ఉభయ గోదావరి జిల్లాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలవనివ్వను అని.. పవన్ కల్యాణ్ తన వారాహియాత్ర ప్రారంభంలోనే భీషణమైన ప్రతిజ్ఞ చేసిన సంగతి తెలిసిందే. ఆ ప్రతిజ్ఞను నిలబెట్టుకోవడానికి ఆయన నిర్దిష్టమైన కార్యచరణ ప్రణాళికతోనే ముందుకు సాగుతున్నారు. ఉభయగోదావరి జిల్లాల్లో పూర్తిస్థాయిలో పార్టీ బలోపేతం మీద ఆయన ఆల్రెడీ దృష్టి పెట్టారు. అలాగే.. ఆ జిల్లాల్లో అన్ని నియోజకవర్గాల్లోనూ తన వారాహి యాత్ర పూర్తిచేశారు. పొత్తుల్లో భాగంగా తెలుగుదేశంతో సీట్లు పంచుకున్నప్పుడు కూడా.. గోదారి జిల్లాల్లో ఎక్కువ సీట్లు పవన్ ఆశిస్తున్నారని కూడా సంకేతాలు ఉన్నాయి.
ఈ రకంగా జగన్ సర్కారును కూలదోయడానికి గోదారి జిల్లాలమీద పవన్ మేగ్జిమమ్ దృష్టి సారిస్తుండగా.. మరోవైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు పార్టీని ముంచేలా కనిపిస్తున్నాయి. మొన్నటికి మొన్న.. రామచంద్రపురం నియోజకవర్గంలో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణకు వ్యతిరేకంగా ఏ స్థాయిలో అంతర్గత విభేదాలు చెలరేగాయో అందరికీ తెలుసు. ఈ నియోజకవర్గం నుంచి తన కుమారుడు సూర్యప్రకాశరావును పోటీచేయించాలని రాజ్యసభ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ గట్టి పట్టుదలతో ఉన్నారు. జగన్ ఆయనను పిలిపించి బుజ్జగించే ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదు. జగన్ ను కలిసి వెళ్లిన తర్వాత కూడా.. ఎన్నికల్లో తాను గానీ, తన కొడుకు గానీ పోటీచేస్తాం అని పిల్లి ప్రకటించడం చర్చనీయాంశం అయింది. ఆ గొడవనే జగన్ సర్దుబాటు చేసుకోలేకపోతుండగా.. ఈలోగా.. తాజాగా మంత్రి పినిపె విశ్వరూప్, విప్ చిర్ల జగ్గిరెడ్డి మధ్య విభేదాలు కూడా బజార్న పడ్డాయి. సాక్షాత్తూ ముఖ్యమంత్రి జగన్ సమక్షంలోనే ఈ నేతలు తగాదా పడ్డం చర్చనీయాంశం అవుతోంది.
హెలిపాడ్ వద్ద ముఖ్యమంత్రిని స్వాగతించే సమయంలో అక్కడ కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి మీద, మంత్రి పినిపె విశ్వరూప్ అసహనం వ్యక్తం చేశారు. నా నియోజకవర్గంలో నీకేం పని అని ప్రశ్నించారు. దీనికి జవాబుగా ‘తగ్గు తగ్గు’ అన్నట్టుగా జగ్గిరెడ్డి సంజ్ఞలు చేయడాన్ని కూడా సీఎం గమనించారు. ముఖ్యమంత్రి ఎదుటే ఈ ఇద్దరూ విబేదించడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. సీఎం ఏం జరిగిందంటూ ఆరా తీయబోగా.. ఏమీ లేదని అందరూ ముందుకు కదలిపోయారు. నాయకుల మధ్య విభేదాలు పార్టీకి ప్రమాదకరంగా పరిణమిస్తున్నాయనే అభిప్రాయం పలువురిలో కలుగుతోంది.
జగన్మోహన్ రెడ్డి తన పార్టీలోని ముఠాకక్షలను సర్దుబాటు చేసుకోకుండా, వాటి మీద దృష్టి పెట్టకుండా ఎన్నికలకు వెళితే ఆయనకు తల బొప్పి కడుతుందని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు.