గౌరవానికి భంగం : పినిపె పసలేని మాటలు!

Wednesday, January 22, 2025

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో మహిళలు ఫోటో దిగారు. ఆ మహిళల్లో ఎంపీ కూడా ఉన్నారు. వారందరూ కుర్చీల్లో కూర్చోగా.. మంత్రి పినిపె విశ్వరూప్ ముఖ్యమంత్రి కుర్చీకి మరొక మహిళ కుర్చీకి మధ్యలో మోకాళ్లపై నిల్చుని ఆ బృందంతో కలిసి ఫోటో దిగారు. ఈ చిత్రం ఇప్పుడు బహుధా వివాదాస్పదం అవుతోంది. దళితుడు కావడం వల్లనే ముఖ్యమంత్రి విశ్వరూప్ ను ఈ విధంగా అవమానించారంటూ పెద్దఎత్తున సోషల్ మీడియా ధ్వజమెత్తుతోంది. ఈ ప్రచారం యావత్తూ ఒక ఎత్తు కాగా.. ఇలాంటి విమర్శలన్నింటినీ ఖండిస్తూ.. తాను బుద్ధిపూర్వకంగానే కిందకూర్చున్నానని, తనను కింద కూర్చోబెట్టగల వాళ్లు లేరని వీరోచితమైన మాటలు అంటూ… విశ్వరూప్ ప్రకటన వివాదాన్ని మరింత పెంచుతోంది.
‘నా గౌరవానికి భంగం కలిగే రోజు వస్తే రాజకీయాలనుంచి పూర్తిగా తప్పుకుంటాను తప్ప కంటిన్యూ కాను. ముప్పయ్యేళ్ల రాజకీయ జీవితంలో కింద కూర్చోవడం మరొకరు నన్ను కింద కూర్చోబెట్టడం జరగలేదు.. అని ఈ మంత్రిగారు అంటున్నారు. మహిళల కార్యక్రమంలో మహిళలే సీఎంతో ఫోటో దిగారని, ఎంపీ కూడా మహిళ కావడం వల్ల కుర్చీలో కూర్చున్నారని.. తనకు జరిగిన అవమానాన్ని కవర్ చేసుకోవడానికి నానా పాట్లు పడుతున్నారు. తొలుత తాను బయట ఉన్నానని, ముఖ్యమంత్రి పిలిస్తేనే వేదిక మీదికి వెళ్లాలనని జగన్ భజన చేయడానికి ప్రయత్నిస్తున్న పినిపె విశ్వరూప్.. వేదిక మీదికి రమ్మని పిలిచిన జగన్.. తానుగా పిలిచిన మంత్రి కూర్చోవడానికి కుర్చీ ఉన్నదో లేదో చూసుకోలేదా? మోకాళ్ల మీద కింద కూర్చుంటే చూస్తూ ఊరుకోవడం అనేదే పెద్ద అవమానం కదా..? అనే ప్రశ్నలు ఇప్పుడు ఎదురవుతున్నాయి.
ముఖ్యమంత్రి జగన్ స్వయంగా ఫోటోకు పిలిచిన సంగతే గనుక నిజమైతే.. తన పక్కన ఉన్న సాధారణ మహిళను మంత్రికోసం కుర్చీ ఖాళీ చేయాలని సీఎం అడగలేకపోయారా? అనే విమర్శలు కూడా వస్తున్నాయి. కుర్చీ లేని గదిలోకి ప్రత్యర్థిని పిలిచి నిలబెట్టి మాట్లాడి పంపే సినిమా సీన్ల మాదిరిగా.. వేదిక మీద కూర్చోవడానికి కుర్చీనే లేకుండా.. మంత్రిని వేదిక మీదకి ఆహ్వానించడం అనేది అవమానించే ఉద్దేశంతో మాత్రమేనని పలువురు అంటున్నారు. ఇప్పటికీ నా గౌరవానికి భంగం కలగలేదు, భంగం కలిగితే రాజకీయాలనుంచే తప్పుకుంటా అంటూ మాటలు చెబితే పినిపె విశ్వరూప్ ఆత్మవంచన చేసుకోవడమే అని అభిప్రాయపడుతున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles