మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఇటీవల విడుదలైన గాడ్ ఫాదర్ చిత్రం చూశారా? అందులో ఓ దృశ్యం గుర్తున్నదా? తండ్రి మరణిస్తే.. ఆ కార్యక్రమం వద్దకు వస్తాడు గాడ్ ఫాదర్ చిరంజీవి. అయితే, దుర్మార్గులకు తొత్తుగా వ్యవహరిస్తూ ఉండే పోలీసు అధికారి సముద్రఖని గాడ్‌ఫాదర్ తండ్రి మృతదేహం వద్దకే రాకుండా చేయాలని కారును అడ్డుకుంటాడు. అటుగా వెళ్లడానికి వీల్లేదని హుకుం జారీచేస్తాడు. కారును కదలనివ్వడు. అప్పుడు గాడ్ ఫాదర్ కారు దిగుతాడు. కాలినడకన వెళ్లడానికి సిద్ధపడతాడు. గాడ్‌ఫాదర్ అభిమానులందరూ వెల్లువలా వెంట నడుస్తారు. కాలినడకనే వెళ్లి తండ్రికి నివాళి అర్పించే పనిపూర్తిచేసుకుంటాడు గాడ్‌పాదర్!
తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు ఈ గాడ్ ఫాదర్ సన్నివేశాన్ని మరపించారు. ఇదేం ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్న చంద్రబాబునాయుడు, శుక్రవారం అనపర్తిలో కార్యక్రమం నిర్వహించడానికి నిర్ణయించారు. దీనికి సంబంధించి పోలీసులు ముందుగా అనుమతులన్నీ కూడా ఇచ్చారు. తీరా అనపర్తి చేరుకునే సమయానికి అడ్డుకునేందుకు ప్రయత్నించారు.
అనపర్తి సభ వద్ద పోలీసులు చాలా పెద్ద సీన్ క్రియేట్ చేయడం విశేషం. చంద్రబాబు నాయుడు అక్కడకు రాకముందే పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించి, తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా చేరుకోకుండా అడ్డుకున్నారు. నాయకులు, కార్యకర్తలతో వాగ్వాదాలకు దిగారు. చంద్రబాబు నాయుడు అక్కడకు రాకముందే, కార్యకర్తలను చెదరగొట్టడానికి లాఠీ చార్జీ కూడా చేశారు. చివరికి చంద్రబాబు నాయుడు అసలు అనపర్తి వరకు రాకుండానే అడ్డుకుంటే సరిపోతుంది అనే వ్యూహానికి వచ్చారు. బిక్కవోలు మండలం బలభద్రపురం వద్ద చంద్రబాబును బారికేడ్లతో అడ్డుకునే ప్రయత్నం చేశారు. దారికి అడ్డంగా బస్సులు ఉంచి కాన్వాయ్ ముందుకు వెళ్లకుండా అడ్డుకున్నారు.
ఆ తర్వాత సీన్ మాత్రం అచ్చంగా గాడ్ ఫాదర్ సినిమా తరహాలోనే జరిగింది. పోలీసులతో వాదులాడుతున్న తమ పార్టీ కార్యకర్తలను చంద్రబాబు నిలువరించారు. ‘సైకో చెప్పాడని నా సభకు ముందుగా ఇచ్చిన అనుమతులను రద్దు చేస్తారా? రౌడీ రాజ్యాన్ని అంతం చేయడానికి కౌంట్ డౌన్ ప్రారంభిస్తున్నా.. కారును అడ్డుకుంటున్నారు కదా కాలినడకని వెళ్తా ఏం చేస్తారు?’ అంటూ చంద్రబాబు నాయుడు కారు దిగి నడవడం ప్రారంభించారు. కార్యకర్తలు ఆయన వెంబడి అనుసరించారు. అలా కొన్ని వేల మంది వెంట నడుస్తుండగా సుమారు ఏడు కిలోమీటర్ల దూరం చంద్రబాబు కాలినడకన వెళ్లి.. అనపర్తి చేరుకుని అక్కడ కొన్ని గంటల నుంచి నిరీక్షిస్తున్న జన సమూహాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.
పోలీసుల అడ్డుకోవడంతో చైతన్య రథం అక్కడిదాకా వెళ్లలేదు గనుక, ఒక బోలెరో వాహనం ఎక్కి చంద్రబాబు మాట్లాడారు. ఆయన ప్రసంగాన్ని అడ్డుకోవడానికి కూడా పోలీసులు విఫల యత్నాలు చేశారు. విద్యుత్ సరఫరా నిలిపివేశారు. జనరేటర్ వేయనివ్వలేదు. అయినా సరే చంద్రబాబు తన కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని వెళ్లడం విశేషం. పోలీసులు సృష్టించే ఆటంకాలు అధిగమించడానికి కాలినడకనైనా వెళ్లగలనని, గాడ్ ఫాదర్ లో చిరంజీవిని మించి, చంద్రబాబు నాయుడు నిరూపించారని కార్యకర్తలు అంటున్నారు.