ఇలాంటి నాయకులకు ప్రజల దృష్టిలో క్రెడిబిలిటీ ఉంటుందా? తమ స్వార్ధ ప్రయోజనాల కోసం ఊసరవెల్లిలా రంగులు మార్చడం మాత్రమే కాదు, పార్టీలు మారుస్తూ అలాంటి కుటిల ప్రయత్నాలకు.. ‘ప్రజల ప్రయోజనాలు- ప్రాంత అభివృద్ధి కోసం’ అని ముసుగు తొడిగి ముందుకు సాగే రాజకీయ నాయకులకు సుదీర్ఘమైన, సుస్థిరమైన భవిష్యత్తు లభిస్తుందా అనే సందేహాలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. భవిష్యత్తులో మళ్లీ పార్టీ మారవలసి వచ్చినా సరే వాతావరణం అనుకూలంగా ఉండేలాగా ఉభయ నాయకులను కీర్తిస్తూ.. ఫిరాయించే వారికి ఎలాంటి ఆదరణ లభిస్తుంది? కైకలూరు మాజీ ఎమ్మెల్యే జయ మంగళ వెంకటరమణ త్వరలోనే ఇలాంటి సందేహాలను నివృత్తి చేయబోతున్నారు.
కైకలూరు నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ ఇన్చార్జిగా ఇప్పటిదాకా బాధ్యతలు నిర్వర్తిస్తున్న మాజీ ఎమ్మెల్యే జయ మంగళ వెంకటరమణ తాజాగా తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. త్వరలోనే ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతానని ఆయన ప్రకటించారు. సిటింగ్ ఎమ్మెల్యే కాదు కాబట్టి ఇందులో వెన్నుపోటు రాజకీయం లాంటి పదాలు వాడడానికి వీల్లేదు. తన రాజకీయ భవిష్యత్తు ఎక్కడ బాగుంటుందని అనిపిస్తే ఆయన ఆ పార్టీలో చేరవచ్చు. తెలుగుదేశం పార్టీలో స్థానిక నాయకులతో విభేదాలు వస్తున్నాయని.. కైకలూరు అభ్యర్థిగా తన పేరును చంద్రబాబు నాయుడు ఇంకా ఖరారు చేయలేదని, అందుకే పార్టీ మారుతున్నట్లుగా జయ మంగళ వెంకటరమణ ప్రకటించారు.
పార్టీ ఫిరాయించడానికి ఈ కారణం చెప్పడం ఒక బుకాయింపులాగా కనిపిస్తుంది. ఎందుకంటే, చంద్రబాబు నాయుడు ఇప్పటిదాకా రాష్ట్రంలో పట్టుమని పది స్థానాలకు కూడా అభ్యర్థులు ఎవరిని ఖరారు చేసి చెప్పనేలేదు. అలాంటి నేపథ్యంలో ఇంకా తన పేరు ప్రకటించలేదు గనుక పార్టీని వీడిపోతాననడం ఇప్పటిదాకా ఇన్చార్జి హోదాను అనుభవించిన జయమంగళ వెంకటరమణకు సబబు కాదని నియోజకవర్గ ప్రజలు భావిస్తున్నారు.
అదే సమయంలో పార్టీకి రాజీనామా చేస్తున్న సందర్భంగా.. జయ మంగళ వెంకటరమణ, చంద్రబాబునాయుడును ఆకాశానికి ఎత్తేస్తున్నట్లుగా కీర్తించడం గమనార్హం. చంద్రబాబు నాయుడు తనను సొంత బిడ్డ లాగా చూసుకున్నారని తనకు ఎవరితోనూ విభేదాలు లేవు అని ఆయన ఈ సందర్భంగా అన్నారు. చంద్రబాబు ఆయనకు అంతగా విలువ ఇచ్చినప్పుడు.. కష్టకాలంలో పార్టీని వదిలి వెళ్ళితే అలాంటి నాయకుడిని ప్రజలు ఆదరిస్తారా? అనేది సందేహం! ఒకవేళ తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడితే.. తన రాజకీయ భవిష్యత్తు నాశనం కాకుండా ఉండడానికే ఇలాంటి మాయ మాటలు చెప్పారా అనేది కూడా ప్రజల మదిలో మెదలుతోంది.
సిట్టింగ్ ఎమ్మెల్యేలు అనేకమంది అధికార పార్టీ నుంచి తెలుగుదేశం లోకి జంప్ చేస్తున్న కీలక తరుణంలో, తమ పార్టీ పరువు కాపాడుకోవడానికి, టిడిపి నుంచి తమ వైపు వచ్చే వారు కూడా ఉన్నారు అని చెప్పుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేసిన ఉచ్చులో వెంకటరమణ చిక్కుకున్నారా అని కూడా ఆయన అభిమానులు అనుమానిస్తున్నారు.
చంద్రబాబును కీర్తిస్తూనే.. జగన్ తీర్థం కోసం ఆరాటం!
Monday, December 23, 2024