చంద్రబాబుతో చేరిన కన్నాకు రాయపాటి నుండి ముప్పు!

Saturday, January 18, 2025

వారం రోజుల క్రితం బీజేపీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరడం రాజకీయాలలో `శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు’ ఉండరనే నానుడిని గుర్తుకు తెస్తుంది. ఎందుకంటె, 2014 ఎన్నికలలో మొదటిసారి డిపాజిట్ కూడా కోల్పోయి ఎన్నికలలో ఓటమి చెందిన తర్వాత, నాటి ప్రధాన ప్రతిపక్షం వైసిపిలోకి కాకుండా బీజేపీలో చేరడం అందరికి విస్మయం కలిగించింది.

కేవలం చంద్రబాబు ప్రభుత్వం నుండి `రక్షణ’ కోసమే, ఆ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న బీజేపీలో ఆయన చేరారు. అయితే, ఇప్పుడు రాజకీయ మనుగడకోసమే అదే చంద్రబాబు సమక్షంలో టిడిపిలో చేరారు. కానీ, మొదటినుండి కన్నాను జిల్లాలో వ్యతిరేకిస్తున్న మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు మాత్రం స్వయంగా చంద్రబాబు ఫోన్ చేసినా, కన్నాను చేర్చుకోవడం పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు.

చంద్రబాబును రాజకీయంగా గెల్చుకున్న కన్నా, ఇప్పుడు రాయపాటికి ప్రసన్నం చేసుకొనే ప్రయత్నం చేస్తారా? ఎందుకనే నిజంగా రాయపాటి ప్రయత్నిస్తే ఎన్నికలలో కన్నాను ఓడించడం అంత కష్టం కాకపోవచ్చు. ఈ విషయంలో రాయపాటికి శాంత పరచేందుకు చంద్రబాబు, కన్నా ఏవిధంగా అడుగులు వేస్తారో చూడాలి.

2014లో కన్నాను బీజేపీలో చేరమని  సలహా ఇచ్చింది కూడా ఆనాడు గుంటూరు జిల్లా నుండి మంత్రిగా ఉన్న ప్రత్తిపాటి పుల్లారావు. వారిద్దరూ  భిన్నమైన రాజకీయ పార్టీలలో ఉన్నప్పటికీ వ్యాపార సంబంధ సంబంధాలు వారి మధ్య ఉన్నాయి.

మొదటి నుండి టీడీపీని తీవ్రంగా విమర్శించడంలో కన్నా పేరొందారు. పైగా, మొదట్లో ఎన్టీ రామారావు, ఆ తర్వాత చంద్రబాబునాయుడుపై వ్యక్తిగత విమర్శలు కూడా చేసేవారు. కాంగ్రెస్ పార్టీలో రాయపాటి సాంబశివరావు వంటి వారు అవినీతి ఆరోపణలు చేసినా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎవరంటే వారికి సన్నిహితంగా ఉంటూ రాజకీయంగా కాంగ్రెస్ లో తిరుగులేని వారుగా ఉంటూ వచ్చారు.

అందుకనే 2014లో టీడీపీ ప్రభుత్వం ఏర్పడగానే కన్నాను రాజకీయంగా అణచివేసేందుకు చంద్రబాబు ప్రయత్నించే అవకాశం ఉందని పుల్లారావు హెచ్చరించారు. దానితో పుల్లారావు సలహా మీద బీజేపీలో చేరారు. ఆ తర్వాత బిజెపి- టిడిపి సంబంధాలు దెబ్బతిన్నా కన్నా మాత్రం ఆ పార్టీతో శత్రుత్వం తగ్గించుకొంటూ వచ్చారు. ఇంతలో ఏర్పడిన వైసిపి ప్రభుత్వంపై బీజేపీ నేతగా తీవ్ర విమర్శలు చేస్తూ వచ్చారు.

వైసిపి పైన చేసిన విమర్శలే ఇప్పుడు కన్నాను చంద్రబాబుకు దగ్గరిగా చేశాయి. అయితే ఐదుసార్లు ఎంపీగా చేసినా గుంటూరు జిల్లాలో ప్రజలలో మచ్చలేని వ్యక్తి రాయపాటి సాంబశివరావు. మరోవంక, కరడుగట్టిన టీడీపీ శ్రేణులు కన్నాను ఆదరించడం ఒకవిధంగా కష్టం కావచ్చు. గతంలో గెలుపొందిన పెదకూరపాడు, గుంటూరు పశ్చిమం నియోజకవర్గాలు కాకుండా సత్తెనపల్లి సీట్ కన్నా కోరుకుంటున్నాడంటే ఎమ్యెల్యేగా అక్కడ మితృలకన్నా ఎక్కువగా శత్రువులను కన్నా పెంచుకున్నారు.

కన్నాను పార్టీలో చేర్చుకోవటం తెలివి తక్కవ పనిగా రాయపాటి  స్పష్టం చేశారు. తనను..చంద్రబాబును ఎన్నో మాటలు కన్నా అన్నారని గుర్తు చేసారు. అలాంటి వ్యక్తిని దగ్గరకు తీసుకోవటం ఏంటని ప్రశ్నించారు. కన్నా ఇప్పుడు పార్టీకి అవసరమని చెబుతున్నారని..ఆయనకు ఎన్ని ఓట్లు వస్తాయి? అని నిలదీశారు

గతంలో కాంగ్రెస్ నుండి తనకు గుంటూరు లోక్ సభ స్థానానికి,  కన్నా పెదకూరపాడు అసెంబ్లీకి పోటీ చేసిన సమయంలో తనకే నాలుగైదు వేల ఓట్లు ఎక్కువగా వచ్చేవని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే పార్టీలో ఎవరు నిలబడతారని రాయపాటి ప్రశ్నించారు. రాయపాటికి ప్రసన్నం చేసుకొనే ప్రయత్నం చేసుకోకపోతే `వ్రతం చెడినా ఫలితం దక్కని’ విధంగా కన్నా పరిస్థితి మారే అవకాశం లేకపోలేదు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles