కర్ణాటక బిజెపి రాజకీయాలలో ఒకప్పుడు చక్రం తిప్పిన మాజీ మంత్రి గాలి జనార్ధన రెడ్డి ఆ పార్టీని వదిలి పెట్టి, సొంతంగా కళ్యాణ రాజ్య ప్రగతి పేరుతో కొత్త పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించడం రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో సహితం కలకలం రేపుతోంది. గనుల కుంభకోణంలో జైలుపాలయి, పలు కేసులలో నిందితుడిగా ఉంటూ, పుష్కరకాలం పాటు ఒక విధంగా రాజకీయ సన్యాసం తీసుకున్న ఆయన ఇప్పుడు మరో ఐదు నెలల్లో జరుగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో తన బలం ఎంతో చూపడానికి సిద్దపడుతున్నారు.
గనుల కుంభకోణం కేసులలో తనను ఆదుకొనే ప్రయత్నం కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం చేయలేదన్న కోపంతో వచ్చే ఎన్నికలలో కర్ణాటకలో బిజెపి మరోసారి అధికారంలోకి రాకుండా చేయడమే ఆయన లక్ష్యంగా కనిపిస్తున్నది. రాష్ట్ర రాజకీయాల్లో నా అనుకున్న వారే తనను మోసం చేశారని, కష్టకాలంలో ఎవరూ తనకు అండగా నిలబడలేదని ఆయన చెప్పడం గమనార్హం.
మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప, జగదీష్ షెట్టర్ తప్ప మరెవ్వరూ ఇంకెవరూ తన ఇంటికి రాలేదని… వాళ్లిద్దరూ మాత్రమే తనను ప్రోత్సహించారని చెబుతూ ప్రస్తుత బీజేపీ నాయకత్వంపై తన ఆగ్రహాన్ని బహిరంగ పరచారు. కర్ణాటక బీజేపీ రాజకీయాలు అటుంచితే, మొదటి నుంచి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి కుటుంభంకు ఆయనతో సన్నిహిత సంబంధాలు తండ్రి కాలం నుండి ఉన్నాయి.
ముఖ్యంగా రాయలసీమలో పలు అంశాలలో రాజకీయంగా జగన్ కు అండగా ఉంటున్నట్లు చెబుతున్నారు. బిజెపికి వ్యతిరేకంగా ఆయన పార్టీ ప్రారంభిస్తే దాని ప్రభావం జగన్ పై కూడా పడే అవకాశం ఉంది. ముఖ్యంగా టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు సభలకు కర్నూల్, రాజముండ్రి, విజయనగరంలలో అనూహ్యంగా భారీ సంఖ్యలో తరలి రావడం ఇప్పటికే వైసిపి నేతలకు కలవరం కలిగిస్తోంది.
చంద్రబాబు బలం పుంజుకొని, జగన్ ప్రభుత్వం పట్ల ప్రజలలో వ్యతిరేకత పెరుగుతున్నట్లు స్పష్టమైతే మోదీ ప్రభుత్వం నుండి లభిస్తున్న అండదండలు కొనసాగే అవకాశం తక్కువ. పైగా, గాలి జనార్ధనరెడ్డిని కట్టడి చేయమని ఢిల్లీ నుండి వత్తిడులు ఎదురయ్యే అవకాశం కూడా ఉంది.
ఈ పరిస్థితులలో చంద్రబాబు పట్ల బిజెపి వైఖరి మెత్తబడితే జగన్ రాజకీయంగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. మరోవంక, బిఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన కేసీఆర్ సహితం తన దృష్టిని ప్రధానంగా కర్ణాటకలోని పాత హైదరాబాద్ స్టేట్ ప్రాంతాలపై పెడుతున్నారు.
కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ, కాంగ్రెస్ లకు వ్యతిరేకంగా జేడీఎస్ ను గెలిపిద్దామని తాజాగా పార్టీ సమావేశంలో పిలుపునిచ్చారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లొ పోటీ చేస్తామని వెల్లడించారు.
ఇప్పుడు గాలి జనార్ధన రెడ్డి ఏర్పాటు చేయబోయే కొత్త పార్టీ కూడా కేసీఆర్ దృష్టి సారిస్తున్న ప్రాంతాలపైననే కేంద్రీకరించే అవకాశం ఉంది. గతంలో హైదరాబాద్ కర్ణాటకగా ఉన్న ప్రాంతం కావటంతో పాటుగా.. తెలుగు రాష్ట్రాలతో సంబంధాలు కలిగిన వారు ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నారని చెబుతున్నారు.
దీనితో గాలి, కేసీఆర్ పార్టీలు ముఖాముఖి తలపెడితే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లలో చీలిక ఏర్పడి బిజెపి ప్రయోజనం పొందే అవకాశం ఉంది. వీరి రెండు పార్టీలకు కూడా దీంతో, ఇప్పుడు గాలి జనార్ధన్ రెడ్డి కొత్త పార్టీ బీఆర్ఎస్ అంచనాలను దెబ్బ తీస్తుందా?. లేక, బీఆర్ఎస్ ఆ పార్టీకి చెక్ పెడుతుందా? ఈ రెండు పార్టీలు ఎవరి ఓట్ బ్యాంక్ పైన ప్రభావం చూపుతాయనే చర్చ సాగుతోంది.
హైదరాబాద్ కర్ణాటకగా ఉన్న ప్రాంతం ఇప్పుడు కల్యాణ కర్ణాటకగా మారింది. కల్యాణ కర్ణాటకలో బళ్లారి, రాయచూరు, యాదగిరి, కలబురగి(గుల్బర్గా) కొప్పళ, విజయనగర జిల్లాల పరిధిలో 48 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఇప్పుడు గాలి జనార్ధన రెడ్డి ఈ ప్రాంతం కేంద్రంగానే వచ్చే ఎన్నికలకు సిద్దం అవుతున్నారు.
కొప్పల్ జిల్లాలోని గంగవతి నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నట్లు గాలి జనార్ధన రెడ్డి ప్రకటించారు. ఒక విధంగా గాలి పార్టీ పెట్టడం కేసీఆర్ కర్ణాటక ప్రవేశానికి చెక్ పెట్టిన్నట్లే కాగలదు. బీఆర్ఎస్ – గాలి కొత్త పార్టీ రెండూ దాదాపుగా ఒకే ప్రాంతం పైన ప్రధానంగా ఆధారపడబోవడమే అందుకు కారణం.