క్రమంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పట్ల ప్రజలలో వ్యతిరేకత పెరుగుతూ ఉండడం, తాజాగా టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఎక్కడకు వెళ్లినా అంచనాలకు మించి ప్రజల మద్దతు వెల్లడి అవుతూ ఉండడంతో వైసిపి మంత్రులలో అసహనం వ్యక్తం అవుతుంది. దానితో ఏమి మాట్లాడుతున్నారో తెలియక ప్రమాదకరమైన వాదనలను తెరపైకి తీసుకు వస్తున్నారు.
విశాఖపట్నాన్ని రాజధానిగా చేయాల్సిందేనని, లేని పక్షంలో కొత్త రాష్ట్రంగానైనా ఉత్తరాంధ్రను ప్రకటించాలని అంటూ మంత్రి ధర్మాన ప్రసాదరావు తాజాగా చేసిన ప్రకటన మంత్రులలో పెరుగుతున్న అసహనాన్ని, అభద్రతా భావాన్ని వెల్లడి చేస్తుంది.
ఉమ్మడి రాష్ట్రంలో ఆదాయం మొత్తం ఖర్చుపెట్టి హైదరాబాద్‌ను అభివృద్ధి చేశాక.. విభజనతో విడిచిపెట్టి వచ్చాం అంటూ ఆ పొరపాటు పునరావృతమైతే మరో 70 ఏళ్లు ఈ ప్రాంతం వెనుకబాటుతోనే ఉండాల్సి వస్తుందని పేర్కొంటూ విశాఖపట్నంను రాజధాని చేయకపోతే ఏదో ప్రమాదం జరుగుతున్నట్లు చెబుతున్నారు.
అయితే ఇప్పటికే విశాఖపట్నం దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాలలో ఒకటని, రక్షణ పరంగా, పారిశ్రామికంగా, ఆర్థికంగా ఎంతో కీలకమైన నగరం అని మరచిపోతున్నారు.
వాస్తవానికి విశాఖపట్నంను రాజధానిగా చేస్తే హైదరాబాద్ విషయంలో చేసిన ఘోరమైన తప్పును మరోసారి చేసినట్లు కాగలదని అంశాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే అభివృద్ధి చేసిన నగరాన్ని అభివృద్ధి చేస్తూ, రాష్ట్రంలో మిగిలిన నగరాలను గాలికి వదిలివేయాలి అనుకొంటున్నారా?
అమరావతి రియల్‌ఎస్టేట్ వ్యాపారుల నగరమని అంటున్న ధర్మాన తమ పార్టీ ఎన్నికల మానిఫెస్టోలో అమరావతిని రాజధాని నగరంగా ఎందుకు హామీ ఇచ్చిందో చెప్పగలరా? అమరావతిని రాజధానిగా ప్రకటిస్తూ రాష్ట్ర శాసనసభ చేసిన ఏకగ్రీవ తీర్మానానికి తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో పాటు పార్టీ ఎమ్యెల్యేలు అందరూ ఎందుకు మద్దతు ఇచ్చారో చెప్పగలరా?
అమరావతిని రాజధానిగా వ్యతిరేకించడం వెనుక వ్యక్తిగత స్వార్ధాలు, రాజకీయ అవకాశవాదం తప్పా మరో కారణం కనిపించదు. జనాల్లో ఇంకా ఎక్కడో సైకిల్ భావన ఉంది.. ఇంకా సైకిల్‌ని నమ్మి మోసపోకండి అంటూ ప్రజలలో టిడిపిని కాదని తప్పుచేశామని బలంగా పెరుగుతున్న అభిప్రాయం పట్ల ఆయనలో భయం పట్టుకున్నట్లు స్పష్టం అవుతుంది.
“కొంతమంది ఎవరికి ఓటేస్తావని అడిగితే జగన్‌మోహన్ రెడ్డికి అంటున్నారని.. గుర్తు ఏంటని అడిగితే సైకిల్ అంటున్నారట” అని స్వయంగా ధర్మాన చెప్పడం గమనార్హం. అంటే వచ్చే ఎన్నికలలో `సైకిల్’ గుర్తుకు ఓట్ వేయాలని జనం ఇప్పుడే నిర్ణయానికి వస్తున్నట్లు మంత్రిగారి మాటలలోనే ఆందోళన, భయం స్పష్టం అవుతుంది. అందుకే జనాన్ని ఏదోవిధంగా రెచ్చగొట్టాలని ప్రాంతీయ వాదాన్ని తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
`గడపగడపకూ’ పెడుతూ వైసిపి మంత్రులు, ఎమ్యెల్యేలు ఎక్కడకు వెడుతున్నా జనం అభివృద్ధి ఆగిపోయింది అని నిలదీస్తుండటం, ఎన్నికల సమయంలో చెప్పిన మాటలు మరచిపోయారా అంటూ ప్రశ్నిస్తూ ఉండడంతో అధికార పార్టీ నేతలు జనం మధ్యకు వెళ్ళడానికి భయపడుతున్నారు. అయితే, `బాదుడే బాదుడు’, `ఇదేం ఖర్మ’ పేర్లతో టిడిపి నాయకులు వెడుతుంటే ప్రజల నుండి అనూహ్యమైన స్పందన వస్తుంది. దాంతో మంత్రులు, వైసిపి నాయకులు తమ రాజకీయ భవిష్యత్తు ఏమిటని ఖంగారు పడుతున్నారు.