ్చు గానీ.. ఆయన మాటల అర్థం మాత్రం అలాగే ఉంది. ఇంతకూ ఏం జరిగిందంటే..
శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస పట్టణంలో తమ పార్టీ శ్రేణులతో కలిసి టూవీలర్ ర్యాలీ నిర్వహించిన తమ్మినేని సీతారాం ఈ సందర్భంగా చంద్రబాబునాయుడు మీద నిప్పులు చెరిగారు. సాధారణంగా ఆయన ప్రత్యర్థి పార్టీకి చెందిన వాడు గనుక.. చంద్రబాబునాయుడు వైఫల్యాల గురించి, లేదా, ఆయన ఇటీవల మహానాడు వేదికగా చేసిన ప్రజాకర్షక హామీల గురించి మాట్లాడితే సబబుగా ఉండేది. కానీ ఇదేమీ కాకుండా చంద్రబాబుకు ఉన్న భద్రత గురించి తమ్మినేని మాట్లాడడమే తమాషా. ఆయనకున్న జడ్ ప్లస్ భద్రత గురించి అక్కసు వెళ్లగక్కడమే తమాషా.
చంద్రబాబునాయుడు స్థాయికి ఆయనకు ప్రత్యర్థుల నుంచి పొంచి ఉన్న ముప్పు, గతంలోనూ ఒకసారి నక్సల్ దాడినుంచి ప్రాణాపాయం తప్పించుకుని బయటపడిన వైనం గమనంలో ఉంచుకుని కేంద్రం ఆయనకు జడ్ ప్లస్ భద్రత కల్పించింది. వారికేమీ రాష్ట్రప్రభుత్వం ఖర్చు పెట్టడం లేదు. కానీ తమ్మినేని ఎందుకో ఆ జడ్ ప్లస్ భద్రత గురించి విమర్శిస్తున్నారు. చంద్రబాబు జడ్ ప్లస్ కేటగిరీ భద్రతకు ఏ విధంగా అర్హులు? ముప్పు చాలా మందికి ఉంది.. వారందరికీ ఈ భద్రత ఇస్తారా? అని ప్రశ్నిస్తున్నారు.
చంద్రబాబు భద్రత వలయంలో బ్లాక్ క్యాట్ కమెండోలను తీసివేస్తే ఆయన ఫినిష్ అయిపోతారని తమ్మినేని అనడం గమనార్హం. బ్లాక్ క్యాట్ కమెండోలే లేకపోతే చంద్రబాబు ఎలా ఫినిష్ అవుతారో, ఎవరు ఆయనను ఫినిష్ చేస్తారని తమ్మినేనికి సమాచారం ఉన్నదో దేవుడికే తెలియాలి. వారు లేకపోతే బాబు ఫినిష్ అయిపోతారని అంటూనే.. స్పీకరుగా తనకున్న అధికారాన్ని ఉపయోగించి.. జడ్ ప్లస్ భద్రత తొలగించాల్సిందిగా కేంద్రానికి లేఖ రాస్తానని కూడా తమ్మినేని అంటున్నారు. అంటే పరోక్షంగా చంద్రబాబును ఫినిష్ చేయడానికి అనువైన వాతావరణం తాను కల్పించాలని అనుకుంటున్నట్టు సెలవిచ్చారు. ఇదంతా ఏదో చంద్రబాబునాయుడును అంతం చేయడానికి తమ్మినేని ప్రత్యేకంగా కుట్ర చేస్తున్నట్టుగా అనిపిస్తే అది వారి తప్పు కాదు.. తమ్మినేని వారి మాటలే అలా ఉన్నాయి.
చంద్రబాబును ఫినిష్ చేయడమే తమ్మినేని లక్ష్యమా?
Tuesday, November 5, 2024