గుజరాత్‌ హైకోర్టులో రాహుల్‌గాంధీకి చుక్కెదురు

Sunday, December 22, 2024

ఒక వంక ప్రతిపక్షాలను సమీకరించి కేంద్రంలో బిజెపి ప్రభుత్వాన్ని 2024లో ఓడించడం కోసం తీవ్రమైన కసరత్తు చేస్తుండగా, కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీని న్యాయపరమైన చిక్కులు వరుసగా వెంటాడుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఇంటిపేరు పై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన పరువునష్టం కేసులో రాహుల్‌ గాంధీకి చుక్కెదురైంది. తనకు విధించిన శిక్షను నిలిపివేయాలంటూ రాహుల్ గాంధీ వేసిన స్టే పిటిషన్‌ను గుజరాత్‌ హైకోర్టు కొట్టేసింది. ఈ కేసులో సెషన్స్‌ కోర్టు ఇచ్చిన తీర్పును ఉన్నత న్యాయస్థానం సమర్థించింది. దీంతో రాహుల్ గాంధీకి నిరాశ ఎదురైంది.

హైకోర్టు నిర్ణయంతో రాహుల్ గాంధీపై లోక్‌సభ సభ్యత్వానికి అనర్హత కొనసాగుతుంది. ఆయన ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం ఉండదు. 2019 ఏప్రిల్ 13న కర్ణాటకలోని కోలార్ లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీపై రాహుల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దొంగలందరి ఇంటి పేరు మోదీ ఎలా వచ్చిందని వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై గుజరాత్ కు చెందిన మాజీ మంత్రి పూర్ణేష్ మోడీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

ఈ ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. ఈ కేసును విచారించిన సూరత్ కోర్టు ఈ ఏడాది మార్చి 23న రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్షను విధించింది. దీంతో రాహుల్ గాంధీ ఎంపీ పదవిపై అనర్హత వేటు కూడా పడింది. సూరత్ కోర్టు తీర్పును గుజరాత్ హైకోర్టులో రాహుల్ గాంధీ సవాల్ చేశారు. అయితే గుజరాత్ హైకోర్టులో కూడా రాహుల్ కు చుక్కెదురైంది. సూరత్ కోర్టు తీర్పుపై స్టే ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది.

“రాహుల్ గాంధీపై 10కిపైగా క్రిమినల్​ కేసులు ఉన్నాయి. ప్రస్తుతం దోషిగా తేలిన కేసు తర్వాత కూడా పలు కేసులు దాఖలయ్యాయి. వీర్​ సావర్కర్​ మనవడు కూడా కేసు వేశారు. ఏదిఏమైనా.. మోదీ ఇంటి పేరు వివాదంలో పడిన శిక్షతో రాహుల్​ గాంధీకి అన్యాయం జరిగింది అనడానికి ఏం లేదు! ఈ తీర్పు సరైనదే. సూరత్​ కోర్టు ఆదేశాలపై జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు. అందుకే ఆయన పిటిషన్​ను తిరస్కరిస్తున్నాము,” అని గుజరాత్​ హైకోర్టు తీర్పునిచ్చింది.

ఈ తీర్పులో జోక్యం చేసుకోవలసిన అవసరం లేదని స్పష్టం చేస్తూ గాంధీ అపీలును దానిలోని యోగ్యతల ఆధారంగా సాధ్యమైనంత త్వరగా విచారించి, తీర్పు చెప్పాలని సెషన్స్ కోర్టును ఆదేశించింది.

2024 లోక్​సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాహుల్​ గాంధీపై గుజరాత్​ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో కాంగ్రెస్​కు కూడా షాక్​ తగిలినట్టు అయ్యింది. ఏదైనా కేసులో దోషిగా తేలితే, సంబంధిత వ్యక్తి 8ఏళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిబంధనల్లో ఉంది. అలాంటిది, 2024 ఎన్నికల వేళ రాహుల్​ గాంధీ పోటీ చేయకపోతే ఎలా? అని కాంగ్రెస్​ శ్రేణుల్లో ఆందోళన మొదలైనట్టు తెలుస్తోంది.

ఈ తీర్పును డివిజనల్ బెంచ్ ముందు గాని, సుప్రీంకోర్టు ముందు గాని సవాల్ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే జైలు శిక్షపై కోర్టు స్టే మంజూరు చేయడంతో వెంటనే జైలుకు వెళ్లే అవకాశం లేదు. ఇప్పుడు న్యాయపరంగా ఆయన ఏవిధంగా వ్యవహరిస్తారో చూడాల్సి ఉంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles