చంద్రబాబుకు ఆందోళన కలిగిస్తున్న ముందస్తు సర్వేలు

Tuesday, November 12, 2024

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నప్పటికీ, ఒక వంక టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జిల్లాల పర్యటనలకు, ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జరుపుతున్న యువగళం పాదయాత్రకు అనూహ్యంగా స్పందన లభిస్తున్నప్పటికీ పలు ముందస్తు సర్వేల నివేదికలు మాత్రం ప్రధాన ప్రతిపక్షంలో ఆందోళన కలిగిస్తున్నట్లు తెలుస్తున్నది.

ఎమ్యెల్సీ ఎన్నికలలో వైసీపీకి ఎదురు దెబ్బలు తగలడం, గత ఎన్నికలలో వై ఎస్ జగన్ కు సానుకూల ప్రభావం కలిగించిన కోడి కత్తి కేసుతో పాటు, సొంత బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆత్మరక్షణలో పడవలసి రావడంతో ఒక విధంగా సీఎం జగన్ ఆత్మరక్షణలో పడినట్లయింది. పార్టీలోనే పలు చోట్ల తిరుగుబాట్లు ఎదురవుతున్నాయి.

సహజంగానే ఈ పరిణామాలు టీడీపీ శ్రేణులలో ఉత్సాహం నింపుతున్నాయి. మొన్నటి వరకు జనసేనతో పొత్తు కోసం ఆసక్తి కనబరచిన, ఇప్పుడు ఒంటరిగా ఎన్నికలకు వెళ్లినా గెలుపొందగలమనే భరోసా వారిలో కలుగుతున్నది. అయితే, ముఖ్యంగా వైఎస్ జగన్ కు పట్టున్న గ్రామీణ ప్రాంతాలలో టిడిపి తన పరిధిదాటి విస్తరియింపలేక పోతున్న సంకేతాలు వెలువడుతున్నాయి.

మరో ఏడాదిలో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి పొలిటికల్ కన్సల్టెంట్‌గా ఉన్న రాబిన్ శర్మ బృందంతో పాటు మరో రెండు సంస్థలతో ఏపీలో రాజకీయ వాతావరణంపై సర్వేలు చంద్రబాబు నాయుడు చేయించినట్లు తెలుస్తోంది. అయితే, ఇవ్వన్నీ కూడా టీడీపీ అధికారంకు దగ్గరలో ఉందని చెప్పడమే గాని స్పష్టమైన ఆధిక్యతలో ఉన్నట్లు నిర్ధారింపలేక పోతున్నట్లు చెబుతున్నారు.

ప్రధానంగా 2009, 2014,2019 ఎన్నికల్లో వరుసగా టీడీపీ గెలువని స్థానాల్లో ఎక్కడా కూడా బలంపుంజుకున్న సూచనలు కనబటం లేదని భావిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 53 స్థానాల్లో టీడీపీకి వరుసగా మూడు ఎన్నికల్లో ఓటమి ఎదురైనా నియోజక వర్గాల్లో పట్టు దక్కించుకోవడం టీడీపీకి కష్టమని సర్వే నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు బలపడిందని, సంక్షేమ పథకాలు అందుకునే వారు, అందుకోని వారిలో ప్రభుత్వ వ్యతిరేకత పెరిగిందని, దానితో  వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని టీడీపీ నేతలు భరోసా వ్యక్తం చేస్తున్నారు. అయితే, వైసిపి నాయకత్వంలో మాదిరిగా ఏదేమైనా సరే ఎన్నికల్లో గెలవలసిందే అనే పట్టుదల టిడిపి అగ్రనాయకత్వంలో లోపిస్తున్నట్లు పలు అంచనాలు స్పష్టం చేస్తున్నాయి.

మొదటగా, వైసిపి నాయకత్వం అభ్యర్థి మాత్రమే ఆర్ధిక వనరులను సమకూర్చుకోవాలనే నిర్దుష్టమైన నిబంధనలు లేకుండా, అభ్యర్థి ఎవరైనా ఎవ్వరూ ఊహించని విధంగా వనరులను క్రుమ్మరించడానికి సిద్ధంగా ఉంది. కాగా, ఈ విషయంలో టిడిపి అధినాయకత్వం స్పష్టమైన భరోసా ఇవ్వలేక పోతున్నది. ముఖ్యంగా లోక్ సభ నియోజకవర్గంలో భారీగా నిధులు సమకూర్చగల అభ్యర్థులకు అన్వేషిస్తోంది.

“టిడిపి వద్ద డబ్బు లేదని చెప్పలేము గాని, మా నాయకుడు పెద్ద ఎత్తున ఖర్చు పెట్టడానికి సిద్ధంగా లేరు” అని టిడిపిలో కీలక పాత్ర పోషిస్తున్న ఓ ప్రముఖుడు చెప్పారు. ఇక అధికారంలో ఉన్నప్పుడు మొదటినుండి పార్టీ కోసం పనిచేస్తున్న వారిని నిర్లక్ష్యం చేసి, గాలివాటుగా వచ్చిన వారికి పదవులు కట్టబెట్టిన దుష్ప్రభావం ఇంకా పార్టీని వెంటాడుతోందని  భావిస్తున్నారు. అందుకనే పార్టీ కోసం `రిస్క్’ తీసుకోవడానికి చాలామంది సుముఖంగా లేరని స్పష్టం అవుతుంది.

ముఖ్యంగా ఎన్నికల సమయంలో మొత్తం అధికార యంత్రాంగాన్ని ఉపయోగించుకొని, రాజకీయ ప్రత్యర్థులను వేధింపులకు గురి చేసేందుకు వైసిపి సిద్ధమవుతుండగా, అటువంటి వత్తిడులను టిడిపి ఏవిధంగా ఎదుర్కొంటుందో కూడా ప్రశ్నార్థకంగా మారుతుంది.

ఏపీ ఎదుర్కొంటున్న కీలకమైన అభివృద్ధికి సంబంధించిన సమస్యలపై ఎంతసేపటికి సీఎం జగన్ ను నిందించడం మినహా, టిడిపి విధానం ఏమిటో స్పష్టంగా చెప్పలేక పోవడం కూడా కొంత ప్రభావం చూపే అవకాశం ఉంది. ముఖ్యంగా కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం విషయంలో జగన్, చంద్రబాబులకు చెప్పుకోదగిన తీడా వెల్లడి కావడం లేదు.

మరోవంక, ఈ సారి జగన్ సీట్లు ఇవ్వరని అనుకొంటున్న పలువురు వైసీపీ నాయకులు ఇప్పుడు టిడిపిలో చేరేందుకు ఉత్సాహపడుతున్నారు. మొన్నటివరకు టీడీపీ శ్రేణులను వేధించిన వారిని ఇప్పుడు పార్టీలో చేర్చుకొని, సీట్లు ఇవ్వడం ద్వారా అదనంగా ఓట్లు ఏమాత్రం వస్తాయో గాని మొదటి నుండి టిడిపిని నమ్ముకున్న శ్రేణులలు మాత్రం తీవ్ర నిరాశకు గురయ్యే ప్రమాదం ఉంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles