చంద్రబాబుకు గుదిబండగా మారుతున్న వారసులు!

Sunday, December 22, 2024

వచ్చే ఎన్నికల్లో 40 శాతం సీట్లు యువతకే కేటాయిస్తున్నట్లు ప్రకటించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రస్తుతం పలు నియోజకవర్గాల్లో యువ నాయకుల నుండే చిక్కులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా పార్టీలో చిరకాలంగా సేవలు అందిస్తున్న పలువురు సీనియర్లకు వచ్చే ఎన్నికల్లో వారికి సీట్లు ఇవ్వడం కుదరదని చెప్పేసారు. వారి వారసుల పేర్లు ఇస్తే పరిశీలిస్తామని హామీ ఇచ్చారు.

ఇక్కడే టిడిపిలో సమస్యలు ఎదురవుతున్నాయి. చాలా నియోజకవర్గాలలో వారసులు పార్టీకి గుదిబండగా తయారయ్యారని, అందరిని కలుపుకు పోకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తూ ఉండడంతో వారి వ్యవహారం స్థానిక పార్టీ నాయకులకు తలనొప్పినా తయారైనదని చెబుతున్నారు.

ముఖ్యంగా గత ఐదేళ్లలో మృతి చెందిన ముగ్గురు ప్రముఖ నాయకుల వారసులు ఇప్పుడు పార్టీకి గుదిబండగా మారినట్లు చెబుతున్నారు. వారికి సీట్ ఇస్తే పార్టీ గెలుపొందడం కష్టమని, తమకు కాకుండా మరొకరికి సీటు ఇస్తే వారెట్లాగు గెలుస్తారో చూస్తాం అన్నట్లు బెదిరింపు ధోరణిలో వారసులు వ్యవహరిస్తున్నారని పార్టీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

మొన్ననే, సత్తెనపల్లి నియోజకవర్గ ఇన్ ఛార్జ్ గా మూడు నెలలక్రితం పార్టీలో చేరిన మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణను ప్రకటించగానే గత రెండు ఎన్నికల్లో అక్కడి నుండి పోటీ చేసిన మాజీ స్పీకర్ డా. కోడెల శివప్రసాదరావు కుమారుడు డా. కోడెల శివరాం ధిక్కార ధోరణిలో వ్యవహరిస్తుండటాన్ని చూస్తున్నాము. తన మద్దతుదారులను కూడదీసుకుని, ఎట్లాగైనా తనను కాదని మరొకరికి సీట్ ఇస్తే ఓడించాలనే కసితో వ్యవహరిస్తున్నట్లు స్పష్టం అవుతుంది.

అంతకు ముందే నంద్యాలలో పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ `యువగళం’ పాదయాత్ర సందర్భంగా పార్టీలో చెలరేగిన ఘర్షణలు, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, ఆమె భర్త అరెస్ట్ కావడం పార్టీలో కలకలం రేపింది. పరస్పరం పోలీసు కేసులు దాఖలు చేసుకోవడం వరకు వెళ్ళింది. పార్టీ శ్రేణులలోనే ఆమె తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు.

ఇక తాజాగా, శ్రీకాళహస్తి నియోజకవర్గంలో మాజీ మంత్రి దిగవంత బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కుమారుడు బొజ్జల సుధీర్ రెడ్డి పార్టీకి సమస్యగా తయారయ్యారు.  మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత వైసీపీ నాయకుడు ఎస్సీవీ నాయుడు టీడీపీలో చేరాలని నిర్ణయించారు. ఇప్పటికే చంద్రబాబు స‌మ‌క్షంలో గురువారం పార్టీలో చేరేలా ముహూర్తం ఖరారు చేసుకున్నారు. శ్రీశైలం నుంచి భారీగా త‌న అనుచ‌రుల‌తో అమ‌రావ‌తికి కూడా బ‌య‌లుదేరారు.

అయితే, ఇంతలో నాయుడు చేరికను శ్రీకాళహస్తి టిడిపి ఇన్చార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి వ్యతిరేకించడంతో కథ అడ్డం తిరిగింది. ఈ చేరిక విష‌యంపై ఆయన ఒక ఆడియోను విడుద‌ల చేస్తూ అమరావతిలో ఎస్సీవీ నాయుడు టీడీపీలో చేరుతున్నారని సమాచారం వచ్చిందని, ఒక ఇన్‌చార్జిగా తనకు  కూడా ఆయన చేరిక విషయం అధికారికంగా తెలియదని వాపోయారు.

బూత్‌స్థాయి మొదలుకుని టీడీపీ మండలాధ్యక్షులు, ఇతర నాయకులెవరూ అమరావతికి వెళ్లొద్దని ఆదేశించారు. వైసీపీ నుంచి అతను చేరుతున్నారు కాబట్టి, ఆ పార్టీ నుంచి వెళ్తారని చెప్పుకొచ్చారు. ఈ ఆడియో వైర‌ల్ కావ‌డంతో టిడిపి అథిష్టానం పున‌రాలోచ‌న‌లో ప‌డింది. అమ‌రావ‌తి రావ‌ద్ద‌ని నాయుడుకి సందేశం పంపింది.

దీంతో ఆయ‌న తిరిగి వెనక్కి వెళ్లిపోయారు.శ్రీకాళహస్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి గతంలో ఎమ్మెల్యేగా గెలిచి వైసీపీలో కొనసాగుతున్న ఎస్సీవీ నాయుడు కొంత కాలంగా వైసీపీలో అసంతృప్తిగా ఉన్నారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డికి ఆయనతో పొసగడం లేదు.

దీంతో నాయుడుకి టీడీపీ గ్యాలం వేసింది. ఆయ‌న చేరటంతో కాళహస్తితో పాటుగా సత్యవేడులో ప్రభావం చూపుతారని పార్టీ నేతలు అంచనా వేశారు. దీంతో ఆయ‌న చేరిక‌కు గ్రీన్ సిగ్న‌లో ఇచ్చారు. చివ‌రి నిమిషంలో బొజ్జ‌ల రంగంలోకి దిగ‌డం ఆ ప్ర‌క్రియ వాయిదా ప‌డింది. ఇరువురి నేత‌ల మ‌ధ్య సంఖ్య‌త కుదిర్చేందుకు ఇద్ద‌రిని వచ్చి  త‌న‌ను క‌ల‌వ‌వ‌ల‌సిందిగా చంద్ర‌బాబు వారిని ఆదేశించారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles