విజయవాడ నుండి ఎంపీగా వరుసగా రెండు పర్యాయాలు గెలుపొందిన కేశినేని నాని వ్యవహారం టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుకు తలనొప్పిగా తయారైనది. తమ్ముడితో ఏర్పడిన ఆస్తి గొడవలు రాజకీయ వివాదంగా మారడం, వచ్చే ఎన్నికలలో అక్కడ ఎంపీగా పోటీచేయడానికి ఇద్దరూ పోటీపడుతూ ఉండడంతో ఎవ్వరికీ ఏమో చెప్పాలో తెలియక మాజీ ముఖ్యమంత్రి తికమకపడుతున్నారు.
తమ్ముడితోనే కాకుండా, విజయవాడ లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలోని ముఖ్యమైన టిడిపి నాయకులతో ఆయనకు మంచిసంబంధాలు లేవు. పైగా ప్రతి ఒక్కరితో ఏదోఒకరైకమైన వివాదాలకు కాలుదువ్వుతున్నారు. పైగా, నాని వ్యవహారశైలి పట్ల ఆగ్రవేశాలహాతో ఉన్న టిడిపి నాయకులంతా ఎంపీ అభ్యర్థిగా తమ్ముడిని ముందుకు తీసుకు రావడంతో తట్టుకోలేక పోతున్నారు.
నిత్యం పార్టీలోని తన ప్రత్యర్దులపైననే కాకుండా ఏకంగా పార్టీ అధినేతపై కూడా దిక్కారధోరణితో ప్రకటనలు ఇస్తూ, పార్టీ శ్రేణులకు చికాకు కలిగిస్తున్నారు. అధికారపక్షం వైసీపీ నేతలకు ఈ వివాదాలు వినోదం కలిగిస్తున్నాయి. టిడిపిలో చెలరేగిన చిచ్చు వచ్చే ఎన్నికలలో తమ అభ్యర్థి గెలుపొందేందుకు సహకరిస్తుందని ఉబలాటపడుతున్నారు.
కేశనేని ట్రావెల్స్ నిర్వహణతో వ్యాపారవేత్తగా పేరొందిన నాని 2009లో ప్రజారాజ్యం పార్టీ ద్వారా క్రియాశీలరాజకీయాల్లోకి ప్రవేశించారు. పిఆర్పీ తరపున విజయవాడ పార్లమెంటు నియోజక వర్గంలో పోటీ చేయాలని భావించినా చివరి నిమిషంలో టిక్కెట్ దక్కకపోవడంతో చిరంజీవి, అల్లు అరవింద్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆ తర్వాత టీడీపీలోకి వచ్చారు.
2014లో టిడిపి అభ్యర్థిగా గెలుపొంది, 2019 ఎన్నికల్లో వైసీపీ హవాను సైతం తట్టుకుని నిలబడ్డారు. ఆ తర్వాతనే ఆస్తుల పంపకంలో ఏర్పడిన వివాదంతో తమ్ముడు చిన్ని క్రియాశీలరాజకీయాలలోకి వచ్చి మరో కుంపటి పెట్టడంతో టిడిపిలో నాని ప్రత్యర్ధులు అందరికి కేంద్రంగా మారారు.
టీడీపీలో కేశనేని నాని మొదటి నుంచి వ్యతిరేకించే మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుతో పాటు బోండా ఉమా, బుద్ధా వెంకన్న, నాగుల్ మీరా వంటి నాయకులు అందరు చిన్ని వైపు మొగ్గు చూపడం ప్రారంభించారు. టీడీపీ అధిష్టానం కూడా నానికి వ్యతిరేకంగా ఉందనే వార్తలు రావడం ఆయన ఆగ్రవేశాలకు గురవుతున్నారు.
వచ్చే ఎన్నికలలో తనకు పార్టీ సీట్ ఇచ్చినా, ఇవ్వకపోయినా ఫర్వాలేదని అంటూనే తనకు నచ్చని వారికి ఇస్తే మాత్రం ఓడిస్తానని పరోక్షంగా తమ్ముడుకు సీట్ ఇస్తే జాగ్రత్త అనే హెచ్చరికలు చేస్తున్నారు. పైగా, తాను ఇండిపెండెంట్ గా పోటీచేసి కూడా గెలవగలననే ధీమాను వ్యక్తం చేస్తున్నారు.
అయితే, తమ్ముడు మాత్రం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. పార్టీ తన అన్నతో సహా ఎవ్వరికీ సీట్ ఇచ్చినా పనిచేస్తాను ఆంటోనీ అన్నకు వ్యతిరేకంగా కుంపటి పెడుతున్నారు. నానితో పెట్టుకొంటే ఎదురయ్యే విమర్శలకు భయపడే చంద్రబాబు సహితం మౌనం వహిస్తున్నారా అనే అనుమానం పార్టీ వర్గాలకు కలుగుతుంది.
ఈ తలనొప్పి తప్పించుకునేందుకు వచ్చే ఎన్నికలలో విజయవాడ సీట్ ను జనసేనకు ఇచ్చే అవకాశాలు సహితం కనిపిస్తున్నాయి.